
అలరించిన స్టాల్స్‌కు బహుమతులు అందజేస్తున్న వీసీ డాక్టర్ ఆర్.శారదజయలక్ష్మిదేవి
● ఐఐఓఆర్ డైరెక్టర్ డాక్టర్ ఆర్‌కే మాథూర్ ● ముగిసిన అగ్రిటెక్ వ్యవసాయ సాంకేతిక సదస్సు
గుంటూరు రూరల్: వ్యవసాయంలో ప్రస్తుతం దిగుబడి ఎంత వచ్చిందో అనేది కాకుండా నికర ఆదాయం ఎంత వచ్చింది అనే విషయం ప్రాధాన్యత సంతరించుకుందని జీతాయ నూనెగింజల పరిశోధన సంస్థ (ఐఐఓఆర్) డైరెక్టర్ డాక్టర్ ఆర్‌కే మాథూర్ పేర్కొన్నారు. గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తాధ్వర్యంలో లాం నందున్న విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అగ్రిటెక్ – 2023 వ్యవసాయ సాంకేతిక సదస్సు మంగళవారంతో ముగిసింది. సదస్సు మూడోరోజు అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా మిల్లెట్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో యాంత్రీకరణలో భాగంగా ఉపయోగించే డ్రోన్లు, కోత యంత్రాలు కుసుమలాంటి పంటల్లో ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. మొక్కలు ఎక్కువగా ముల్లులు కలిగి ఉన్న పంటల్లో మనుషులతో వ్యవసాయ యాజమాన్య పద్ధతులు చేపట్టేందుకు వీలు కాని పంటలకు ఇవి ఎంతో మేలు చేస్తున్నాయన్నారు. సెన్సార్ బేస్డ్ నీటిపారుదల పరికరాలు ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ఉపయోగకరంగా మారాయన్నారు. జాతీయ చిరుధాన్యాల సంస్థ పరిశోధన డైరెక్టర్ డాక్టర్ తారా సత్యవతి మాట్లాడుతూ చిరుధాన్యాలు 4 వేల సంవత్సరాల నుంచి నుంచి సాగులో ఉన్నాయని గుర్తు చేశారు. చిరుధాన్యాల సాగులో మెలకువలను డాక్టర్ మాధవీలత వివరించారు. చిరుధాన్యాలు విజయవంతంగా సాగు చేస్తున్న రైతు రేనాటి రామసుబ్బారెడ్డి తన అనుభవాలను వివరించారు. చిరుధాన్యాలను శుభ్రపరిచే యంత్రాలు, సాగు చేసే విధానాలు రైతు విజయభూషణ్‌రెడ్డి, చిరుధాన్యాల విలువల పెంపుపై, మార్కెటింగ్‌లను నరసింహనాయక్‌లు వివరించారు. గత రెండు రోజులుగా ప్రదర్శనను తిలకించి తమ అభిప్రాయాలను చక్కగా వివరించి క్విజ్‌లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. రైతులు, విద్యార్థులు ప్రేక్షకులను ఆకట్టుకున్న మొదటి మూడు స్టాల్స్ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనకు, హోండా కంపెనీకి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రదర్శనలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డ్రోన్ టెక్నాలజీపై శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్.శారదజయలక్ష్మిదేవి, రిజిస్ట్రార్ డాక్టర్ జి.రామారావు, పాలక మండలి సభ్యులు డాక్టర్ చైతన్యకుమారి, డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ జి.కరుణాసాగర్, రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఎల్.ప్రశాంతి, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ డాక్టర్ ఎ.సుబ్బరామిరెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.