పోలీసులే కిడ్నాపర్ల అవతారమెత్తి.. | YSRCP Leader Sarpanjari Thambireddy Kidnapped | Sakshi
Sakshi News home page

పోలీసులే కిడ్నాపర్ల అవతారమెత్తి..

Apr 3 2026 6:10 AM | Updated on Apr 3 2026 6:10 AM

YSRCP Leader Sarpanjari Thambireddy Kidnapped

తంబిరెడ్డిని కోర్టుకు తీసుకెళ్తున్న లాలాపేట పోలీసులు

వైఎస్సార్‌సీపీ నేత తంబిరెడ్డి కిడ్నాప్‌.. 

రెండు రోజులపాటు వివిధ స్టేషన్లకు తీసుకెళ్లి చిత్రహింసలు

తిరుపతిలో మిస్సింగ్‌ కేసు నమోదు

హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌.. చివరకు అక్రమ కేసుపెట్టి అరెస్టు చూపించిన పోలీసులు

పట్నంబజారు/నగరంపాలెం (గుంటూరు ఈస్ట్‌): పోలీసులే కిడ్నాపర్ల అవతారమెత్తి తిరుపతి మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత సర్పంజరి తంబిరెడ్డిని గుంటూరుకు ఎత్తుకొచ్చారు. రెండు రోజులపాటు అజ్ఞాతంలో ఉంచి చిత్రహింసలకు గురి చేశారు. తంబిరెడ్డి ఏమయ్యాడో అర్థంకాక కుటుంబ సభ్యులు తిరుపతిలో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌ కేసు నమోదైంది. అతడి జాడకోసం హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు కావడం.. ఈ వ్యవహారాన్ని న్యాయమూర్తి సీరియస్‌గా పరిగణించడంతో ఎట్టకేలకు గుంటూరు లాలాపేట పోలీసుల అదుపులో ఉన్నట్టు హైకోర్టుకు సమాచారం ఇచ్చారు.

వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్‌ మండలం తుమ్మలగుంటకు చెందిన తంబిరెడ్డి తుమ్మలగుంట గ్రామ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మార్చి 31న మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో తిరుపతిలో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ వద్ద ఉండగా కొందరు వ్యక్తులు తంబిరెడ్డిని బలవంతంగా కారులో ఎక్కించుకుని ఎత్తుకెళ్లిపోయారు. అదే రోజు రాత్రి గుంటూరు తీసుకొచి్చ.. అజ్ఞాతంలో ఉంచి చిత్రహింసలు పెట్టారు. తంబిరెడ్డి ఏమయ్యాడో అర్థం కాక కుటుంబ సభ్యులు తిరుపతి వెస్ట్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌ కేసు నమోదైంది. 

రిమాండ్‌ తిరస్కరణ
తంబిరెడ్డి జాడ తెలియని కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ లీగల్‌ విభాగం సభ్యులు హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి సీరియస్‌ అవ్వడంతో గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో లాలాపేట పోలీసుల అదుపులో ఉన్నట్టు హైకోర్టుకు సమాచారం ఇచ్చారు. దీంతో వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ న్యాయవాదులు లాలాపేట స్టేషన్‌కు చేరుకుని అధికారులతో మాట్లాడారు. రాత్రి 8 గంటల తర్వాత  తంబిరెడ్డిని కోర్టులో హాజరుపరిచారు. 2024లో టీడీపీ కూటమి నాయకులపైన, తాజాగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన నాయకురాలు రాయపాటి అరుణ, కిరాక్‌ ఆరీ్పలపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టాడంటూ టీడీపీ సోషల్‌ మీడియా కు చెందిన పానకాల లక్ష్మీహేమంత్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తంబిరెడ్డిని అరెస్ట్‌ చేసినట్టు కోర్టుకు తెలిపారు. 

మొత్తం ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది చెప్పకుండా రహస్యంగా ఉంచారు. పోలీసులు తంబిరెడ్డిని తీవ్ర వేధింపులకు గురిచేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేవలం వైఎస్సార్‌సీపీ నాయకుడనే కారణంగా కక్షపూరితంగా వ్యవహరించారన్నారు. తంబిరెడ్డిని గురువా రం రాత్రి గుంటూరు శ్యామలానగర్‌లోని నాలుగో అదన పు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు న్యాయమూర్తి శోభారాణి వద్ద హాజరుపరిచారు. రిమాండ్‌ను తిరస్కరిస్తూ 41ఏ నోటీసులు ఇవ్వాలని ఉత్తర్వులిచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement