అడ్డగోలుగా అక్రమ మట్టి తవ్వకాలు | - | Sakshi
Sakshi News home page

అడ్డగోలుగా అక్రమ మట్టి తవ్వకాలు

Jan 7 2026 7:49 AM | Updated on Jan 7 2026 7:49 AM

అడ్డగోలుగా అక్రమ మట్టి తవ్వకాలు

అడ్డగోలుగా అక్రమ మట్టి తవ్వకాలు

వాహనాలను అడ్డుకున్న రాజధాని రైతులు పోలీసులకు సమాచారమిచ్చినా స్పందన శూన్యం

తాడేపల్లి రూరల్‌: రాజధాని గ్రామాల్లో మట్టి అక్రమంగా తరలించే లారీలు అర్ధరాత్రి సమయంలో పెద్దగా శబ్దాలు చేస్తూ రాకపోకలు సాగిస్తుండడంతో స్థానికులు ఆగ్రహించారు. రాజధాని రైతులు సోమవారం అర్ధరాత్రి పెనుమాక గ్రామంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలను నిలిపివేశారు. ఆ సమయంలో డ్రైవర్లు పెద్దగా హారన్లు కొట్టడం, వాహనాలకు ఉన్న లైట్లను తీయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.కోట్ల విలువ చేసే పంటపొలాలను రాజధాని నిర్మాణానికి ఇస్తే కొంతమంది అక్రమంగా మట్టి తవ్వుతున్నారని వారు వాపోయారు. కనీసం పోలీసులుగానీ, ప్రభుత్వంగానీ, సీఆర్‌డీఏ అధికారులుగానీ అడ్డుకోవడంలొ విఫలమయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటకుపైగా లారీలను ఆపి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చినా ఎవరూ స్పందించలేదని తెలిపారు. రాజధానికి భూములు ఇచ్చి త్యాగం చేసిన రైతులకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఒక్క రాత్రికే రూ.లక్షలు

భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం సంవత్సరానికి కౌలు కింద రూ. 30వేలు ఇస్తున్నారు. రాజధానిలోని తమ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వేవారు ఒక్క రాత్రికి రూ.లక్షలు సంపాదిస్తున్నారని వారు తెలిపారు. ఇంత దోపిడీ జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, రేపు మాకు ప్లాట్లు కేటాయిస్తే ఆ ప్లాట్లలో మట్టి తవ్వకాల వల్ల గుంతలు ఏర్పడి మళ్లీ రూ. లక్షలతో మట్టి తోలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు చెప్పారు. రాజధానిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఏ లారీలు ఎటు వెళుతున్నాయో అర్థం కావడం లేదని నాయకులు అంటున్నారు. ప్రతిచోట పనిచేసే వాహనాలకు జీపీఎస్‌ ఏర్పాటు చేసి ఆ పని వద్ద భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తే అక్రమ తవ్వకాలు నివారించే అవకాశం ఉంది. ఇంత చిన్న విషయాన్ని కూడా అధికారులు విస్మరిస్తున్నారంటే మట్టి మాఫియాతో వారికి సంబంధం ఉందని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రాణ భయం...

రాత్రి సమయంలో అమరావతి, కృష్ణాయపాలెం, యర్రబాలెం రోడ్లలో భారీ శబ్దాలు చేసుకుంటూ లారీలు తిరుగుతుంటే చిన్నపిల్లలు, వృద్ధులు ఉలిక్కిపడి నిద్ర లేస్తున్నారు. ఈ లారీల వల్ల తమకు ప్రాణ భయం ఉంది. కనీసం గ్రామాల్లో వేగ నియంత్రణ లేకపోవడం వల్ల డ్రైవర్లు కొంతమంది మద్యం మత్తులో ఇష్టారాజ్యంగా తోలుతున్నారని చెప్పారు. మలుపు వచ్చినా, గొయ్యి ఉన్నా, స్పీడ్‌ బ్రేకర్‌ కనబడినా ఆపకుండా హారన్‌పై చేయి వేసి నడపడంతో ఆ శబ్దాలకు గుండెలు అదురుతున్నాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement