ప్రధాన షాపులకు తగ్గింపు ..
తెనాలి: భక్తులు చిన్న తిరుపతిగా పిలుచుకునే స్థానిక శ్రీలక్ష్మీపద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి ఆదాయానికి గండిపడింది. ఆలయంలోని వివిధ దుకాణాలకు నిర్వహించే వేలంలో అస్మదీయులపై అపార ప్రేమ చూపారు. స్వామివారికి రూ.7 లక్షల వరకు శఠగోపం పెట్టారు. బినామీల పేర్లతో లాగించేశారు. తెలుగు తమ్ముళ్ల సిఫార్సుపై చూపిన కరుణకు పనిలో పనిగా రూ.లక్షలు చేతులు మారాయి. ఇతరుల దుకాణాలకు మాత్రం రూల్స్ ప్రకారం అద్దె పెంపుదల చేశారు.
వైకుంఠపురం దేవస్థానంలోని షాపులకు గతంలో రెండేళ్ల కాలపరిమితితో నిర్వహించే వేలంపాటలను ఈమధ్య కాలంలో ఏడాదికి పరిమితం చేశారు. ఆ ప్రకారం మొత్తం తొమ్మిది షాపులు/ నిర్వహణకు లైసెన్సుల కోసం ఇటీవల ఈ–ప్రొక్యూర్‌మెంట్ సీల్డ్ టెండర్ కమ్ బహిరంగ వేలం జరిపారు. గతంలో వేలంలో పాల్గొనేవారి నుంచి కొన్ని షాపులకు రూ.5 లక్షల డిపాజిట్ వసూలు చేసేవారు. ప్రస్తుత సంవత్సరానికి మాత్రం అధికారులు ఆ మొత్తాన్ని రూ.లక్షకు పరిమితం చేశారు. ఆలయ సహాయ కమిషనర్/కార్యనిర్వహణ అధికారికి ఆ విచక్షణాధికారం ఉంటుంది.
పేర్లు మాత్రమే బినామీలవి..
రూరల్ మండల గ్రామానికి చెందిన ఓ తెలుగు తమ్ముడి సిఫార్సుతోనే స్వామివారి ఆదాయాన్ని తగ్గించి షాపుల నిర్వాహకులకు లాభం చేకూర్చారని ఆలయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇంతకు ముందు షాపులు నిర్వహించిన యజమానుల పేరిట తగ్గింపు ధరకు పాట రాస్తే, నిబంధనలు అంగీకరించవు...దీనిని దృష్టిలో ఉంచుకుని బినామీ పేర్లతో లాగించేశారని చెబుతున్నారు. ఆ బినామీలు కూడా ఆయా షాపుల నిర్వాహకుల సమీప బంధువులే కావటం గమనించాల్సిన అంశం. పేర్లు మాత్రం బినామీలవి. షాపుల నిర్వహణ మాత్రం పాత అద్దెదారులే చేస్తున్నారు. అద్దె తగ్గించిన షాపులలో ఒక్కో షాపును ఇద్దరేసి నిర్వహిస్తున్నారు. చెరిసగం వార్షిక అద్దెను భరిస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన నిజం. ఇప్పుడు షాపు అద్దె మొత్తాన్ని వేలంలో తగ్గించినందున అధికారులకు ఇవ్వటానికని చెప్పి, మొదటి షాపుకు చెందిన ఇద్దరి నుంచి రూ.రెండేసి లక్షలు చొప్పున రూ.4 లక్షలు వసూలు చేశాడో మధ్యవర్తిగా చెప్పుకునే వ్యక్తి. మరో షాపు నిర్వహించుకుంటున్న ఇద్దరి నుంచి చెరొక రూ.75 వేల వంతున రూ.1.50 లక్షలను తీసుకున్నాడు. అవి అధికారులకు ముట్టాయో లేదో తెలీదు. ‘లాభం లేకుండా స్వామివారి ఆదాయానికి మాత్రం ఎలా గండికొడతారు’ అని ఎవరికి వారు ప్రశ్నించుకుంటున్నారు. ఇదే విషయమై వివరణ కోరేందుకు ప్రయత్నించగా, కార్యనిర్వహణాధికారి వి.అనుపమ అందుబాటులో లేరు.
వేలం టెండర్లలో గోల్‌మాల్ రెండు షాపులకు రూ.7 లక్షల తగ్గింపు ఇతరులకు మాత్రం పెంపుదల రూ.4 లక్షలు చేతులు మారిన ఫలితం!
దేవదాయశాఖ నింబంధనల ప్రకారం షాపులకు వేలం జరిపిన ప్రతిసారీ నిర్ణీత అద్దె మొత్తం పెంపుదల జరగాల్సిందే. వైకుంఠపురంలోని మొత్తం తొమ్మిదింటికి ఏడు షాపులకు అద్దె మొత్తాన్ని పెంపుదల చేశారు. ప్రధానమైన రెండింటికి మాత్రం తగ్గించేయటమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొబ్బరికాయలు, పూజాద్రవ్యాలు అమ్ముకొనే లైసెన్సు హక్కు గతేడాది రూ.13 లక్షలు ఉండగా 2025–26 సంవత్సరానికి రూ.8.11 లక్షలకు పరిమితం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఫాన్సీ, బొమ్మలు అమ్ముకునే లైసెన్సు హక్కు గత సంవత్సరం రూ.7.50 లక్షలు కాగా, ఈసారి రూ.5.50 లక్షలకు తగ్గించేశారు. అంటే కేవలం రెండు షాపులపై శ్రీవారి వార్షిక ఆదాయానికి రూ.7 లక్షల వరకు గండిపడింది.


