తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ కొలనుకొండ డీజీపీ కార్యాలయం సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన లక్ష్మీతిరుపతమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి గుట్టుచప్పుడు కాకుండా కోర్టులో మంగళవారం హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన హిజ్రా బత్తుల శశి అలియాస్ జెస్సీ ఏడాది క్రితం లక్ష్మీతిరుపతమ్మ(32)ను వ్యభిచార వృత్తిలోకి దించింది. కొలనుకొండ వద్ద ఆమెతో వ్యభిచారం చేయిస్తోంది. ఈ క్రమంలో స్థానికంగా ఉండే ముత్యాల కోమల్ కుమార్ (చింటూ) తిరుపతమ్మకు పరిచయమయ్యాడు. వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరూ ఒకే గదిలో కొంతకాలం సహజీవనం చేశారు. ఈ క్రమంలో జెస్సీ (హిజ్రా) భర్త నవీన్‌తోనూ లక్ష్మీతిరుపతమ్మ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడు చింటూను దూరంగా ఉంచుతోంది. దీనిని మనస్సులో పెట్టుకున్న జెస్సీ లక్ష్మీతిరుపతమ్మపై కోపంతో రగిలిపోయింది. చింటూను ఉసిగొల్పి తిరుపతమ్మను హత్య చేయించింది. హత్య జరిగిన 24 గంటల వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపర్చినట్లు డీఎస్పీ ప్రకటనలో పేర్కొన్నారు. తాడేపల్లి సీఐ కల్యాణ్ రాజు, సిబ్బంది కేసును ఛేదించినట్టు వివరించారు. ఇదిలా ఉండగా జనవరి 31న జరిగిన మహిళ హత్యకేసు వివరాలను పోలీసులు వెల్లడించకపోవడం విశేషం.
లక్ష్మీతిరుపతమ్మ హత్య కేసు ఛేదించినట్టు పోలీసుల ప్రకటన
హిజ్రా భర్తతో తిరుపతమ్మ వివాహేతర సంబంధం
ప్రియుడినీ దూరం పెట్టిన హతురాలు
పథకం ప్రకారమే హత్య
గుట్టుచప్పుడు కాకుండా నిందితుల అరెస్ట్