సంక్రాంతి బాదుడు..! | - | Sakshi
Sakshi News home page

సంక్రాంతి బాదుడు..!

Jan 8 2026 7:12 AM | Updated on Jan 8 2026 7:12 AM

సంక్ర

సంక్రాంతి బాదుడు..!

పట్నంబజారు: సంక్రాంతి పండుగను అవకాశంగా మలుచుకుని ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల ఆపరేటర్లు ప్రయాణికులను చార్జీల పేరుతో బాదేస్తున్నారు. పట్టపగలే దోపిడీకి పాల్పడుతున్నారు. గుంటూరు నగరంలోని లాడ్జ్‌ సెంటర్‌, బీఆర్‌ స్టేడియం, ఆర్టీసీ బస్టాండ్‌, బృందావన్‌గార్డెన్స్‌, కాకాని రోడ్డులో అనేక ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఉన్నాయి. గుంటూరు జిల్లా పరిధిలో సుమారుగా 200పైగా ప్రైవేట్‌ బస్సుల కార్యాలయాలు కొనసాగుతున్నాయి. స్వగ్రామాలకు వెళ్లాలనే ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని, ఆర్టీసీ చార్జీలకు రెండు నుంచి మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. ఇలా ప్రైవేటు ట్రావెల్స్‌ ప్రజలను దోచుకుంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు నుంచి హైదరాబాద్‌, చైన్నె, బెంగళూరు, తిరుపతి వంటి ప్రధాన నగరాలకు వెళ్లే బస్సుల్లో సాధారణ చార్జీలు మచ్చుకై నా కనిపించడం లేదు. ‘టికెట్‌ కావాలంటే ఇదే రేటు’ అన్నట్టుగా ట్రావెల్స్‌ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. ప్రత్యామ్నాయం లేక ప్రయాణికులు అధిక చార్జీలు చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటివరకు ఆర్టీసీ హైదరాబాద్‌, చైన్నె, వైజాగ్‌, బెంగళూరుతోపాటు ఇతర ప్రాంతాలకు ఎన్ని బస్సులు తిప్పాలనే నిర్ణయం తీసుకోలేదు. గుంటూరు ఆర్టీసీ పరిధిలో గుంటూరు డిపో 1, డిపో 2, తెనాలి, పొన్నూరు, మంగళగిరి డిపోలతో కలిపి సుమారు 400 బస్సులు వరకు ఉన్నాయి. సీ్త్ర శక్తి పథకం వచ్చిన తరువాత దూరప్రాంతాల బస్సుల సంఖ్యను అధికారులు తగ్గించారు. పండుగల సీజన్‌లో సైతం బస్సులు ఏర్పాటుపై మీనమేషాలు లెక్కిస్తున్నారు. సుమారు 250 నుంచి 300 బస్సుల వరకు మహిళల ఉచిత ప్రయాణానికే సరిపోతున్నాయని ఆర్టీసీ అధికారులు చెప్పకనే చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితి ప్రయాణికులు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. ట్రావెల్స్‌ కార్యాలయాల వద్ద నేరుగా టికెట్లు తీసుకునే ప్రయాణికుల నుంచి ఆన్‌లైన్‌ కన్నా ఎక్కువగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. చివరి నిమిషంలో బస్సు టైమింగ్‌ మార్పులు, బస్సు రద్దు, వేరే బస్సులకు మారుస్తామంటూ గందరగోళం సృష్టించడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా రవాణా శాఖ అధికారులు ఎక్కడా కనిపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పండుగల సమయంలో ప్రత్యేక తనిఖీలు, నిర్ణీత చార్జీలను అమలు చేయాల్సిన అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నట్లు చెప్పారు. ఫిర్యాదులకు స్పందన లేకపోవడం ప్రైవేటు ట్రావెల్స్‌ యాజమాన్యాలు మరింత రెచ్చిపోతున్నాయి. చార్జీల పేరిట చేస్తున్న దోపిడీకి తక్షణమే అడ్డుకట్ట వేయాలని, ఆర్టీసీ ప్రత్యేక బస్సుల సంఖ్యను పెంచాలని, అధిక చార్జీలు వసూలు చేస్తున్న ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

బహిరంగంగానే దోపిడీ

గుంటూరు–హైదరాబాద్‌ మార్గంలో ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు చార్జీ రూ.600–700 మధ్య ఉంది. ఏసీ గరుడ ప్లస్‌ బస్సుల్లో రూ.1,000 లోపే ఉంది. అదే మార్గంలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు రూ. 2 వేల నుంచి రూ.3 వేల వరకు టిక్కెట్‌ ధరలు నిర్ణయించారు. స్లీపర్‌ బస్సుల పరిస్థితి అయితే.. రూ 4 వేల పైమాటేనని ప్రయాణికులు వాపోతున్నారు. గుంటూరు–చైన్నె మార్గంలో ఆర్టీసీ ఏసీ చార్జీ సుమారు రూ.1,300 గా ఉంది. ప్రైవేటు బస్సుల్లో రూ.2,800 నుంచి రూ.3,000 వరకు పలుకుతోంది. గుంటూరు–బెంగళూరు మార్గంలో ఆర్టీసీ ఏసీ స్లీపర్‌ చార్జీ రూ.1,700–1,800గా ఉంటే, ప్రైవేటు ట్రావెల్స్‌లో అదే టికెట్‌ రూ.3,000 దాటుతోంది.

ప్రైవేటు ట్రావెల్స్‌లో

ఆర్టీసీ టికెట్‌కు మూడింతల ధర

పండగ రద్దీ అదనుగా

సామాన్యుడి జేబుకు చిల్లు

చంద్రబాబు పాలనలో కనీసం

నోరు మెదపని యంత్రాంగం

ఇష్టారాజ్యం

ప్రత్యేక బస్సుల సంగతేంటో?

అడిగే దిక్కు లేదు...

సంక్రాంతి బాదుడు..! 1
1/1

సంక్రాంతి బాదుడు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement