మధురం.. అ‘పూర్వ’ జ్ఞాపకం! | - | Sakshi
Sakshi News home page

మధురం.. అ‘పూర్వ’ జ్ఞాపకం!

Apr 2 2026 7:47 AM | Updated on Apr 2 2026 7:47 AM

గుంటూరు ఎడ్యుకేషన్‌: విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వ విద్యాలయంలో 1971–73 విద్యాసంవత్సరంలో ఫిజిక్స్‌ మాస్టర్స్‌ డిగ్రీ చేసి వివిధ హోదాల్లో పనిచేసి విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన పూర్వ విద్యార్థులు గుంటూరులో అపూర్వ సమ్మేళనాన్ని నిర్వహించారు. బుధవారం జేకేసీ కళాశాలరోడ్డులోని ఓ హోటల్‌లో తమ సహ ధర్మచారిణులతో కలసి సందడి చేశారు. ఏడు పదుల వయసు దాటినప్పటికీ, యువతీ, యువకులుగా చలాకీగా, ఆటపాటలతో సందడి చేశారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ వ్యక్తిగత, కుటుంబ క్షేమ సమాచారాలను పంచుకున్నారు. ఆత్మీయ సమావేశంలో వికాస్‌ విద్యాసంస్థల డైరెక్టర్‌ పొనకల వీర శంకరరావు, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర విశ్రాంత డీజీఎం కోనేరు భీమేశ్వరరావు, విశ్రాంత అధ్యాపకుడు ఎం.కోటేశ్వరరావు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అన్ని బంధాల్లోకి స్నేహబంధం పవిత్రమైనదని, ఆ మాధుర్యానికి విలువ కట్టలేమని చెప్పారు. ఐదు దశాబ్దాల తమ జీవితంలో శాస్త్రవేత్తలుగా, బ్యాంక్‌ అధికారులుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులుగా, ప్రిన్సిపాల్స్‌గా, అధ్యాపకులుగా, వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా రాణించి విశ్రాంత జీవితంలో ఒకచోట కలవటం మాటలకు అందని సంతోషాన్ని, ఆనందాన్ని, కలుగ చేస్తుందన్నారు. గత మూడు రోజులుగా ఆధ్యాత్మిక విహార కేంద్రాలైన అమరావతి, మంగళగిరి, కొండవీడు, కోటప్పకొండను సందర్శించామని తెలియజేశారు. త్వరలో శత వసంతాలు పూర్తి చేసుకోబోతున్న ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తమ బ్యాచ్‌ పూర్వ విద్యార్థులదంరూ సంఘంగా ఏర్పడి చురుగ్గా పాలుపంచుకోబోతున్నట్లు చెప్పారు. ఈసందర్భంగా సమాజహిత కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వివరించారు. ఆత్మీయ విందు అనంతరం గ్రూప్‌ ఫొటో దిగారు. కార్యక్రమంలో ఎంవీవీ రమేష్‌, ఆదినారాయణమూర్తి, వీవీఎస్‌ గురునాధరావు, కొండయ్య, బి.సూర్యనారాయణ, పి.భాస్కరరావు, రాంప్రసాద్‌, అప్పలనాయుడు, జగన్‌మోహన్‌రావు పాల్గొన్నారు.

ఆంధ్ర వర్శిటీ 1971–73 పీజీ (ఫిజిక్స్‌ ) పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

ఐదు దశాబ్దాల అనంతరం గుంటూరులో కలుసుకున్న పూర్వ విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement