ప్రపంచ దేశాలపై ట్రంప్‌ వైఖరి దారుణం | - | Sakshi
Sakshi News home page

ప్రపంచ దేశాలపై ట్రంప్‌ వైఖరి దారుణం

Apr 2 2026 7:47 AM | Updated on Apr 2 2026 7:47 AM

ప్రపంచ దేశాలపై ట్రంప్‌ వైఖరి దారుణం

లక్ష్మీపురం: ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అనుసరిస్తున్న విధానాలు ఆందోళనకరంగా ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇతర దేశాలపై ఒత్తిడి, బెదిరింపులు, యుద్ధ వాతావరణం సృష్టించడం ద్వారా ప్రపంచ శాంతి భద్రతలను ప్రమాదంలోకి నెట్టుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ఇరాన్‌పై కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక ప్రభావాలకు దారితీయవచ్చని హెచ్చరించారు. ఇదే సమయంలో దేశంలో కార్మికులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలను వారు విమర్శించారు. కార్మిక చట్టాల్లో మార్పులు చేయడం వల్ల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరచే చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఈ సమస్యలపై నిరసనగా ఈనెల 10 నుంచి 12వ తేది వరకు మూడు రోజుల పాటు పాదయాత్ర నిర్వహించనున్నట్లు ప్రకటించారు. 12న భారీ బహిరంగ సభ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా సహా పలువురు వామపక్ష నాయకులు హాజరుకానున్నారని తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. రెండో విడత భూముల సేకరణపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే రైతుల నుంచి తీసుకున్న భూముల్లోనే రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని, మళ్లీ భూములు సేకరించడం తొందరపాటు నిర్ణయమని అన్నారు. సీపీఐ జాతీయ నాయకులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement