పెండింగ్ లేకుండా అర్జీల పరిష్కారం
కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా
గుంటూరు వెస్ట్: సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో అర్జీలు పెండింగ్‌లో లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా అధికారులకు సూచించారు. స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో ఆమె మాట్లాడారు. వ్యక్తిగత, సామాజిక అంశాలపై ప్రజలు అందించిన అర్జీలను సక్రమంగా, సకాలంలో పరిష్కరించేలా అధికారులు బాధ్యతగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌లో ప్రజల సౌకర్యం కోసం ఎన్నో సులభ మార్గాలను ప్రవేశపెట్టామని, అయితే కింది స్థాయిలో సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని ఆమె కోరారు. ఇంటి స్థలాల కోసం అర్జీలు అందించడానికి వచ్చిన వికలాంగుల నుంచి సమావేశ మందిరానికి వచ్చి వాటిని స్వీకరించారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన 320 అర్జీలను జేసీ, డీఆర్వో షేక్ ఖాజావలి, డెప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, ఆర్డీవో కె. శ్రీనివాసరావు, సీపీఓ శేషశ్రీ , జెడ్పీ సీఈఓ వి జ్యోతిబసు, జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. కారుణ్య నియామక ప్రక్రియలో భాగంగా షేక్ అబ్దుల్ రవూఫ్, డి. భాను చరణ్, బి. శ్యామ్ ప్రకాశ్‌కు నియామక పత్రాలను అందజేశారు.


