సందర్భం
కాలిబాటలపై నడవడాన్ని పౌరుల ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు ఇటీవల ప్రకటించింది. ఇదొక మైలురాయి లాంటిది. ప్రాథమిక హక్కులలో ఇప్పటికే ఉన్న, జీవించడానికీ, సంచరించడానికీ ఉన్న హక్కు పరిధిలోకి దాన్ని తెచ్చారు. రోడ్డంటూ ఉంటే నడిచేవారికి ప్రత్యేకించిన బాట చూపడాన్ని ఒక విధిగా కోర్టు పేర్కొంది. దాన్ని పట్టణాభివృద్ధి సంస్థల, పురపాలక సంస్థల, పంచాయతీల బాధ్యతగా చెప్పింది. బహుశా, పాదచారుల హక్కులకు సంబంధించి ఓ భారతీయ కోర్టు ఇలా నిర్ద్వద్వంగా పేర్కొన్న తీర్పు ఇదే.
దీన్ని కోర్టు నుంచి సకాలంలో వచ్చిన ఆదేశంగా భావించాలి. ప్రభుత్వాల విధానాలన్నీ పట్టణాలు, నగరాల్లో మౌలిక వసతుల అభివృద్ధి చుట్టూ తిరుగుతున్నాయి. వాటి దృష్టంతా హైవేలు, ఫ్లైవోవర్లు, సబ్‌వేల వంటివాటిపైనే ఉంది. మోటారు వాహనాల్లో వెళ్ళేందుకు వీలైన మౌలిక వసతిని కల్పించడమే అభివృద్ధికి చిహ్నంగా చిత్రిస్తున్నారు. భారతీయ నగరాల్లో ఇపుడున్న కాలి బాటలు హాయిగా నడిచేందుకు అనుకూలమైనవిగా లేవు, సురక్షితమైనవి కావు. అసలు వాటి డిజైనే సరిగ్గా లేదు. వివిధ ప్రభుత్వ సంస్థలు, పౌర సమాజ సంఘాలు దేశంలోని పెక్కు పట్టణాలు, నగరాల్లో నిర్వహించిన సర్వేలలో తేలిన అంశమిది.
కాలిబాటల దయనీయ స్థితికి ప్రభుత్వ విధానాలనే తప్పు పట్టాలి. ‘మన నగరాలు, అన్ని ప్రణాళికల్లో ప్రజలనే కేంద్ర బిందువుగా చేసుకుంటున్నాం’ అంటూ 2006లో చేపట్టిన జాతీయ పట్టణ రవాణా విధానం గొప్పగా చెప్పుకొంది. ఆచరణలో తీసుకుంటున్న చర్యలు, ప్రణాళికలు దానికి విరుద్ధంగా ఉంటున్నాయి. కార్లు, స్కూటర్లు వంటివాటికి రోడ్డులో ఎక్కువ చోటు కేటాయించాలనే డిమాండ్‌ను తీర్చడంపైనే విధానాల దృష్టి కొనసాగుతోంది.
రోడ్డంతా వాహనాలకేనా?
నిర్దిష్ట విధానాలంటూ లేకపోవడం వల్ల కాలిబాటలను ప్రత్యే కించి పట్టించుకునే ఏజెన్సీలు గానీ, కాలిబాటల వసతులకు బడ్జెట్ కేటాయింపులుగానీ ఉండడం లేదు. రోడ్లను నిర్మించే రోడ్లు, వంతెనల శాఖ వంటి ప్రభుత్వ ఏజెన్సీలు కాలిబాటలను నిర్మించి, నిర్వహించే బాధ్యత నగర పాలక సంస్థలదేనని భావిస్తున్నాయి. రోడ్ల శాఖే వాటిని పట్టించుకోవాలని స్థానిక పాలనా సంస్థలు భావిస్తున్నాయి. పట్టణాలు, నగరాల్లో రవాణాలో బహుళ సంస్థల భాగ స్వామ్యం ఉంటోంది. అవి ఒకదానినొకటి నిందించుకుంటూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలతో పనిచేస్తున్నాయి. దీర్ఘకాలిక నగర విస్తృత ప్రణాళికలు పెట్టుబడులు భారీగా అవసరమైన ప్రణాళికలను సూచిస్తూ, కాలినడక అవసరాలను తరచు గాలికొదిలేస్తున్నాయి.
ఒకవేళ, కేటాయింపులు జరిగినా ఆ నిధులను సరిగ్గా డిజైన్ చేయని, ఆకర్షణీయంగా మాత్రం కనిపించే ఓవర్‌హెడ్ క్రాసింగ్ లేదా ఫుట్–ఓవర్ బ్రిడ్జీల నిర్మాణానికి వెచ్చిస్తున్నారు. ఎక్కడైనా పాదచారుల మౌలికవసతిని అభివృద్ధి చేసినా అది కూడా కార్లు లేదా టూవీలర్ల వాడకందారులను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసినదే అయివుంటోంది. మోటారు వాహనాలు వెళ్ళే దారిలోనే లాంగ్ రూట్ తీసుకోవాల్సిన, రోడ్ల పొడుగూతా ఆనుకునే కాలిబాటలు ఉండాల్సిన పని లేదు. ఒకదానినొకటి ఆనుకుని ఉన్న రెండు ప్రాంతాలను కలిపేందుకు వాకర్లు వాహనాలు వెళ్ళే రూటునే అనుస రించవలసిన పని లేకుండా చిన్న కాలిబాటలకు డిజైన్ చేయవచ్చు.
వాతావరణ మార్పులను ఎదుర్కొనే సాధనం
సుప్రీంకోర్టు నిర్వచించిన విధంగా కాలినడక పౌరుల ప్రాథ మిక హక్కు మాత్రమే కాదు. అది మనిషికి, భూగోళానికి ఉభయ తారకమైనది. మధుమేహం, హైపర్ టెన్షన్, గుండె జబ్బులు, గుండె పోట్లు, క్యాన్సర్ల వంటివి ఒకరినుంచి ఒకరికి సంక్రమించేవికావు. ఈ రుగ్మతలకు దారితీసే ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్లలో శారీరక శ్రమ లేకపోవడం, ఒకేచోట కూర్చుని పనిచేసే జీవనశైలి వంటివి కూడా ఒకటని గుర్తించారు. సైకిల్ తొక్కడంతోపాటు, 20 నుంచి 30 నిమి షాల సేపు వేగంగా నడవడం శరీరాన్ని చురుకుగా ఉంచే ఉత్తమ మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఎట్టి పరిస్థితు ల్లోనూ 2030 కల్లా సాధించి తీరాలని పెట్టుకున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో చాలా వాటిని సాధించేందుకు కూడా నడకను ప్రోత్స హించే విధానాలు తోడ్పడతాయి.
కాలిబాటలను మెరుగుపరచి, నడక వసతులను కల్పిస్తే ప్రజా రోగ్యం మెరుగుపడడమే కాకుండా, పౌరుల ధనం ఆదా అవుతుంది. గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలు తగ్గించేందుకు ఇదొక తక్కువ ఖర్చుతో కూడిన మార్గంగా ఉపయోగపడుతుంది. నడకకు తగినంత సురక్షిత సదుపాయాన్ని కల్పిస్తే ప్రజా రవాణా సదుపాయాన్ని వినియోగించుకునే ఎవరైనా సరే రోజులో కనీసం నాలుగు సార్ల యినా నడవవలసి వస్తుంది. చెన్నైలో ఫుట్‌పాత్‌లను మెరుగు పరచడం వల్ల ఏటా 4,200 టన్నుల కార్బన్ డయాక్సైడ్, దానితో సమానమైన 12,000 టన్నుల గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలను నివారించగలిగినట్లు ఒక అధ్యయనంలో తేలింది. సుమారుగా 1,000 నుంచి 2,900 కార్లు ఒక ఏడాదిపాటు రోడ్డుపైకి రాకుండా ఉంటే ఎంత సత్ఫలితం ఒనగూడుతుందో దానివల్ల కూడా అంతే సమానమైన ప్రయోజనం చేకూరినట్లు వెల్లడైంది.
మూడు జోన్లు
ఫుట్‌పాత్‌ల గురించి చర్చ వచ్చినప్పుడల్లా, వాటిని ఆక్రమించు కుని ఉండే చిన్న తరహా విక్రేతల సమస్య కూడా అనివార్యంగా తొంగిచూస్తుంది. ప్రభుత్వంతోపాటు, సుప్రీంకోర్టు కూడా గతంలో ఈ సమస్యపై దృష్టి సారించకపోలేదు. సక్రమంగా నియంత్రిస్తే, పాదచారులతోపాటు చిన్న వ్యాపారులు కూడా పుట్‌పాత్‌లను వాడు కునే వీలుందని కోర్టు గతంలో వ్యాఖ్యానించింది. ఈ విక్రేతలు కూరగాయలు, పండ్లు, దైనందిన జీవితానికి అవసరమైన చిన్నచితక వస్తువులను అందుబాటులో ఉంచుతారు. పాదచారులు పనిమీద బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు వాటిని కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. పట్టణ వీధి వ్యాపారుల జాతీయ విధానం– 2004, 2009 మూడు జోన్ల సృష్టిని ప్రతిపాదించింది.
ఆంక్షలు లేకుండా విక్రయాలు జరుపుకునే ప్రదేశాలు, కొన్ని ఆంక్షలకు పరిమితమైన విక్రయ ప్రదేశాలు, విక్రయాలకు అవకాశం లేని ప్రదేశాలు. వాహనాల రద్దీ, డిమాండ్ తీరుతెన్నులు వంటి అంశాలను ఆయా జోన్ల సృష్టిలో పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. చిన్నచితక విక్రేతలే కాకుండా, కొందరు దుకాణదారులు కూడా తమ దుకాణాలను పుట్‌పాత్ పైదాకా విస్తరించడం సాధార ణంగా కనిపించే దృశ్యం. రెసిడెన్షియల్ కాలనీలలో అయితే, గృహ యజమానులు తమ వాహనాలను పార్క్ చేసుకునేందుకు ఫుట్ పాత్‌లను యథేచ్ఛగా వాడుకోవడం కనిపిస్తుంది.
కాలిబాటలకు సంబంధించి ఇంతవరకు ఎటువంటి విధానాలు, కార్యక్రమాలున్నా వాటినన్నింటిని సమీక్షించుకునేందుకూ, ఉన్న లోటుపాట్లను చక్కదిద్దుకునేందుకూ, రోడ్లను సముచితమైన రీతిలో వాడుకునేందుకు భరోసా కల్పించేందుకూ సుప్రీంకోర్టు తాజా రూలింగ్ ఒక అవకాశం కల్పిస్తోంది. భారతీయ పట్టణాలు, నగరాలు, జాతీయ హైవేల పొడవునా ఉన్న గ్రామాల్లో కూడా నడకకు, సైక్లింగ్‌కు వసతులు కల్పించి, నిర్వహించడానికి అగ్ర ప్రాధాన్యం ఇచ్చి తీరాలి. ఇది ప్రజారక్షణ, ఆరోగ్యం, వాతావరణం, సమానతకు సంబంధించిన అంశమని మరచిపోకూడదు.
దినేశ్ సి. శర్మ
వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత


