బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆశయాలు ఆదర్శనీయం | - | Sakshi
Sakshi News home page

బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆశయాలు ఆదర్శనీయం

Apr 2 2026 7:47 AM | Updated on Apr 2 2026 7:47 AM

బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆశయాలు ఆదర్శనీయం

ఏఎన్‌యూ(పెదకాకాని): రిజర్వేషన్ల ఫలాలలను సంబంధిత వర్గాలన్నింటికీ చేరువ చేయడంలో బాబూ జగ్జీవన్‌రామ్‌ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కొత్తపల్లి శామ్యూల్‌ జవహర్‌ అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బాబు జగ్జీవన్‌రామ్‌ చైర్‌ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలకు శామ్యూల్‌ జవహార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత బాబూ జగ్జీవన్‌రామ్‌ చైర్‌లోని ఆయన చిత్రపటానికి, యూనివర్సిటీలోని జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన జయంతి ఉత్సవ సభలో శామ్యూల్‌ జవహర్‌ మాట్లాడుతూ మన సమాజంలో నేటికీ కుల వివక్షత అంతం కాలేదన్నారు. ఎస్సీ కులస్థుడనే కారణంతో ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ స్థాయి వ్యక్తికి కూడా క్షవరం చేసేందుకు నిరాకరించిన విచారకర పరిస్థితిని, హోటల్‌లో కులాల వారీగా బల్లలు ఉండటాన్ని తాను స్వయంగా చూశానన్నారు. పెత్తందారీ ధోరణి, ఆధిపత్యం, అసమానతలు పోవాలని దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పటేల్‌, పట్వారీ వ్యవస్థలు రద్దు చేశారని కానీ ఆ లక్ష్యం పూర్తిగా నెరవేరలేదన్నారు.

● పట్టణాలలో కుల వివక్షత లేదనే భావన ఉందని పక్కన ఏ జరుగుతుందో పట్టణంలో పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టే మనకు కుల వివక్షత అర్ధం కావడం లేదన్నారు. 75 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ రిజర్వేషన్‌ ఫలాలు చాలా మందికి అందటం లేదని, పరిస్థితి ఇలాగే ఉంటే మరో 75 సంవత్సరాలైనా ఫలితం ఉండదన్నారు. అన్ని వర్గా లకు సంపూర్ణ రిజర్వేషన్ల ఫలాలు అందజేయడంలో బాబూ జగ్జీవన్‌రామ్‌ సిద్ధాంతాలను స్పూర్తిగా తీసుకుని ముందుకుసాగాలన్నారు.

● వీసీ ఆచార్య కె.గంగాధరరావు అధ్యక్షోపన్యాసం చేస్తూ మన దేశంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి బాబు జగ్జీవన్‌రామ్‌ చేసిన కృషి, తెచ్చిన సంస్కరణలు ఎప్పటికీ ఆదర్శనీయమనన్నారు. బాబూ జగ్జీవన్‌రామ్‌ చైర్‌ డైరెక్టర్‌ ఆచార్య పీజే రత్నాకర్‌ చైర్‌ నివేదికను సమర్పిస్తూ చైర్‌ అభివృద్ధికి వర్సిటీ ఉన్నతాధికారులు ప్రత్యేక సహకారం అందిస్తున్నారని, కానీ కిందిస్థాయి అధికారులు చాలా అంశాల్లో చైర్‌ పట్ల వివక్షత చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌ చైర్‌ ప్రొఫెసర్‌ వై.అశోక్‌ కుమార్‌ ప్రసంగిస్తూ మన సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్‌, బాబు జగ్జీవన్‌రామ్‌లు ఎంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఫూలే చైర్‌ డైరెక్టర్‌ ఆచార్య ఎం.త్రిమూర్తిరావు, ఆచార్య పి.బ్రహ్మాజీరావు, డాక్టర్‌ నూతక్కి అశోక్‌కుమార్‌, ఉద్యోగ సంఘ నాయకులు కె.కోటేశ్వరరావు, ఎ.వెంకటేశ్వర్లు, ఎ.రమేష్‌, థెరిస్సాబాబు, డాక్టర్‌ అబ్రహం లింకన్‌, పరిశోధకులు పి.అభిషేక్‌, రాజేష్‌, దాసు, పలువురు అధ్యాపకులు, సిబ్బంది, పరిశోధకులు పాల్గొన్నారు.

కుల వివక్ష నేటికీ కొనసాగడం విచారకరం

ఏపీ ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కె.శామ్యూల్‌ జవహర్‌

ఏఎన్‌యూలో ఘనంగా బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement