జెడ్పీ పీఎఫ్‌ సిబ్బందిపై చర్యలు తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ పీఎఫ్‌ సిబ్బందిపై చర్యలు తీసుకోండి

Apr 2 2026 7:47 AM | Updated on Apr 2 2026 7:47 AM

జెడ్పీ పీఎఫ్‌ సిబ్బందిపై చర్యలు తీసుకోండి కలెక్టర్‌ను కలిసిన ఉద్యోగ సంఘ నాయకులు గుంటూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం డ్రైవర్ల సంఘం అధ్యక్షుడిగా మునిబాబు

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఉపాధ్యాయులకు సంబంధించిన పీఎఫ్‌ లోన్‌ ప్రతిపాదనల ఫైళ్లను నెలల తరబడి పెండింగ్‌లో ఉంచుతున్న జెడ్పీ పీఎఫ్‌ విభాగంలోని సిబ్బందిని విధుల నుంచి తొలగించాలని ఏపీటీఎఫ్‌ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శలు గుడిపాటి దాస్‌, మహమ్మద్‌ ఖాలీద్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు బుధవారం జెడ్పీ డిప్యూటీ సీఈఓ సీహెచ్‌ కృష్ణను జెడ్పీ కార్యాలయంలో కలసిన ఏపీటీఎఫ్‌ బృందం ఆయనకు సమస్యలతో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు జి.దాస్‌ మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా జెడ్పీ, మండల పరిషత్‌ పాఠశాలల్లో పనిచేస్తూ గతేడాది 2025 డిసెంబర్‌, 2026 జనవరి మధ్య ఉద్యోగ విరమణ పొందిన అన్ని కేడర్లకు చెందిన హెచ్‌ఎంలతో పాటు ఉపాధ్యాయుల ఫైనల్‌ క్లోజర్స్‌ జెడ్పీ పీఎఫ్‌ విభాగంలో సబ్మిట్‌ చేసి, నాలుగు నెలలు గడిచినా, ప్రాసెస్‌ చేయకుండా అకారణంగా పెండింగ్‌లో ఉంచారని ఆధారాలతో డిప్యూటీ సీఈఓకు వివరించారు. గత మార్చి వరకు ప్రాసెస్‌ చేసిన రుణ, ఇతర అన్ని ఫైల్స్‌ క్లియర్‌ చేసిన ప్రభుత్వం ఉపాధ్యాయుల పీఎఫ్‌ ఖాతాల్లో నగదు జమ చేసిందని, పీఎఫ్‌ సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగా కొందరికి డబ్బులు పడలేదని తెలిపారు. ఉపాధ్యాయుల క్లోజర్స్‌, రుణ ఫైల్స్‌ క్లియర్‌ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. మరో ఆర్నెల్ల వరకు పీఎఫ్‌ నగదు రాదని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.

● ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌ ఖాలీద్‌ మాట్లాడుతూ రూ.5 లక్షల లోపు పీఎఫ్‌ లోన్స్‌పై అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌, రూ.5 లక్షలు దాటితే సివిల్‌ సర్జన్‌ సంతకాలు ఉండాలనే నిబంధనలకు విరుద్ధంగా ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. 15 రోజుల్లో సమస్యను పరిష్కరించకుంటే పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తామని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బసవ లింగారావు స్పష్టం చేశారు. డిప్యూటీ సీఈవోను కలసిన వారిలో ఏపీటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు పి.నాగశివన్నారాయణ, జిల్లా కార్యదర్శి పచ్చల శివరామకృష్ణ, జిల్లా కౌన్సిలర్లు బి.కృష్ణారావు, వి.కిషోర్‌ షా, చెన్నుపాటి పెదలక్ష్మయ్య ఉన్నారు.

గుంటూరు వెస్ట్‌: గుంటూరు జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సిఎం సాయి కాంత్‌ వర్మను గుంటూరు జిల్లా జేఏసీ చైర్మన్‌, ఏపీ ఎన్జీజిఓ సంఘ అధ్యక్షులు ఘంటసాల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి ఏ శ్యామ్‌ సుందర్‌ శ్రీనివాస్‌, ఏపీ ఎన్జీజివో సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఘంటసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ అధికార యంత్రాంగం, ఉద్యోగులు, ప్రజల సమన్వయంతో గుంటూరు జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలని ఆకాంక్షించారు. స్పందించిన కలెక్టర్‌ జిల్లా అభివృద్ధి కోసం అందరి సహకారం ఎంతో అవసరమన్నారు. అధికార యంత్రాంగం, ఉద్యోగుల సమన్వయంతో పారదర్శక పరిపాలన అందించడానికి వృషి చేస్తానని తెలిపారు. అలాగే ప్రజల సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల వేగవంతమైన పురోగతికి ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్‌. శ్రీధర్‌ రెడ్డి, సిహెచ్‌ అనిల్‌, బి. వృష్ణ కిషోర్‌, డి. శ్రీనివాస్‌, కే. నరసింహారావు, కే.విజయ్‌, గుంటూరు సిటీ కార్యదర్శి సిహెచ్‌ కళ్యాణ్‌ కుమార్‌, సిటీ ట్రెజరర్‌ జీవి కోటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

గుంటూరు లీగల్‌: గుంటూరు బార్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం బుధవారం ప్రమాణస్వీకారం చేసింది. మంగళవారం అసోసియేషన్‌ ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగాయి. అధ్యక్ష పదవికి పోటీ చేసిన వారిలో సమీప అభ్యర్థి చింతలపాటి వెంకటరామయ్యపై మధిర నాగేశ్వరరావు 210 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వైస్‌ ప్రెసిడెంట్‌గా రేవతి తన సమీప అభ్యర్థి లక్ష్మీసుజాతపై 32 ఓట్ల ఆధిక్యంతో, జనరల్‌ సెక్రెటరీ పదవికి సమీప అభ్యర్థిపై వీర మణింద్ర 120 ఓట్ల మెజార్టీతో గెలిచారు. జాయింట్‌ సెక్రటరీగా కోమినేని సురేంద్రపై సమీప అభ్యర్థి ఏసు ప్రసాద్‌ 62 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ట్రెజరర్‌గా ఆకుల సుజాత 120 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పదవికి మూడు పోస్టులకుగాను నలుగురు పోటీ చేయగా వీరిలో ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు మూడింటికి గాను ఎనిమిది మంది పోటీ చేయగా నీలగిరి రాజు తోట, రాయపూడి శ్రీనివాసరావు, గుండు శీను, భాష రాజు గెలుపొందారు. స్పోర్ట్స్‌ సెక్రటరీగా కుప్పల హనుమంతరావు, లేడీ రిప్రజెంటివ్‌గా అడపా ఇందిర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లేడీ ఎగ్జిక్యూటివ్‌గా లక్ష్మీతిరుపతమ్మ సమీప అభ్యర్థిపై 120 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల అధికారిగా వెంగళశెట్టి శివ సూర్యనారాయణ వ్యవహరించారు. ఈ నేపథ్యంలో బుధవారం ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా జరిగింది. సభ్యుల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు.

గుంటూరు మెడికల్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా జె.మునిబాబు ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా పనిచేస్తున్న పాపారావు మార్చి 31న ఉద్యోగ విరమణ చేయడంతో, మునిబాబును ఽఅధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోటయ్య, కోశాధికారిగా సాధిక్‌ బాషా, కార్యవర్గ సభ్యులుగా నాగేశ్వరరావు, మదినా, సునిల్‌కుమార్‌, సుభాని, ప్రసాద్‌, బ్రహ్మం, లాల్‌జాన్‌, పరమేశ్వరరావు ఎన్నికయ్యారు.

వైస్‌ ప్రెసిడెంట్‌ బి.రేవతి

నీలగిరి రాజు తోట

బాబు నారదాసు

(జనరల్‌ సెక్రటరీ )

ప్రెసిడెంట్‌ మధిర నాగేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement