దాచటం దేశభక్తిని చాటడమా? | Sakshi Guest Column On Operation Sindoor | Sakshi
Sakshi News home page

దాచటం దేశభక్తిని చాటడమా?

Jun 6 2025 12:21 AM | Updated on Jun 6 2025 7:59 PM

Sakshi Guest Column On Operation Sindoor

‘ఆపరేషన్‌ సిందూర్‌’ విజయం వెనుక ఉన్న వ్యూహకర్తలు

విశ్లేషణ

దేశభక్తి ఎంత అవసరమో, స్వప్రయోజనాల కోసం ఆ భావనను మితిమీరిన స్థాయికి తీసుకెళ్లి చూడటం అంత అనర్థదాయకం. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ క్రియాశీలకంగా మే 10న ముగిసిన 20 రోజులకు 31వ తేదీన ఈ విషయం బాగా స్పష్టమైంది. 

ఆ రోజున భారతదేశపు త్రివిధ దళాధిపతి, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సి.డి.ఎస్‌.) జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ సింగపూర్‌లో ‘బ్లూమ్‌బర్గ్‌’ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ, ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో భారత వైమానిక దళం యుద్ధ విమానాలు కూలిన మాట నిజమేనని ఎట్టకేలకు అంగీకరించారు. దానితో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సుడిగాలిలా చర్చ చెలరేగింది. 

రఫేల్‌ కూలిందనగానే కలకలం
యుద్ధాలు జరిగినపుడు రెండు వైపులా నష్టాలు ఏదో ఒక మేర వాటిల్లటం సహజం. అమెరికా వంటి అత్యంత శక్తిమంతమైన దేశం సైతం చిన్న చిన్న దేశాల చేతిలో నష్టపోయిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మన యుద్ధ విమానాల నష్టాల వార్తలు ప్రపంచమంతటా వ్యాపించిపోయినా, అలాంటిదేమీ జరగలేదంటూనే వచ్చింది. 

పైగా, పహల్‌గామ్‌ దురంతం, ఆపరేషన్‌ సిందూర్‌ల దరిమిలా దేశంలో పెల్లుబికిన దేశభక్తి రాజకీయ ప్రయో జనంగా మారుతుండగా, దాన్ని అంతులేని విధంగా పొందేందుకు రకరకాల ప్రయత్నాలు జరిగాయి. యుద్ధ విమానాల నష్టాలను దాచి పెట్టటం వాటిలో ఒకటి. 

మే 6–7 తేదీల మధ్య ‘ఆపరేషన్‌’ మొదలై పాకిస్తాన్‌లోని ఉగ్ర వాద స్థావరాలపై భారత వైమానిక దాడులు విజయవంతంగా జరి గాయి. ఆ వెంటనే పాకిస్తాన్‌ సైన్యం తాము ఆ దాడి సమయంలో భారత్‌కు చెందిన 5 విమానాలను (మర్నాడు ఆరుకు పెంచారు) కూల్చివేశామని ప్రకటించింది. వాటిలో భారత్‌కు ఫ్రాన్స్‌ సరఫరా చేసిన రఫేల్‌ విమానాలు మూడు, రష్యా నుంచి వచ్చిన మిగ్‌లు రెండు, మరొకటి ఉన్నాయని పాకిస్తాన్‌ కనీస వివరాలు కూడా ఇచ్చింది. ఆ వార్త ప్రపంచం అంతటా సంచలనంగా మారింది.

అందుకు కారణం మిగ్‌ల కన్నా ఎక్కువగా రఫేల్‌ విమానాలు కూలి పోవటం! రఫేల్‌ విమానాలకు ఉన్న పేరు, మనం వాటిని ఖరీదు చేసినప్పుడు వర్ణించిన వాటి శక్తి సామర్థ్యాల గురించి తెలిసిందే.

అందువల్ల, మరీ ముఖ్యంగా పాక్‌ వైమానిక బలం సాధారణమైన దనే అభిప్రాయం మనలో ఉన్నందున, పాకిస్తాన్‌ ప్రకటన నమ్మ శక్యం కానిదయింది. గమనించవలసిందేమంటే, ఆ ప్రకటనకు భారత సైన్యం అవునని గానీ, కాదని గానీ స్పందించకపోవటం.  

‘వ్యూహాత్మక పొరపాటు’గా ఒప్పుకోలు
మరొకవైపు ప్రపంచ వార్తా సంస్థలు విచారణలు మొదలుపెట్టి భారత్‌ విమానాలు కూలిన మాట నిజమని ధ్రువీకరించాయి. మొద టైతే ఒక రఫేల్‌ విమానం కూలిన మాట వాస్తవమేనని స్వయంగా రఫేల్‌ ఉత్పత్తిదారైన ఫ్రెంచ్‌ దస్సాల్ట్‌ కంపెనీ తెలియజేసింది. ఆ వెంటనే అమెరికన్‌ ఇంటిలిజెన్స్‌ ధ్రువీకరించింది. 

ఇంతకూ రఫేల్‌ను కూల్చగలిగిన పాకిస్తాన్‌ యుద్ధ విమానాలు, క్షిపణులు ఏవి అనే విచారణను పాశ్చాత్య మీడియా సంస్థలు, నిఘా సంస్థలు జరిపినప్పుడు, అవి చైనా నుంచి పాకిస్తాన్‌ కొనుగోలు చేసిన జె–35 విమానాలని తేలింది. దానితో అందరూ ఉలిక్కిపడ్డారు. 

ఎందుకంటే చైనా స్వయంగా గత 40 ఏళ్లుగా ఎవరితోనూ వైమానిక యుద్ధాలు చేయలేదు. వారు ఆ విమానాలను విక్రయించిన మరే దేశమూ యుద్ధం చేయలేదు. కనుక వారి ఆయుధాల శక్తి ప్రపంచానికి డాక్యు మెంట్లలో చదవటం తప్ప ప్రత్యక్షంగా తెలియదు. 

ఆ శక్తి ఏమిటో ఇపుడు ప్రదర్శితం కావడంతో జె–35ను ఉత్పత్తి చేసిన చెంగ్‌దూ కంపెనీ స్టాక్స్‌ 48 గంటలలో 40 శాతం పెరగగా, దస్సాల్ట్‌ స్టాక్స్‌ 10 శాతానికి పైగా పడిపోయాయి. జె–35 కొనుగోలుకు వేర్వేరు దేశాల నుంచి ఆసక్తి వ్యక్తం అయింది. అయితే స్వయంగా ఆ కంపెనీ గానీ, చైనా గానీ ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ మే 10న ఆగే నాటికి ఇదీ పరిస్థితి.

వైమానిక నష్టాల గురించి విదేశాలలో ఎన్నెన్ని కథనాలు వెలు వడుతున్నా, ఆ నష్టాలు తాము చేసినట్లు పాకిస్తాన్‌ పదే పదే ప్రకటి స్తున్నా, భారత ప్రభుత్వం మౌనం వహించింది. మే 11న భారత త్రివిధ దళాధిపతులు మీడియా పమావేశం నిర్వహించారు. ఒక విలేఖరి ప్రశ్నకు సమాధానంగా ఎయిర్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ అయిన ఎయిర్‌ మార్షల్‌ ఎ.కె. భారతి – ‘‘యుద్ధంలో నష్టాలు సర్వ సాధారణం. 

యుద్ధం ఇంకా సాగుతున్నందున నేను ఆ వివరాల్లోకి వెళ్లబోను’’ అన్నారు. అదే ప్రశ్నను విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీకి వేయగా, ‘‘ఆ విషయాలు నాకు తెలియవు. కచ్చితమైన వివరాలను తగిన సమయంలో వెల్లడిస్తాము’’ అని జవాబిచ్చారు. 

ఆ మాటల అంతరార్థం తెలిసిపోతున్నా ప్రభుత్వం మాత్రం ఆ విషయం మాట్లాడేందుకు నిరాకరిస్తూనే పోయింది. ఆ 11వ తేదీ నుంచి 31 వరకు 20 రోజుల పాటు నష్టాల వివరాలు ప్రపంచానికంతా తెలి శాయి. సింగపూర్‌లో అయినా జనరల్‌ చౌహాన్, విమానాలు కూలా యన్నారు గాని ఎన్ని కూలాయో పేర్కొనలేదు. 

ఇక సైన్యాధికారులు 11న గాని, 31న గాని, మనం లక్ష్యాలను ఛేదించామా లేదా, దాడి సమయంలో జరిగిన వ్యూహాత్మక పొరపాటును గ్రహించి దిద్దుబాటు చేసుకున్నామా లేదా అనేవే ప్రధానమని అంటూ దాటవేయ బూనారు. ప్రభుత్వ విధానం అది గనుక వారినేమీ అనలేము. 

దేశభక్తిని ప్రేరేపించే ప్రయత్నాలు!
ఏ యుద్ధంలోనూ ఏ దేశం కూడా సమగ్రమైన వివరాలు వెల్లడించదు. అందులో రక్షణపరమైన అంశాలు కొన్ని ఇమిడి ఉంటాయి గనుక! కానీ, ప్రస్తుత సందర్భంలోæపలు వివరాలు వెల్లడై సంచలనంగా మారుతున్నపుడు, మనం వాస్తవాలను అనవసరంగా దాచి పెడుతున్నామనే అభిప్రాయం ఏర్పడుతూ ప్రతిష్ఠకు భంగం వాటిల్లు తున్నప్పుడు, వాస్తవాలు ఏమిటని ప్రతిపక్షాలు పలుమార్లు ప్రశ్నిస్తున్నప్పుడు, పార్లమెంటరీ కమిటీలో ప్రస్తావించి ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశం ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నపుడు ఇది సాధారణ పరిస్థితుల వంటిది కాబోదు. 

కేంద్ర ప్రభుత్వం ఈ వాస్తవాలను గుర్తించి అందుకు తగినట్లు వ్యవహరించటానికి బదులు, వాస్తవాలు ప్రజలకు తెలిస్తే వారిలో దేశభక్తి తగ్గుతుందనీ, అది తగ్గితే రాజకీయ ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుందనీ అన్నట్లుగా ఉండిపోయింది.

ఇది చాలదన్నట్లు సింధూ నదీ జలాల ఒప్పందం, పీఓకేలను మోదీ ప్రభుత్వం బలంగా ముందుకు తెచ్చింది. ఈ లక్ష్యాలు నెరవేరటం ఆచరణలో ఎంత సాధ్యమన్నది అలా ఉంచి, పనిలో పనిగా వాటి పేరిట కూడా దేశభక్తిని స్థాయి పెంచి రాజకీయంగా లబ్ధి పొందాలన్న యోచన మాత్రం ప్రస్తుత ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఉగ్రవాదాన్ని, దాని ప్రోత్సాహకులను దెబ్బతీయాల నటం వరకు నిర్వివాదమైన విషయం. 

ఇటువంటి సందర్భాలలో ప్రజల దేశభక్తి అత్యంత సహజం. అదేవిధంగా యుద్ధాలు జరిగి నపుడు ఏదో ఒక మేరకు రెండు వైపులా నష్టాలు అనివార్యం. అంతి మంగా చూడ వలసింది పైచేయి సాధించి లక్ష్యాలను ఆ మేరకు నెరవేర్చుకున్నామా లేదా అనేది మాత్రమే. 

‘క్రికెట్‌ మ్యాచ్‌లో పోయిన వికెట్లు ముఖ్యం కాదు, తుది ఫలితం ముఖ్యం’ అంటూ ఆఖరికి జనరల్‌ చౌహాన్‌ వెల్లడించిందీ అదే! విషయాన్నంతా రాజ కీయ స్వప్రయోజనాల కోసం వినియోగించదలుచుకొని, రకరకాల పద్ధతులలో వాస్త వాలను దాచేందుకు ప్రభుత్వం మితిమీరి వ్యవహ రించటం సరి కాదు. ‘అతి సర్వత్ర వర్జయేత్‌’ అనే హితవు భారతీయ సంస్కృతిలో ఊరకనే రాలేదు.

టంకశాల అశోక్‌
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement