‘సరస్’లో ఆకలి కేకలు
గుంటూరు: నగరంలో గత రెండు రోజులుగా జరుగుతున్న సరస్ అఖిల భారత డ్వాక్రాబజార్‌లో భోజనాలకు ఇబ్బందులు పడుతున్నామని స్టాల్స్‌లోని సిబ్బంది, ప్రాంగణంలో పనులు చేస్తున్న వారు వాపోతున్నారు. సిబ్బందికి సరిపడా భోజనాలను వండాలని కోరుతున్నారు. ప్రాంగణంలో సుమారు 300కు పైగా స్టాల్స్, వాటిలో ప్రతి షాప్‌కు కనీసం ఒకరిద్దరు, అదేవిధంగా పర్యవేక్షణకుగానూ మరో 300 మంది అధికారులు, సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారు. ప్రాంగణం పరిశుభ్రత నిర్వహణకు మరో 300 మంది ఉన్నారు. నగర మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిలో కూడా 400 మందిని అధికారులు కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో పూటకు కనీసం 700 నుంచి వెయ్యి మందికి భోజన వనతి కల్పించాల్సి ఉంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో వసతులు ఎలా ఉన్నా, మధ్యాహ్నం సమయంలో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని అధికారులు, సిబ్బంది వాపోతున్నారు. రూ.కోట్ల ప్రజా ధనాన్ని వెచ్చించి నిర్వహిస్తున్న కార్యక్రమంలో వసతులు కల్పించటంలో యంత్రాంగం విఫలమైందని సిబ్బంది చర్చించుకుంటున్నారు. మధ్యాహ్నం సమయంలో యంత్రాంగం ఒకటి రెండు స్టాళ్లను ఏర్పాటు చేస్తుండటం, టోకెన్‌లను సక్రమంగా పంపకపోవటం, ఒకొక్కసారి భోజనం అయిపోయి గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని అంటున్నారు. కూర ఉంటే భోజనం లేక, భోజనం ఉంటే కూర సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. దాదాపు మరో పది రోజులపాటు నిర్వహించాల్సిన ఈ కార్యక్రమంలో భోజనాలు సక్రమంగా ఏర్పాటు చేయకపోవటంతో మున్ముందు ఇబ్బందేనని పేర్కొన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ప్రారంభించిన కార్యక్రమంలోనే ఏర్పాట్లు ఇలా ఉంటే ఎలా అని సిబ్బంది పెదవివిరుస్తున్నారు.
గంటల తరబడి వేచి చూడాల్సి
వస్తోందని పలువురు ఆవేదన
‘సరస్’లో ఆకలి కేకలు


