బాలికపై లైంగిక వేధింపులు.. కేసు నమోదు
లక్ష్మీపురం: నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్ తెలిపారు. వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఏటీ అగ్రహారం పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన మహిళ ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు కలిగాక మనస్పర్థలతో విడాకులు తీసుకున్నారు. అదే ప్రాంతానికి చెందిన షేక్ మస్తాన్ అనే వ్యక్తిని ఆమె రెండో వివాహం చేసుకున్నారు. మొబైల్ షాపులో పని చేసుకుంటూ ఆమె జీవనం సాగిస్తున్నారు. మస్తాన్‌కు రెండో వివాహం చేయాలని ఆయన కుటుంబసభ్యులు సిద్ధం అయ్యారు. దీంతో ఆమె నిలదీయడంతో ఒంటరిగా వదిలేశాడు. ఇటీవల ఆమె కుమార్తె (8) నిద్రలో ఉలిక్కి పడటం, ఏడవడం వంటివి చేస్తుండటంతో ఏమైందని తల్లి ఆరా తీసింది. మస్తాన్ అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పింది. దీంతో నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


