ఆరోగ్య కార్డుల్లో డిజిడల్!
డిజిటల్ హెల్త్ ఐడీ కార్డులో సమాచారం శూన్యం కేవలం ఓపీ చీటీకే పరిమితం అవుతున్న వైద్యులు హెల్త్ సెక్రటరీ ఆదేశించినా మారని అధికారుల తీరు ఆలస్యం కారణంగా రోగులకు ఓపీలో తప్పని కష్టాలు అబా కోసం వచ్చిన నిధులు, కంప్యూటర్లు మాయం
గుంటూరు జీజీహెచ్‌లో కేంద్ర ప్రభుత్వ పథకం అమలుపై నిర్లక్ష్యం
గుంటూరు మెడికల్: ఆధార్ కార్డు నంబర్ మాదిరిగానే అబా నెంబర్‌ను ఆన్‌లైన్‌లో ఎంటర్ చేయగానే రోగి చికిత్సకు సంబంధించిన పూర్తి సమాచారం వస్తుంది. తద్వారా దేశంలో ఏ ఆస్పత్రికి వెళ్లినా హెల్త్ ఫైల్ అంతా ఈ కార్డు నెంబర్‌తో వైద్యులకు తెలిపి, తగిన చికిత్స పొందవచ్చు. రోగికి పూర్తి సమాచారం అబా హెల్త్ కార్డు ద్వారా చికిత్స అందించే ఇతర వైద్యులకు సైతం తెలుస్తుంది. వైద్యులు కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా, పలుమార్లు పరీక్షలు చేయకుండా రోగికి సత్వర చికిత్స అందించి ప్రాణాలు కాపాడవచ్చు. ఒకసారి అనారోగ్యం వచ్చి చికిత్స చేయించుకున్న తరువాత తగ్గిన తర్వాత మళ్లీ సమస్య వస్తే అబా హెల్త్ కార్డు నెంబర్‌తో తక్షణమే వైద్య సేవలు ప్రారంభించవచ్చు. ఇలా రోగి చికిత్సలో ఎంతో కీలక పాత్ర పోషించే ఈ కార్డులను గుంటూరు జీజీహెచ్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. కేవలం ఓపీలో పేరు నమోదు కోసం అబా హెల్త్ కార్డు ఓపెన్ చేసి ఇక ఎలాంటి సమాచారం అందులో నమోదు చేయడం లేదు.
ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశించినా..
ఈ మిషన్ పనితీరుపై గత ఏడాది నవంబర్ 30న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్‌గౌర్ గుంటూరు జీజీహెచ్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కోసం రోగులు పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా చూశారు. కేవలం ఓపీ చీటీ తీసుకోవటం కోసమే అరగంటకు పైగా ఒక్కో రోగి సమయం వెచ్చిస్తున్నారు. ఈ విషయాన్ని పరిశీలించి ఓపీ చీటీ తీసుకునే సమయం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేటికీ రోగులను అవే బాధలు వెంటాడుతున్నాయి. స్వయంగా ఓపీ చీటీని సాధారణ రోగిలా తీసుకుని వార్డులో వైద్యుల వద్దకు సౌరభ్‌గౌర్ వెళ్లి వైద్యులు సదరు వివరాలు ఆన్‌లైన్ హెల్త్ కార్డులో నమోదు చేయటం లేదని గుర్తించారు. కేవలం ఓపీ చీటీ మాత్రమే ఎన్‌రోల్ చేయటాన్ని తప్పుబట్టారు. ఆన్‌లైన్ హెల్త్ కార్డులో వివరాలన్నీ నమోదు చేయాలని గుంటూరు జీజీహెచ్ అధికారులకు ఆదేశించినా బేఖాతర్ చేస్తున్నారు.
నిధులు ఏమయ్యాయి?
డిజిటల్ హెల్త్ ఐడీ కార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తుంది. గుంటూరు జీజీహెచ్‌కు 2023లో రూ.84 లక్షలు మంజూరు చేసింది. కార్డులు ఎక్కువ సంఖ్యలో చేసినందుకు ఈ నిధులు ఇచ్చింది. దేశ వ్యాప్తంగా అబా హెల్త్ ఐడీ కార్డులు ఎక్కువ చేసిన యూపీలోని ప్రయాగ్‌రాజ్ స్వరూప్‌రాణి జవహర్‌లాల్‌నెహ్రూ హాస్పటల్‌కు ప్రథమ స్థానం రాగా, గుంటూరు జీజీహెచ్‌కు దేశంలో రెండో స్థానం లభించింది. ఆధార్‌ను అనుసంధానం చేస్తూ అబా హెల్త్ కార్డులు ఇస్తున్నారు. నాడు విడుదల చేసిన నిధులతో కొన్ని కంప్యూటర్లు కొనుగోలు చేశామని ఆస్పత్రి అధికారులు లెక్కల్లో చూపించారు. ఆ కంప్యూటర్లు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. నేటి వరకు లెక్క లేదు. హెల్త్ సెక్రటరీ ఆదేశాలతో డిజిటల్ హెల్త్ ఐడీలు చేసేందుకు కంప్యూటర్లు లేవని కుంటిసాకులు చెబుతూ ఆస్పత్రి అధికారులు కాలం నెట్టుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాన్ని, రోగులకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమాన్ని నీరు గారుస్తున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికై నా స్పందించి జీజీహెచ్‌లో హెల్త్ ఐడీ కార్డులు పూర్తి స్థాయి వివరాలతో నమోదు అయ్యేలా, ఓపీ చీటీల వద్ద జాప్యం లేకుండా త్వరగా చూడాలని పలువురు కోరుతున్నారు.
వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం వచ్చిన రోగిని ఏ డాక్టర్ పరీక్షించారు, ఏ పరీక్షలు చేశారు, ఏ మందులు ఇచ్చారు, వార్డులో చేరితే ఎలాంటి సేవలు అందాయి. భోజనం ఎంత బాగా పెట్టారు... ఇలా ప్రతి విషయం ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కేంద్రం పథకాన్ని ప్రవేశపెట్టింది. దాని పేరే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఇందులో భాగంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (అబా) ప్రక్రియ గుంటూరు జీజీహెచ్‌లో పేరుకు కూడా అమలు చేయడం లేదు. రోగుల వివరాలు ఆన్‌లైన్ కావడం లేదు.
ఆరోగ్య కార్డుల్లో డిజిడల్!


