ప్రారంభం కాకుండానే పగుళ్లు
● నాసిరకంగా ప్రత్తిపాడు పీహెచ్‌సీ నిర్మాణ పనులు ● రూ.6కోట్లతో నిర్మాణం ● నెర్రెలిచ్చిన గోడలు, పిల్లర్లు.. పగిలిన ప్రహరీ ● చెమ్మగిల్లుతున్న గోడలు
ప్రత్తిపాడు: ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టరు ఇష్టారాజ్యం.. వెరసి రూ.6 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ఆస్పత్రి భవనం పగుళ్లిస్తుంది. 2022లో ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం ఆధునికీకరణకు రూ.6కోట్లు నాబార్డు నిధులు మంజూరు చేశారు. శిథిల భవనం స్థానంలో పెద్ద నూతన భవనం నిర్మించడంతో పాటు పక్కనే ఉన్న మరో భవనంపై రెండవ అంతస్తును కూడా నిర్మించారు. ఇంకా భవన నిర్మాణ పనులు పూర్తికాలేదు. చివరి దశలో ఉన్న ఈ నిర్మాణ పనుల్లో ఇంజినీరింగ్ అధికారుల వైఫల్యం బయట పడుతుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రెండు భవనాలను జాయింట్ చేసిన చోట నుంచి వాటర్ లీక్ అవుతుంది. వాననీరు ఆస్పత్రి గదుల్లోకి చేరుతుంది. అంతేకాకుండా అనేక గదుల్లో గోడలు పగిలిపోయి, చెమ్మగిల్లి పెయింట్లు పెచ్చులూడి కనిపిస్తుంది. కాగా ఓ చోట ఏకంగా పిల్లరు పగుళ్లిచ్చింది. మరో చోట పిట్టగోడ పగిలిపోయి దర్శనమిస్తుంది. కేవలం ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ లోపం వలనే పగుళ్లు, చెమ్మలు వస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకా భవనం ప్రారంభం కాకముందే ఇన్ని లోపాలు బయటపడుతుండటంతో భవనం నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రారంభం కాకుండానే పగుళ్లు
ప్రారంభం కాకుండానే పగుళ్లు
ప్రారంభం కాకుండానే పగుళ్లు


