రైతులను ఇబ్బంది పెడితే చర్యలు
జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు
కొరిటెపాడు(గుంటూరు): జూన్ మాసం నుంచి ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువులు, విత్తనాలు సరఫరా చేయాలని, ఎక్కడ నుంచి ఫిర్యాదు వచ్చినా చర్యలు తప్పవని గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు హెచ్చరించారు. స్థానిక కృషీ భవన్‌లో సోమవారం సాయంత్రం విత్తన కంపెనీ ప్రతినిధులు, డిస్ట్రిబ్యూటర్స్‌తో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖరీఫ్ సీజన్‌లో విత్తనాలు సరఫరా చేయాలని సూచించారు. ఎమ్మార్పీకి మించి ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. కాలం చెల్లిన విత్తనాలు, పురుగు మందులను రైతులకు అంటగడితే కేసులు నమోదు చేస్తామన్నారు. విక్రయ కేంద్రాల వద్ద విధిగా ధరల పట్టికతోపాటు స్టాకు వివరాల బోర్డులు వేలాడదీయాలన్నారు. విత్తన కంపెనీల ప్రతినిధులు మాట్లాడుడుతూ రాబోవు ఖరీఫ్ సీజన్‌లో అన్ని రకాల పత్తి, మిరప విత్తనాలను అందుబాటులో ఉంచి రైతులకు ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్‌లో గుంటూరు జిల్లాలో 75 వేల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని, దీనికిగాను 2 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయని అధికారులు సూచించగా, అంతకన్నా ఎక్కువ ప్యాకెట్లు సరఫరా చేస్తామని విత్తన కంపెనీ ప్రతినిధులు, డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు. గుంటూరు ఏడీఏ తోటకూర శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్‌లైసిల్(హెచ్‌టీ) పత్తి విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో పొన్నూరు ఏడీఏ వి.రామకోటేశ్వరి, ఏఓ కె.రమణకుమార్, 15 విత్తన కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు, డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు.


