లా అండ్ ఆర్డర్ ఉందా?
అద్దంకి రూరల్: ‘‘అధికారం వచ్చిందని ఏదైనా చేస్తారా.. ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిపై దాడి జరిగితే లా అండ్ ఆర్డర్ ఏమైంది. దాడి జరిగిన విషయం అక్కడి ఎస్సైకి తెలియదా... ఎందుకు ఇంతవరకు కేసు కట్టలేదు’’ అంటూ వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ బల్లికురవ మండల కన్వీనర్‌ను స్టేషన్‌కు పిలిపించి బెదిరించటం, వైఎస్సార్ సీపీకి చెందిన వారిపై దాడి జరిగితే ఎస్సై స్పందించడా అని ప్రశ్నించారు. బల్లికురవ మండలం సోమవరప్పాడు గ్రామంలో టీడీపీ సానుభూతిపరుల దాడిలో తీవ్రంగా గాయపడి అద్దంకి వైద్యశాలలో చికిత్స పొందుతున్న గోపిరాజుయాదవ్‌ను నాగార్జున మంగళవారం పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గోపిరాజు యాదవ్‌పై ఇప్పటికి మూడుసార్లు దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి కొట్టటం, మరోసారి కత్తితో నరకటం, ఇప్పుడు కర్రలతో దాడి చేయడమేమిటని ప్రశ్నించాడు. అతను సోషల్ మీడియాలో పనిచేస్తున్నాడనా, బీసీ కులస్తుడు పేదవాడు ఏమీ చేయలేడనా, దాడి చేశారని ప్రశ్నించారు. అధికారం వచ్చిందని ఏమైనా చేస్తామంటే సరిపోదన్నారు. సోమవారం దాడి జరిగితే ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయకపోవటం ఏమిటని ప్రశ్నించారు. అక్కడ ఎస్సైకి దాడి చేసిన విషయం తెలియదా అన్నారు. దాడి విషయమై తాను ఎస్పీతో మాట్లాడానని, ఆయన వెంటనే స్పందించి కేసు రిజిస్టర్ చేయిస్తామని చెప్పామన్నారు. ఉన్నతాధికారి స్పందించిన విధంగా స్థానిక ఎస్సై, సీఐ ఎందుకు స్పందించలేదని అన్నారు. అక్కడ ఎస్సై ఏమి చేస్తున్నాడన్నారు. వైఎస్సార్ సీపీ పార్టీతోపాటు తామంతా అండగా ఉంటామని ఈ విషయాన్ని మా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కేసు రిజిస్టర్ చేసి సునిశితమైన విచారణతో దాడికి పాల్పడ్డవారిని శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. నాగార్జున వెంట బాపట్ల జిల్లా వైఎస్సార్ సీపీ ఉపాధ్యక్షుడు జ్యోతి హనుమంతరావు, పానెం హనిమిరెడ్డి సోదరులు నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, అద్దంకి పట్టణ వైఎస్సార్ అధ్యక్షడు కాకాని రాధాకృష్ణమూర్తి, బల్లికురవ మండల కన్వీనర్ దేవినేని కృష్ణబాబు, వైఎస్సార్ సీపీ అద్దంకి మండల కన్వీనర్ జగన్‌మోహన్‌రెడ్డి, సంతమాగులూరు మండల కన్వీనర్ వుట్ల నాగేశ్వరరావు సర్పంచ్ నగేష్, కోల్లా భువనేశ్వరి, షేక్ అబిదా, వార్డు కౌన్సిలర్‌లు, ఇన్‌చార్జిలు, స్థానిక నాయకులు ఉన్నారు.
బీసీ సామాజికవర్గీయుడిపై దాడి జరిగితే కనిపించలేదా? వైఎస్సార్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున


