అభిప్రాయం
ప్రపంచ దేశాలలో స్విట్జర్లాండ్‌కు విశిష్ట స్థానము ఉన్నది. దానికి తటస్థ దేశంగా పేరున్నది. ప్రపంచం ప్రస్తతము ఘర్షణలు, కూటముల సంధి యుగంలో ప్రయాణిస్తున్నది. రెండు ప్రపంచ యుద్ధాలు, తర్వాత ప్రచ్చన్న యుద్ధము, దానికి కొనసాగింపుగా ప్రస్తుత ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాలు! వివిధ దేశాల మధ్య ఘర్షణలలో ఏ పక్షం వైపు మొగ్గకుండా స్విట్జర్లాండ్ తటస్థ వైఖరిని అనుసరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక విదేశాంగ విధానాన్ని రూపొందించుకున్నది. గత సెప్టెంబర్ 26న స్విట్జర్లాండ్‌లో ఈ తటస్థ విధానంపై రిఫరెండం జరిగింది. తటస్థ విధానాన్ని దేశ రాజ్యాంగంలో పొందుపరచి మరింత కఠినంగా తటస్థ విధానాన్ని అవలంభించాలా లేదా అనే అంశంపై ప్రజాభిప్రాయాసేకరణ (రిఫరెండం) నిర్వహించారు. సుమారు డెబ్భయ్ శాతానికి పైగా ప్రజలు ‘అవసరం లేదు. ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలి. దానిని మరింత కఠినం చేయాల్సిన అవసరం లేద’ని తీర్పిచ్చారు. స్విట్జర్లాండ్ తటస్థ దేశమయినా, నాటో కూటమికి సహకరిస్తూ ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాపై ఆంక్షలను అమలు పరుస్తున్నది. ఇది నిజమైన తటస్థ విధానానికి విరుద్ధం, తటస్థత నేపథ్యం చారిత్రకంగా పరిశీలిస్తే, స్విట్జర్లాండ్ తటస్థ విధానాన్ని ఒక ఆదర్శప్రాయ విధానంగా నైతికత ఆధారంగా స్వీకరించలేదు. శతాబ్దాల నుంచి దేశంలో అంతర్గత వైరుధ్యాలు, ఓటమి, భౌగోళిక అవసరాల కారణంగా స్విట్జర్లాండ్ తటస్థ విధానాన్ని ఎంచుకున్నది.
1515లో ‘మారిగానో’ యుద్ధంలో ఫ్రెంచ్, వెనిస్ సైన్యాలు స్విట్జర్లాండ్ సైన్యాలను ఓడించటము స్విట్జర్లాండ్ తటస్థ విధానానికి అంకురార్పణం. పెద్దెనిమిదవ శతాబ్దంలో ఫ్రెంచ్, ఆస్ట్రియన్, రష్యన్ సేనలకు స్విట్జర్లాండ్ యుద్ధక్షేత్రంగా మారింది. నేపోలియన్ ఓటమి తరువాత స్విట్జర్లాండ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించి 1815 పారిస్ ఒప్పందం ప్రకారము స్విట్జర్లాండ్ తటస్థంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధము ప్రారంభించాక, యూరోపియన్ యూనియన్ రష్యాపై వివిధ ఆంక్షలు విధించింది. స్విట్జర్లాండ్ కూడా తనంత తానుగా రష్యాపైన ఆంక్షలను అమలు పరుస్తున్నది. ఇది తటస్థ విధానానికి వ్యతిరేకమని, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా నిలబడటమేనని స్విస్ పీపుల్స్‌పార్టీ వాదిస్తున్నది. తటస్థ విధానం ప్రకారము తనపై దురాక్రమణ జరిగితే తప్ప స్విట్జర్లాండ్ యుద్ధంలో పాల్గొనదు, సైనిక కూటములలో చేరదు. ఇతర దేశాల మధ్య యుద్ధాలలో ఎవరి పక్షము వహించదు. ఐక్యరాజ్యసమితి అంగీకారం లేకుండా ఏ దేశాలపైన ఆంక్షలను విధించదు. ఘర్షణ పడుతున్న దేశాలకు స్విట్జర్లాండ్ తన తటస్థ విదానం ద్వారా మధ్యవర్తిత్వం వహిస్తుంది.
రిఫరెండం ఫలిత ఫ్రభావం
రష్యాపై ఆంక్షలు స్విట్జర్లాండ్ తటస్థ విధానంపై ప్రశ్నలు లేవనెత్తాయి. అయితే సెప్టెంబర్ 2026 రిఫరెండం ఈ ప్రశ్నలకు కొంతవరకు సమాధానాలను ఇచ్చినట్లే చెప్పాలి. అయితే ఈ ‡రిఫరెండంలో కేవలం నలభయ్ శాతము ప్రజలు మాత్రమే పాల్గొనటాన్ని గమనించాలి. ఇది స్విట్జర్లాండ్ ప్రజలందరి అభిప్రాయంగా ఇప్పుడే నిర్థారించలేము. స్విస్ ప్రజలు రిఫరెండంను ఆమోదించి ఉండినట్లయితే, రష్యాపై స్విట్జర్లాండ్ ఆంక్షలు ఎత్తివేయాల్సి ఉండేది. ఐరోపా బ్యాంకింగ్, ఫైనాన్స్, కమోడిటీ మార్కెట్లకు స్విట్జర్లాండ్ గుండెలాంటిది. స్విస్ కలిసిరాకపోతే, రష్యాపై ఆంక్షల అమలు బలహీన పడుతుంది. నాటోతో సైనిక సహకారాన్ని కూడా నిలిపివేయాల్సి వచ్చేది. అయితే దీని వలన నాటో కూటమిపై ప్రభావం ఏమీ ఉండదు. తటస్థతను మరింత కఠినం చేయటాన్ని తిరస్కరించటంతో, స్విట్జర్లాండ్ యూరోపియన్ యూనియన్ల మధ్య సంబంధాలు మరింత బలపడటానికి అవకాశాలున్నాయి. అయితే యూరోపియన్ యూనియన్‌లో వాణిజ్యము, రవాణా, సంక్షోభ నిర్వహణ లకు సంబంధించిన ద్వైపాక్షిక ప్యాకేజీ పైన నవంబర్ నెలలో మళ్లీ రిఫరెండం జరగబోతున్నది. ఆ రిఫరెండంలో స్విస్ ప్రజలు యూరోపియన్ యూనియన్‌తో కూటమి కట్టడానికి మొగ్గు చూపుతారా లేదా అనేది వేచి చూడాలి.
తటస్థతపై రిఫరెండం ఫలితం ఒకరకంగా రష్యాకు ఎదురుదెబ్బగానే భావించాలి. స్విస్ ప్రజలు రష్యాపై ఆంక్షలకు ఆమోదం తెలపటం రష్యాకు నిరాశను మిగిల్చింది. ఆంక్షలకు మద్దతివ్వటంతో స్విట్జర్లాండ్‌ను రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భాగస్వామిగా పరిగణిస్తున్నది. సైనిక ఘర్షణ, యుద్ధంలో పాలుపంచుకుంటున్న మిత్ర దేశాలకు స్విట్జర్లాండ్ ఆయుధాలను సరఫరా చేయవచ్చా లేదా అనే విషయంపై నవంబర్‌లో మళ్లీ రిఫరెండం జరగనున్నది. దీని ఫలితం స్విట్జర్లాండ్ తటస్థతకు లిట్మస్ టెస్ట్ కాబోతున్నది. ఆస్ట్రియా, ఐర్లాండ్, సైపస్, మాల్టాలు కూడా స్విట్జర్లాండ్ లాగానే తటస్థ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఆస్ట్రియా, మాల్టాల రాజ్యాంగాలలోనే తటస్థత నిర్దేశించారు. ఐర్లాండ్ ఇటీవల ఫిబ్రవరి 2026లో మారిటైమ్ సెక్యూరిటీ స్ట్రాటజీలో భాగంగా నాటోతో సన్నిహిత సంబంధాలకు, కొత్త నావెల్ బేస్‌లకు పచ్చజెండా ఊపింది. ఆస్ట్రియా కూడా ప్రత్యక్షంగా నాటో కూటమితో సైనిక సంబంధాలను ఏర్పరుచుకోకపోయినప్పటికీ, యూరోపియన్ యూనియన్‌తో సన్నిహిత సంబంధాలను ఏర్పరుచుకొన్నది. స్వీడన్, ఫిన్లాండ్‌లు ఇప్పటికే తటస్థ విధానాన్ని వదిలేసి నాటోలో సభ్యత్వాన్ని తీసుకున్నాయి. రష్యా పవర్ ప్లే నేపథ్యంలో స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, మాల్టా వంటి దేశాల తటస్థ విధానానికి అగ్ని పరీక్ష ఎదురయిందనే చెప్పాలి.
భారత్‌కూడా మొదటినుండీ ఏ సైనిక కూటములలో చేరకుండా, అలీన విధానాన్ని పాటిస్తున్నది. 2015 నుండి భారత్, విదేశాంగ విధానంలో స్ట్రాటజిక్ ఆటానమీని పాటిస్తున్నది. ఇది తటస్థ విధానం కాదు. దేశప్రయోజనాలకు అనుగుణంగా వివిధ దేశాలతో నిర్మాణాత్మక సంబంధాలను నెరపుతున్నది. రష్యాపై ఆంక్షలను భారత్ ఆమోదించలేదు. వ్యాపార లావాదేవీలలో భాగంగా రష్యా నుండి చమురును కొనుగోలు చేస్తున్నది. ఆదే సమయంలో యూరోపియన్ యూనియన్‌తో సమగ్ర వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఒకవైపు అమెరికాతో సుంకాల యుద్ధము చేస్తూనే, మరొకవైపు అమెరికాతో కలిసి క్వాడ్ కూటమి ద్వారా చైనాపై వత్తిడికి ప్రయత్నిస్తున్నది. భారత్‌కు ఆర్థిక, వాణిజ్య రంగాలపరంగా అమెరికాతో సత్సంబంధాలు కీలకం. అదే సమయంలో రష్యాతో సైనిక, వ్యూహాత్మక సంబంధాలు కీలకం. చైనాతో ఘర్షణ నేపథ్యంలో అమెరికాతో స్నేహాన్ని వదులుకోలేము. అందువలన భారత్ తటస్థ విధానాన్ని అవలంబించటము కుదరదు. వేగంగా మారుతున్న ప్రపంచ జియో పొలిటికల్ సమీకరణాల నేపథ్యంలో స్విట్జర్లాండ్ వంటి యూరోపియన్ దేశ తటస్థ విధానము క్రమంగా పలచబడుతున్నది. క్రమంగా తటస్థ దేశాలన్నీ ఇతర యూరోపియన్ దేశాలతో రష్యాకు వ్యతిరేకంగా కూటమి ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి.
గురజాల శ్రీనివాసరావు
వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);
సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు


