రేపటి నుంచి వార్షిక నాటకోత్సవాలు
నగరంపాలెం: గుంటూరు కళాపరిషత్ వార్షిక నాటకోత్సవాలను ఈ నెల 9వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు పీవీ మల్లికార్జునరావు, ఉపాధ్యక్షుడు నాయుడు గోపి తెలిపారు. గుంటూరు మార్కెట్ కూడలిలో శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బుధవారం మీడియా సమావేశంలో నాటకోత్సవాల బ్రోచర్లను నిర్వాహకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 9, 10, 11 తేదీల్లో 28వ వార్షిక నాటకోత్సవాలు జరగనున్నాయని తెలిపారు.
కార్యక్రమాలు ఇలా...
9న సాయంత్రం జ్యోతిప్రజ్వలన చేసి, అనంతరం శర్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంఘం (శ్రీకాకుళం జిల్లా) ఆధ్వర్యంలో మాయాజాలం (సాంఘిక నాటిక), తదుపరి ప్రారంభ సభ ఉంటుందని అన్నారు. రాత్రి స్వర్ణ సూర్య డ్రామా లవర్స్ (హైదరాబాద్) సీ్త్రమాత్రేనమః (సాంఘిక నాటిక)తోపాటు విజయవాడ సాంస్కృతిక సమితి ‘మమ్మల్నీ బ్రతకనీయండి’ (సాంఘిక నాటిక) ప్రదర్శన ఉంటాయని చెప్పారు. 10న రాత్రి కళానికేతన్ (వీరన్నపాలెం) వారి ‘దీపం కింద చీకటి’ (సాంఘిక నాటిక), బీవీకే క్రియేషన్స్ (కాకినాడ) వారి ‘కన్నీటికి విలువెంత’ (సాంఘిక నాటిక), ‘అన్నదాత’ సాంఘిక నాటికలు ప్రదర్శిస్తారని వివరించారు. 11న రాత్రి ఏపీ ప్రజానాట్య మండలి (విశాఖపట్నం) వారి ‘ఒక రాక్షసుడి కథ’ (సాంఘిక నాటిక), మైత్రీ కళానిలయం (విజయవాడ) వారి ‘వాస్తవం’ (సాంఘిక నాటిక), ‘గంగోత్రి’ (పెదకాకాని) వారి ‘పేగు రాసిన శాసనం’ (సాంఘిక నాటిక) ప్రదర్శిస్తారని తెలిపారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి బండ్ల పూర్ణచంద్రరావు, గౌరవ సలహాదారు ఆలోకం పెద్దబ్బాయి, కార్యవర్గ సభ్యులు పోపూరి శివరామకృష్ణ, షేక్ సైదా, రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.


