సాయుధ బలగాల సంక్షేమ నిధికి విరాళం
నరసరావుపేట: సాయుధ బలగాల సంక్షేమ నిధికి దాతలు ఇచ్చిన చెక్కులను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి గుణశీలకు అందజేశారు. నరసరావుపేట ఇంజినీరింగ్ కాలేజీ(ఎన్‌ఈసీ) చెందిన ఎన్‌సీసీ క్యాడెట్లు రూ.30 వేలు, వాసవీ క్లబ్ సభ్యులు రూ.25 వేలు విరాళంగా ఇచ్చారు. దేశ రక్షణలో భాగస్వాములయ్యే సైనికుల సంక్షేమం కోసం ముందుకు వచ్చిన క్యాడెట్లు, వాసవి క్లబ్ సభ్యులను కలెక్టర్ అభినందించారు.
నరసరావుపేట రూరల్: యూరియా అధిక ధరలకు విక్రయిస్తే డీలర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు హెచ్చరించారు. సబ్ డివిజన్ పరిధిలోని ఎరువుల డీలర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. జగ్గారావు మాట్లాడుతూ చట్టప్రకారం ఎప్పటికప్పుడు స్టాక్ రిజిస్టర్, బిల్లు బుక్ అప్టేట్ చేసుకోవాలని తెలిపారు. ఐఎఫ్‌ఎంఎస్ స్టాక్ గోడౌన్ స్టాక్ సరిపోవాలని పేర్కొన్నారు. ఎరువుల గోడౌన్‌ల వద్ద స్టాక్ బోర్డు ఏర్పాటు చేయాలని, స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని తెలిపారు. సమావేశంలో సహాయ వ్యవసాయ సంచాలకులు కేవీ శ్రీనివాసరావు, వి.హనుమంతరావు, జిల్లా ఎరువుల డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు నాగిరెడ్డి, పట్టణ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఏవోలు, సిబ్బంది పాల్గొన్నారు.
సత్తెనపల్లి: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని సత్తెనపల్లి పట్టణం వడ్డవల్లిలోని శ్రీ రామాలయం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామికి మంగళవారం తులసితో అలంకారం చేశారు. కోదండ రామచంద్ర ప్రభువైన శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయస్వామిలను విశేష అలంకరణ చేసి కనుల పండువగా పూజలు, గోత్ర నామాలతో అభిషేకాలు చేశారు. మహిళలు పాశురాలను పఠించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
గుంటూరు రూరల్: అఖిల భారత డ్వాక్రా బజార్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్న సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్‌అన్సారియా, జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్‌లు మంగళవారం పరిశీలించారు. స్థానిక రెడ్డి కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన సరస్ అఖిల భారత డ్వాక్రా బజారును ఈ నెల 8వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి సందర్శించి పలు స్టాళ్లను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా, బందోబస్తు ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. మంగళవారం నుంచి 18వ తేదీ వరకు అఖిల భారత డ్వాక్రా బజార్ ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలిపారు. సరస్‌లో ప్రతి రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 8వ తేదీన ప్రారంభిస్తారని చెప్పారు.
సాయుధ బలగాల సంక్షేమ నిధికి విరాళం


