చానల్ పొడిగింపు పనులు వెంటనే ప్రారంభించాలి
ప్రత్తిపాడు: గుంటూరు చానల్ పొడిగింపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నల్లమడ రైతు సంఘం నాయకులు కలెక్టర్‌ను కోరారు. జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్టర్ నాగలక్ష్మిని కలిసి నల్లమడ రైతు సంఘం అధ్యక్షుడు డాక్టర్ కొల్లా రాజమోహన్ తదితరులు కలసి వినతిపత్రం అందజేశారు. గుంటూరు చానల్‌ను పర్చూరు వరకు పొడిగించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో వంద కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. ఇందులో ఇప్పటికే భూసేకరణ ప్రక్రియకు సంబంధించి నిధులు విడుదల చేసినట్లుగా వార్తాపత్రికల్లో కథనాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పనులను త్వరగా ప్రారంభించాలని ఆయన కోరారు. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి తమ ప్రాంతానికి సాగు, తాగు నీరు ఇప్పించాలని ఆయన కలెక్టర్‌కు విన్నవించారు. ఆయన వెంట పలువురు రైతు సంఘ నాయకులు ఉన్నారు.


