తల్లడిల్లుతున్న ఉల్లి రైతు
చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంతో నష్టాలు మార్కెట్‌లో తగిన ధర లేక కన్నీళ్లు
తాడేపల్లి రూరల్: చంద్రబాబు సర్కారు హయాంలో ఉల్లి రైతులు నష్టాలతో తల్లడిల్లుతున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి గిట్టుబాటు ధరలు లేక అన్ని పంటల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఉల్లి రైతులు పెట్టిన పెట్టుబడులు రాక కన్నీరు పెడుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో వాణిజ్య పంటలు పండే పొలాల్లో కౌలు మొత్తం ఆకాశాన్ని అంటుతోంది. రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు కౌలు మొత్తం తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు ఆర్థికంగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. నియోజకవర్గంలో పెనుమాక, ఉండవల్లి, యర్రబాలెం, నవులూరు ప్రాంతాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. ఈ సంవత్సరంలో అధిక వర్షాల వల్ల, కొండవీటి వాగు వరదల వల్ల పంట దెబ్బతింది. రైతులు నారు వేసే సమయంలో కిలో ధర రూ. 50 నుంచి రూ. 60 ఉండగా, ప్రస్తుతం మార్కెట్‌లో రూ. 30 ఉంది. ఈ ప్రాంతంలో ఉల్లి దిగుబడి రాగానే దళారులు ఆ ధరను తగ్గించి కేజీ రూ.15కి కొంటున్నారు. టన్ను రూ. 15 వేలు మాత్రమే. దిగుబడి తగ్గడంతో రైతులకు పెట్టుబడి కూడా రాక రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు ఎకరాకు నష్టపోతున్నారు. కౌలు అదనంగా చెల్లించాల్సిందే. పెనుమాక, ఉండవల్లిలో ఎకరానికి రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు కౌలు తీసుకుంటున్నారు. ఉల్లి సాగు ప్రారంభించిన దగ్గర నుంచి రూ. 1.20 లక్షలు అవుతుందని రైతులు చెబుతున్నారు. పెనుమాకలో శ్రీనివాసరావు అనే రైతు ఉల్లి పీకి కోత కోయగా 4.5 టన్నులు అయ్యింది. టన్ను రూ. 15 వేలకు అమ్మగా.. సుమారు రూ.75 వేలు వచ్చాయి. రూ.50 వేల వరకు నష్టం వచ్చిందని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
భారీగా ఖర్చులు
ఉల్లి రైతులు కనీసం రూ.50 వేలు కౌలుకు చెల్లిస్తున్నారు. దుక్కి దున్నడానికి, బోదులు వేయడానికి రూ.10 వేలు, ఉల్లినారు కొనుగోలుకు రూ.40 వేలు, నాట్లు వేయడానికి రూ.18 వేలు, ఎరువులకు రూ.18 వేలు, పురుగు మందులకు రూ.10 వేలు, కలుపునకు రూ.12 వేలు, ఉల్లి పీకడానికి, మోయడానికి రూ.16 వేలు ఖర్చు పెడుతున్నట్లు రైతులు తెలిపారు. బయట మార్కెట్‌లో రూ.30కి కిలో విక్రయిస్తుండగా , రైతుల వద్ద రూ. 15కు కొనుగోలు చేస్తున్నారు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


