బీపీ‘ఎస్’.. అంతంతే!
బీపీఎస్ పథక నిబంధనలు ఇవీ..
తలెత్తుతున్న ఆన్‌లైన్ సమస్యలు తెనాలిలో 900 వరకు అనధికారిక కట్టడాలు ముందుకు రాని ఎక్కువ మంది యజమానులు
సద్వినియోగం చేసుకోండి
తెనాలి అర్బన్: బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్)కు అనేక అవరోధాలు ఏర్పడుతున్నాయి. అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో బిల్డర్‌లు, భవన యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. తెనాలి పట్టణంలో ఇటీవల 200కుపైగా అనధికార, ప్లాన్‌కు విరుద్దంగా నిర్మించిన భవనాలు ఉన్నాయి. తెనాలి పట్టణం నానాటికీ విస్తరిస్తోంది. రాజధాని అమరావతికి అతి దగ్గరగా గుంటూరు, విజయవాడకు మధ్యలో ఉండటంతో గ్రామీణ ప్రాంతాల వారు కూడా తెనాలిలో ఉండాలని భావిస్తున్నారు. పట్టణంలో మూడు కాల్వలు ఉండటం వల్ల నీటి కొరత ఉండదు. ప్రశాంతతకు మారు పేరుగా ఉండటంతో పలువురికి ఆసక్తి పెరుగుతోంది. పట్టణ పరిఽధి విస్తరిస్తోంది. ప్రస్తుతం 40 వేల గృహాల్లో 1.70 లక్షల మంది జనాభా ఉన్నారు.
అన్ని కట్టడాలు పరిగణనలోకి వచ్చేనా?
టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు తెనాలి పట్టణంలో అక్టోబర్ 21న 47 బృందాలు నిర్మాణంలో ఉన్న భవనాల వివరాలను సేకరించాయి. సర్వేలో సుమారు 200కుపైగా అనధికార, ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించిన భవనాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వీటిన్నింటిపై చర్యలు తీసుకోనున్నట్లు ఆ సమయంలో మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్‌లు ప్రకటించారు. కానీ చర్యలు కన్పించలేదు. ఇంతలో బీపీఎస్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వీటిలో కొన్ని ఆగస్టు 31వ తేదీ తర్వాత నిర్మించారు. వీటిని పరిగణలోకి తీసుకుంటారా లేదా అనే మీమాంస యజమానుల్లో నెలకొంది. తమనూ పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు.
కొనసాగుతున్న అనఽధికార కట్టడాలు
మరోవైపు పట్టణంలో అనధికార కట్టడాల నిర్మాణం కొనసాగుతోంది. సుమారు ఏడాది నుంచి ప్రారంభమైన నిర్మాణాలకు నేటికీ తెరపడలేదు. పట్టణంలోని ముత్తింశెట్టిపాలెం, గంగానమ్మపేట, కొత్తపేట, రైల్వేస్టేషన్ రోడ్డు వంటి ప్రాంతాలలో యజమానులు అర్ధరాత్రి, తెల్లవారుజాము సమయంలోనూ నిర్మాణ పనులు చేయిస్తున్నారు. అధికారులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బీపీఎస్‌కు కరువైన స్పందన
పట్టణంలో 1985 నుంచి ఈ ఏడాది వరకు అనధికార, ప్లానుకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలు 900 వరకు ఉండవచ్చనే అంచనాకు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చారు. పథకాన్ని నవంబర్ 12న ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
అక్రమ భవనాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం బీపీఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 1985 జనవరి 1 నుంచి 2025 అగస్ట్ 31వ తేదీలోపు అనధికారికంగా, ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు కల్పించింది. 2026 మార్చి 11వ తేదీలోపు యజమానులు క్రమబద్ధీకరించుకోవాలనే నిబంధన విధించింది. మొదట ఆన్‌లైన్‌లో రూ.10 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. టౌన్ ప్లానింగ్ అధికారుల తనిఖీల తర్వాత స్థలం విలువ, విస్తీర్ణం అధారంగా అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
ప్రభుత్వం బీపీఎస్ పథకాన్ని నవంబర్ నెలలో ప్రవేశపెట్టింది. పట్టణంలో సుమారు 900 భవనాలు బీపీఎస్ పరిధిలోకి రానున్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చాం. యజమానులకు అవగాహన కల్పించేందుకు ప్రధాన కూడలిల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాం. మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాం. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– వాణి, అసిస్టెంట్ సిటీ ప్లానర్,
తెనాలి పురపాలక సంఘం
బీపీ‘ఎస్’.. అంతంతే!


