సరైన ‘నియంత్రణ’తోనే దివ్యౌషధం | Sakshi
Sakshi News home page

సరైన ‘నియంత్రణ’తోనే దివ్యౌషధం

Published Wed, Dec 13 2023 12:38 AM

Sakshi Guest Column On Indian Pharma Sector

భారత్‌లో తయారైన మందులు తీసుకోవడం వల్ల గాంబియా, ఉజ్బెకిస్తాన్  వంటి దేశాల్లో కొంతమంది మరణించినట్లు గత ఏడాది వార్తలొచ్చాయి.ఈ నేపథ్యంలో సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్  దేశ ఫార్మా రంగంలో నాణ్యతా ప్రమాణాలపై సర్వే ప్రారంభించింది. విమర్శకులు చాలాకాలం నుంచి చేస్తున్న ఆరోపణలు కఠిన వాస్తవమని ఈ సర్వే ద్వారా ప్రభుత్వానికీ స్పష్టంగా తెలిసింది. దీనివల్ల వాస్తవ పరిస్థితులపై ప్రభుత్వ సంస్థల కళ్లు విచ్చుకున్నాయని చెప్పాలి. లేదా చాలాకాలంగా తెలిసిన విషయాలను వీరు అసలు పట్టించుకోలేదని అయినా అనుకోవాలి. సర్వే చెప్పిన అంశాల్లో ఒకటి – దేశంలో నాణ్యత ప్రమాణాలను పాటించడంపై అస్సలు శ్రద్ధ లేదు అన్నది. నిబద్ధత, తగిన శిక్షణ లేకపోవడం అన్నవి సరేసరి.

నాణ్యతా ప్రమాణాల లోపాల ఫలితంగానే నాసిరకం ఔషధాలు భారత్‌లో పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతున్నాయి. మందులు చౌకగా లభిస్తాయన్న ఢంకా బజా యింపునకూ ఇవే కారణాలయ్యాయి. 

పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు ఇంకా మొదలు కావాల్సి ఉన్నా, సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్  సర్వే జరపడమే కొంత ప్రభావం చూపుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ సంస్థలు ఇప్పుడు ఒక్కతీరుగా ఆలోచించడం మొదలుపెట్టాయి. చేయాల్సిన పనులు, చేపట్టాల్సిన చర్యలపై స్పష్టతా ఏర్పడింది.

మితిమీరిన జోక్యం...
దేశ ఫార్మా రంగాన్ని పట్టిపీడిస్తున్న అంశం ఏదైనా ఉందీ అంటే అది మితిమీరిన ప్రభుత్వ జోక్యమనే చెప్పాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలకు చెందిన పలు సంస్థలు ఫార్మా రంగంలో జోక్యం చేసుకుంటూంటాయి. ఈ క్రమంలో ఎవరికి వారు తమ ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తూంటారు. తద్వారా అసలు ప్రయోజనం దెబ్బతింటూ ఉంటుంది. స్థానికంగా తయారయ్యే మందులకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు లైసెన్సులు జారీ చేస్తూంటాయి. దీనివల్ల చాలా మందుల నాణ్యత అనేది రాష్ట్రాన్ని బట్టి మారిపోతూంటుంది. 

ఫార్మా రంగంపై నియంత్రణ సుస్పష్టంగా ఉన్నప్పుడే నాణ్యతను కాపాడేందుకు అవకాశం ఉంటుంది. నాణ్యమైన మందులు లేకపోతే ఈ ఆధునిక యుగంలో మరింత ఎక్కువ కాలం జీవించడం అసాధ్యం. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలోనూ ఫార్మా రంగం ప్రాముఖ్యత ఏమిటన్నది కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరమూ లేదు. భారత్‌కు ప్రపంచ ఫార్మా రాజధాని అనే పేరుంది. జెనెరిక్‌ మందులతో అన్ని దేశాల్లోనూ అవస రార్థులకు మందులు (పేటెంట్‌ హక్కులు లేనివి) అందుబాటులో ఉండేందుకు కారణమైంది భారత్‌! ప్రాణాంతక హెచ్‌ఐవీ నియంత్రణలో ఈ జెనెరిక్‌ ఔషధాలది చారిత్రాత్మక పాత్ర. భారతీయ ఫార్మా కంపెనీల జెనెరిక్‌ ఉత్పత్తుల్లేకపోతే ఈ రోజు అమెరికా సహా పలు దేశాల్లో పరిస్థితులు భిన్నంగా ఉండేవి. 

చరిత్రను తరచి చూస్తే...
భారతీయ ఫార్మా రంగం సాధించిన ఘన విజయాలకు ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి క్రెడిట్‌ ఇవ్వాల్సి వస్తుంది. 1970లలో ప్రాసెస్‌ పేటెంట్లకు కట్టుబడుతూనే... ప్రాడక్ట్‌ పేటెంట్లకు భారత్‌ ‘నో’ చెప్పిన విషయం తెలిసిందే. ఈ ఏర్పాటు వల్ల పశ్చిమ దేశాల్లో పేటెంట్‌ హక్కులున్న ఖరీదైన మందులను కూడా ప్రత్యా మ్నాయ మార్గాల ద్వారా చౌకగా తయారు చేసే వీలేర్పడింది. ఫలితంగానే భారత్‌ మోతాదుల పరంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఫార్మా పరిశ్రమగా అవతరించగలిగింది.

విలువ ఆధారంగా చూస్తే మాత్రం మనది 14వ స్థానం. భారత ఫార్మా రంగం మార్కెట్‌ విలువ 5,000 కోట్ల డాలర్లు కాగా ఇందులో సగం ఎగుమతుల ద్వారా లభిస్తోంది. ప్రపంచ టీకా డిమాండ్‌లో 60 శాతాన్ని భారత్‌ పూరిస్తోందంటే పరిస్థితి ఏమిటన్నది తెలుస్తుంది. అమెరికా జెనెరిక్‌ మందుల డిమాండ్‌లో 40 శాతం భారత్‌ ద్వారా తీరుతోంది. యూకే ఔషధా లన్నింటిలో 25 శాతం ఇక్కడి నుంచే వెళుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో భారత్‌లో తయారయ్యే మందుల నాణ్యతపై ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నం కారాదు. ఈ రకమైన నమ్మకం ఉన్నందునే గాంబియాలో మన మందుల వాడకం వల్ల పిల్లలు కొందరు మరణించారన్న వార్త కలకలం రేపింది. ఆ వెంటనే ఉజ్బెకిస్తాన్,శ్రీలంక... చివరకు అమెరికా నుంచి కూడా ఇదే రకమైన ఆరోపణలు రావడం పరిస్థితిని మరింత  దిగజారేలా చేసింది. 

మనకు మాత్రం నష్టం లేదా?
మందుల కంపెనీల్లో చాలా సందర్భాల్లో కల్తీలను గుర్తించేందుకు అవసరమైన పరికరాలు, తగిన అర్హతలున్న సిబ్బంది కొరత ఉంటుంది. డైఎథిలీన్  గ్లైకాల్‌ వంటివి అంధత్వానికి కారణమవుతాయి. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఎగుమతుల కోసం ఉద్దే శించిన అన్ని దగ్గుముందులను ప్రభుత్వ పరిశోధన శాలల్లో పరీక్షించాలని ఒక ఆదేశం జారీ చేసింది.

కానీ ఇదేమంత సత్ఫలితాలు చూపలేదు. ఎందుకంటే ఫార్మా విషయాలను వాణిజ్య శాఖ పర్యవేక్షించే పరిధి లేకపోవడం. అంతేకాకుండా... వాణిజ్య శాఖ ఇంకో ప్రశ్న కూడా లేవనెత్తింది. అదేమిటంటే, ఇలాంటి కల్తీ దగ్గు మందుల కారణంగా భారతీయ రోగులకు హాని జరగడం లేదా అని! జమ్మూలో అదే జరిగింది. 2019 డిసెంబరు 2020 జనవరి మధ్య కాలంలో కల్తీ దగ్గుమందు వేసుకోవడం వల్ల దాదాపు 12 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.

గత ఏడాది ఇంకో చిత్రమైన ఘటన జరిగింది. 1940 నాటి డ్రగ్స్‌ అండ్‌ కాస్మోటిక్స్‌ యాక్ట్‌ స్థానంలో డ్రగ్స్, మెడికల్‌ డివైజెస్‌ అండ్‌ కాస్మోటిక్స్‌ బిల్‌ 2023ను ప్రవేశపెట్టాలని ప్రయత్నించారు. ఇప్పు డున్న వివాదాస్పద అంశాలు వేటికీ ఇందులో చోటు లేకుండా పోయింది. 

ఫార్మా రంగం సంస్కరణలు లక్ష్యంగా తీసుకొచ్చే ఏ కొత్త చట్టమైనా లైసెన్సింగ్‌ ప్రక్రియను కేంద్రీకృతం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే దేశవ్యాప్తంగా ఔషధ నియంత్రణ ఏకరీతిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం 28 రాష్ట్రాల్లో డ్రగ్‌ రెగ్యులేటర్స్‌ ఉన్నారు. జాతీయ స్థాయిలో ఒకే ఒక్క డ్రగ్‌ రెగ్యులేటింగ్‌ వ్యవస్థ... ఈ వ్యవస్థకు సలహా సూచనలు అందించేందుకు రెండు స్టాట్యుటరీ వ్యవస్థలు ఉంటే సరిపోతుంది. డ్రగ్‌ కంట్రోలర్‌ కార్యాలయం కూడా స్వతంత్ర సంస్థగా ఉండాలి. దీనివల్ల మంత్రుల ఆమోదం లేకుండానే డ్రగ్‌ కంట్రోలర్‌ అవసర మైనప్పుడు నిపుణులను నియమించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. 

ఇప్పటికే వ్యతిరేక పవనాలు...
ఫార్మా రంగానికి సంబంధించి ఇప్పటికే కొన్ని వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఫార్మా దిగుమతుల విషయంలో అమెరికా కొన్ని కఠిన మైన చర్యలకు సిద్ధమవుతోంది. భారతీయ ఫార్మా కంపెనీలకు నాణ్యత విషయంలో ఇప్పటికే అగ్రరాజ్యం బోలెడన్ని సార్లు హెచ్చ రికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ పరిణామం కీలకం కానుంది. ఆఫ్రికా దేశాలు కొన్ని కూడా అమెరికా మాదిరిగానే ఆలోచిస్తూండటం గమనార్హం. 

ఇంకో ముఖ్య విషయం... ఫార్మా రంగ పరీక్షలకు సంబంధించి అందరికీ అందుబాటులో ఉండేలా ఒక ఐటీ వేదిక సృష్టి వెంటనే జరగాలి. గత సమాచారం, ప్రస్తుత పరిణామాలన్నింటికీ ఈ వేదిక ఒక రెఫరెన్ ్స పాయింట్‌లా ఉండాలి. పరిశ్రమ వర్గాలతోపాటు నియంత్రణ సంస్థలు, ఈ అంశంపై పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఈ వేదికను  ఉపయోగించుకుని తమ సామర్థ్యాన్ని మెరుగుపరచు కోవచ్చు. ఆన్ లైన్  ప్రభుత్వ సేవల రంగంలో భారత్‌కు ఉన్న అను భవాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇదేమంత పెద్ద సంగతి కానేకాదు.

ఫార్మా రంగ సంస్కరణల విషయంలో వాంఛనీయమైన పరిణామం ఏదైనా ఉందంటే అది ఇటీవలి కాలంలో సంబంధిత మంత్రి చేసిన ఒక ప్రకటన. ‘‘ఫార్మా రంగ నియంత్రణ అనేది సహ కార సమాఖ్య తీరులో సాగాలి’’ అన్న ఆయన మాటలు ఆచరణలోకి వస్తే వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుకోవడమే కాకుండా... ఒకరికి ఒకరు ఆసరాగా నిలవడం ద్వారా మరింత బలోపేతం కావచ్చు కూడా. పార్టీల మధ్య తీవ్రమైన వైరం నెలకొన్న... త్వరలోనే పార్లమెంటరీ ఎన్నికలు ఇంకో ఆరు నెలల్లో జరగబోతున్న నేపథ్యంలో ఈ మాత్రం మార్పు ఆహ్వానించదగ్గదే!

సుబీర్‌ రాయ్‌ 
వ్యాసకర్త సీనియర్‌ ఆర్థిక విశ్లేషకులు
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

Advertisement
Advertisement