మొక్కజొన్నకు కత్తెర పోటు | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్నకు కత్తెర పోటు

Jan 9 2026 7:23 AM | Updated on Jan 9 2026 7:23 AM

మొక్క

మొక్కజొన్నకు కత్తెర పోటు

● మొక్కజొన్న పంటలో అధికంగా కత్తెర పురుగు ఉధృతి ● అలసత్వం వహిస్తే దిగుబడులపై ప్రభావం చూపే అవకాశం ● తొలిదశ గొంగళి పురుగులను నివారించేందుకు ఎకరాకు 500 మి.లీ క్లోరిఫైరిఫాస్‌ లేదా 400 మి.లీ క్వినాల్‌ఫాస్‌ మందులను పిచికారీ చేసుకోవాలి ● గొంగళి పురుగుల ఉధృతి అధికంగా ఉంటే ఎమోమెక్టిన్‌ బెంజోయేట్‌ 5 ఎస్‌.డి 80 గ్రాములు లేదా స్పైనోశాడ్‌ 45 శాతం ఎస్‌.సి. 60 మి.లీ ఎకరాకు సుడులు లేదా మొవ్వు లోపలి ఆకులు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి రెండు, మూడు సార్లు పిచికారీ చేయాలి.

రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి

ప్రత్తిపాడు: మొక్కజొన్న రైతులను కత్తెర పురుగు కలవరపెడుతుంది. పంటను కత్తెర పురుగు విస్తృతంగా ఆశించడంతో రైతులు అల్లాడిపోతున్నారు. పత్తిలో గులాబిరంగు పురుగు, మిర్చిలో నల్ల తామర పురుగు దెబ్బకు భయపడి.. ఈ ఏడాది రబీలో రైతులు మొక్కజొన్న వైపు ఆసక్తి చూపారు. అయితే ఊహించని విధంగా పంటపై కత్తెర పురుగు దాడి చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పురుగు ఆకులను కొరకడంతో పాటు మొవ్వను కూడా నాశనం చేస్తుంది. రైతులు అలసత్వం వహిస్తే 50 నుంచి 75 శాతానికి దిగుబడులపై పురుగు ప్రభావం పడే అవకాశాలున్నాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఈ రబీలో ఇప్పటికి గుంటూరు డివిజన్‌లో 2,838 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు.

యాజమాన్య పద్ధతులతో..

రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా కొంత మేర పురుగు ఉధృతిని నివారించుకోవచ్చు. లోతు దుక్కులు దున్నుకుంటే పురుగు కోథస్థ దశలు నాశనం అవుతాయి. పైరు చుట్టూ నాలుగు వరుసలు నేపియర్‌ గడ్డిని ఎర పంటగా వేసుకోవాలి. ఎకరానికి 4–5 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. గుడ్ల సముదాయాలను గుర్తించి ఏరివేసి నాశనం చేయాలి. ఇప్పటి వరకు విత్తుకోని రైతులు విత్తనశుద్ధి చేసుకుని సయాంత్రలోలిపోల్‌, థయోమిథాక్సోమ్‌ను కిలో విత్తనాలకు ఐదు మి.లీ కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.

రసాయన పద్ధతులు..

విషపు ఎరల ద్వారానూ..

పురుగు ఉధృతిని విషపు ఎరల ద్వారా కూడా నియంత్రించవచ్చు. 10 కిలోల తవుడును రెండు కిలోల బెల్లంతో రెండు లీటర్ల నీరు కలిపి రాత్రంతా పులియబెట్టి, రెండవ రోజు పులియబెట్టిన మిశ్రమంలో 100 గ్రాముల థయోడికార్బ్‌ మందును జోడించి సాయంత్రం వేళల్లో మొవ్వలో పడేట్లు పిచికారీ చేయాలి.

మొక్కజొన్న పంటను సాగు చేసే రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి. కత్తెర పురుగు ఉధృతి అధికంగా ఉంది. యాజమాన్య పద్ధతులతో పురుగును నివారించకుంటే దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుంది. రైతులు అప్రమత్తంగా ఉండాలి. సాగు చేసిన పదిహేను రోజుల నుంచే గమనిస్తూ ఉండాలి.

– ఎన్‌.మోహన్‌రావు, ఏడీఏ, గుంటూరు.

మొక్కజొన్నకు కత్తెర పోటు 1
1/1

మొక్కజొన్నకు కత్తెర పోటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement