ఎమ్మెల్యే నసీర్ వ్యాఖ్యలపై ముస్లింల అభ్యంతరం
లక్ష్మీపురం(గుంటూరు ఈస్ట్): అంజుమన్, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణపై గుంటూరు నగరంలోని తూర్పు నియోజక వర్గంలోని మజ్లిస్ ఉల్ ఉలెమా ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముస్లిం సంఘాల వారు, మత పెద్దలు, నాయకులు, అంజుమన్ సుదీర్ఘ కాల కమిటీ సభ్యులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌వలి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గులాం రసూల్, తెలుగుదేశం పార్టీ నుంచి ప్రస్తుత తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహమ్మద్, జమియతుల ఉలెమా పెద్దలు ముఫ్తి బాసీత్, మాజీ డిప్యూటీ మేయర్ గౌస్, తెలుగుదేశం పార్టీ నాయకుడు షౌకత్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహమ్మద్ మాట్లాడుతూ ముస్లిం మత పెద్దలు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి జన సమీకరణ లేకపోవడం చాలా బాధగా ఉందనన్నారు. ముస్లిం మత పెద్దల కమిటీ సభ్యులు కూడా సమావేశంలో లేకపోవడం, నగరంలో ఉన్న మసీదుల్లో ఉన్న మౌలానాలు, మౌజన్‌లను పిలిచినా జనం భారీ సంఖ్యలో వచ్చే వారని తెలిపారు. పార్టీ సమావేశాలకు రెండు వందల మంది తగ్గకుండా వస్తున్నారని, ఇప్పుడు పట్టుమని 50 మంది కూడా లేకపోవడం బాధగా ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అంజుమన్–ఏ–ఇస్లామియా సంస్థకు సంబంధించిన చినకాకానిలోని 71.57 ఎకరాల భూమిపై ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ ఇచ్చిన నోటిఫికేషన్ గురించి ప్రస్తావించలేదు. పైగా ఎమ్మెల్యే అయిన తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. ముస్లిం సంఘాలు, పెద్దలు, ఆయా పార్టీల నాయకులు తమవంతుగా కార్యాచరణకు దిగాలన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నందున ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతానని చెప్పారు.
ఖండించిన మత పెద్దలు
ఎమ్మెల్యే నసీర్ అహమ్మద్ సంభాషణ పూర్తి అయిన తరువాత ముస్లిం మత పెద్దలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సంఘం గురించి కించపరిచేలా మాట్లాడటం సబబు కాదని, ఈ సమావేశం ఏర్పాటు చేయడం ప్రధాన ఉద్దేశం జన సమీకరణ కాదన్నారు. జన సమీకరణ ఎలా ఉంటుందో తమ సంఘం అనేక మార్లు చూపించడం జరిగిందని ఎమ్మెల్యే నసీర్‌ను నిలదీశారు. కించపరిచేలా మాట్లాడటం తన ఉద్దేశం కాదని, జన సమీకరణ ఉంటే బాగుంటుందని చెప్పడం మాత్రమే తన ఉద్దేశం అని సమర్థించుకునే యత్నం చేశారు.


