ఆశ కార్యకర్తలకు యూనిఫాం పంపిణీ
గుంటూరు మెడికల్: జిల్లాలోని 1195 మంది ఆశ కార్యకర్తలకు ఒక్కొక్కరికి రెండు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన యూనిఫాం(చీరలు) డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి సోమవారం పంపిణీ చేశారు. స్థానిక డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ దాసరి శ్రీనివాసులు, డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబు, డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఇ.అన్నపూర్ణ, డాక్టర్ రోహిణి రత్నశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ విజయప్రకాష్, డాక్టర్ జయరామకృష్ణ, డాక్టర్ ప్రియాంక, చంద్రశేఖర్, సురేష్ పాల్గొన్నారు.
రేపు గుంటూరులో జాబ్‌మేళా
గుంటూరు ఎడ్యుకేషన్: గుజ్జనగుండ్లలోని గుంటూరు జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో బుధవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి డి.దుర్గాబాయి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్‌ఆర్ పాలిమర్స్, జెడ్‌ఎం క్యూర్ కోడ్ సర్వీసెస్, సిగ్నెట్ ఎలక్ట్రికల్స్, అను హాస్పిటల్స్, ఫెయిర్‌డీల్ క్యాపిటల్, సెవెన్ హిల్స్ ఫార్మసీ సంస్థల్లో ఉద్యోగాలకు టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, పీజీ వరకు చదువుకున్న 18 నుంచి 35 ఏళ్లలోపు వయసు గల నిరుద్యోగ యువతీ, యువకులు బయెడేటా, రెజ్యూమ్, విద్యార్హతల సర్టిఫికెట్లు, ఆధార్ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు జరగనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. ఇతర వివకాలకు 98668 22697 నంబర్లో సంప్రదించాలని తెలిపారు.
జీడీసీసీబీ చైర్మన్‌గా మక్కెన
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(జీడీసీసీబీ) చైర్మన్‌గా వినుకొండ నియోజకవర్గానికి చెందిన మాజీ శాసనసభ్యుడు మక్కెన మల్లికార్జునరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మల్లికార్జునరావు 2004 నుంచి 2009 వరకు వినుకొండ ఎమ్మెలేగా పనిచేశారు. గుంటూరు జిల్లా కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(జీడీసీఎంఎస్) చైర్మన్‌గా పొన్నూరు నియోజకవర్గానికి చెందిన వడ్రాణం హరిబాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు ఇరువురు ఒకటి, రెండు రోజుల్లో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ప్రధాని పర్యటన
ఏర్పాట్లు పరిశీలన
తాడికొండ: మే 2వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభించేందుకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీర పాండ్యన్, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తదితరులు పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లు, వీవీఐపీలు, ప్రజలు ప్రయాణించే మార్గాలు, వాహనాల పార్కింగ్‌కు సంబంధించిన ప్రాంతాలను పరిశీలించి చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో ఆర్డీవో కె శ్రీనివాసరావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీనివాసమూర్తి, రెవెన్యూ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
రేపటి నుంచి బగళాముఖి అమ్మవారి కొలుపులు
చందోలు(కర్లపాలెం): చందోలులో శ్రీ బగళాముఖి అమ్మవారి వార్షిక కొలుపులు(తిరునాళ్ల) ఈనెల 30వ తేదీ నుంచి మే 5 వరకు జరుగుతాయని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, మేనేజర్ నరసింహమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆశ కార్యకర్తలకు యూనిఫాం పంపిణీ
ఆశ కార్యకర్తలకు యూనిఫాం పంపిణీ
ఆశ కార్యకర్తలకు యూనిఫాం పంపిణీ


