breaking news
Fundamental right of citizens
-
ఆరోగ్యమే కాదు... హక్కు కూడా!
కాలిబాటలపై నడవడాన్ని పౌరుల ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు ఇటీవల ప్రకటించింది. ఇదొక మైలురాయి లాంటిది. ప్రాథమిక హక్కులలో ఇప్పటికే ఉన్న, జీవించడానికీ, సంచరించడానికీ ఉన్న హక్కు పరిధిలోకి దాన్ని తెచ్చారు. రోడ్డంటూ ఉంటే నడిచేవారికి ప్రత్యేకించిన బాట చూపడాన్ని ఒక విధిగా కోర్టు పేర్కొంది. దాన్ని పట్టణాభివృద్ధి సంస్థల, పురపాలక సంస్థల, పంచాయతీల బాధ్యతగా చెప్పింది. బహుశా, పాదచారుల హక్కులకు సంబంధించి ఓ భారతీయ కోర్టు ఇలా నిర్ద్వద్వంగా పేర్కొన్న తీర్పు ఇదే.దీన్ని కోర్టు నుంచి సకాలంలో వచ్చిన ఆదేశంగా భావించాలి. ప్రభుత్వాల విధానాలన్నీ పట్టణాలు, నగరాల్లో మౌలిక వసతుల అభివృద్ధి చుట్టూ తిరుగుతున్నాయి. వాటి దృష్టంతా హైవేలు, ఫ్లైవోవర్లు, సబ్‌వేల వంటివాటిపైనే ఉంది. మోటారు వాహనాల్లో వెళ్ళేందుకు వీలైన మౌలిక వసతిని కల్పించడమే అభివృద్ధికి చిహ్నంగా చిత్రిస్తున్నారు. భారతీయ నగరాల్లో ఇపుడున్న కాలి బాటలు హాయిగా నడిచేందుకు అనుకూలమైనవిగా లేవు, సురక్షితమైనవి కావు. అసలు వాటి డిజైనే సరిగ్గా లేదు. వివిధ ప్రభుత్వ సంస్థలు, పౌర సమాజ సంఘాలు దేశంలోని పెక్కు పట్టణాలు, నగరాల్లో నిర్వహించిన సర్వేలలో తేలిన అంశమిది. కాలిబాటల దయనీయ స్థితికి ప్రభుత్వ విధానాలనే తప్పు పట్టాలి. ‘మన నగరాలు, అన్ని ప్రణాళికల్లో ప్రజలనే కేంద్ర బిందువుగా చేసుకుంటున్నాం’ అంటూ 2006లో చేపట్టిన జాతీయ పట్టణ రవాణా విధానం గొప్పగా చెప్పుకొంది. ఆచరణలో తీసుకుంటున్న చర్యలు, ప్రణాళికలు దానికి విరుద్ధంగా ఉంటున్నాయి. కార్లు, స్కూటర్లు వంటివాటికి రోడ్డులో ఎక్కువ చోటు కేటాయించాలనే డిమాండ్‌ను తీర్చడంపైనే విధానాల దృష్టి కొనసాగుతోంది. రోడ్డంతా వాహనాలకేనా?నిర్దిష్ట విధానాలంటూ లేకపోవడం వల్ల కాలిబాటలను ప్రత్యే కించి పట్టించుకునే ఏజెన్సీలు గానీ, కాలిబాటల వసతులకు బడ్జెట్ కేటాయింపులుగానీ ఉండడం లేదు. రోడ్లను నిర్మించే రోడ్లు, వంతెనల శాఖ వంటి ప్రభుత్వ ఏజెన్సీలు కాలిబాటలను నిర్మించి, నిర్వహించే బాధ్యత నగర పాలక సంస్థలదేనని భావిస్తున్నాయి. రోడ్ల శాఖే వాటిని పట్టించుకోవాలని స్థానిక పాలనా సంస్థలు భావిస్తున్నాయి. పట్టణాలు, నగరాల్లో రవాణాలో బహుళ సంస్థల భాగ స్వామ్యం ఉంటోంది. అవి ఒకదానినొకటి నిందించుకుంటూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలతో పనిచేస్తున్నాయి. దీర్ఘకాలిక నగర విస్తృత ప్రణాళికలు పెట్టుబడులు భారీగా అవసరమైన ప్రణాళికలను సూచిస్తూ, కాలినడక అవసరాలను తరచు గాలికొదిలేస్తున్నాయి. ఒకవేళ, కేటాయింపులు జరిగినా ఆ నిధులను సరిగ్గా డిజైన్ చేయని, ఆకర్షణీయంగా మాత్రం కనిపించే ఓవర్‌హెడ్ క్రాసింగ్ లేదా ఫుట్–ఓవర్ బ్రిడ్జీల నిర్మాణానికి వెచ్చిస్తున్నారు. ఎక్కడైనా పాదచారుల మౌలికవసతిని అభివృద్ధి చేసినా అది కూడా కార్లు లేదా టూవీలర్ల వాడకందారులను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసినదే అయివుంటోంది. మోటారు వాహనాలు వెళ్ళే దారిలోనే లాంగ్ రూట్ తీసుకోవాల్సిన, రోడ్ల పొడుగూతా ఆనుకునే కాలిబాటలు ఉండాల్సిన పని లేదు. ఒకదానినొకటి ఆనుకుని ఉన్న రెండు ప్రాంతాలను కలిపేందుకు వాకర్లు వాహనాలు వెళ్ళే రూటునే అనుస రించవలసిన పని లేకుండా చిన్న కాలిబాటలకు డిజైన్ చేయవచ్చు. వాతావరణ మార్పులను ఎదుర్కొనే సాధనంసుప్రీంకోర్టు నిర్వచించిన విధంగా కాలినడక పౌరుల ప్రాథ మిక హక్కు మాత్రమే కాదు. అది మనిషికి, భూగోళానికి ఉభయ తారకమైనది. మధుమేహం, హైపర్ టెన్షన్, గుండె జబ్బులు, గుండె పోట్లు, క్యాన్సర్ల వంటివి ఒకరినుంచి ఒకరికి సంక్రమించేవికావు. ఈ రుగ్మతలకు దారితీసే ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్లలో శారీరక శ్రమ లేకపోవడం, ఒకేచోట కూర్చుని పనిచేసే జీవనశైలి వంటివి కూడా ఒకటని గుర్తించారు. సైకిల్ తొక్కడంతోపాటు, 20 నుంచి 30 నిమి షాల సేపు వేగంగా నడవడం శరీరాన్ని చురుకుగా ఉంచే ఉత్తమ మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఎట్టి పరిస్థితు ల్లోనూ 2030 కల్లా సాధించి తీరాలని పెట్టుకున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో చాలా వాటిని సాధించేందుకు కూడా నడకను ప్రోత్స హించే విధానాలు తోడ్పడతాయి. కాలిబాటలను మెరుగుపరచి, నడక వసతులను కల్పిస్తే ప్రజా రోగ్యం మెరుగుపడడమే కాకుండా, పౌరుల ధనం ఆదా అవుతుంది. గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలు తగ్గించేందుకు ఇదొక తక్కువ ఖర్చుతో కూడిన మార్గంగా ఉపయోగపడుతుంది. నడకకు తగినంత సురక్షిత సదుపాయాన్ని కల్పిస్తే ప్రజా రవాణా సదుపాయాన్ని వినియోగించుకునే ఎవరైనా సరే రోజులో కనీసం నాలుగు సార్ల యినా నడవవలసి వస్తుంది. చెన్నైలో ఫుట్‌పాత్‌లను మెరుగు పరచడం వల్ల ఏటా 4,200 టన్నుల కార్బన్ డయాక్సైడ్, దానితో సమానమైన 12,000 టన్నుల గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను నివారించగలిగినట్లు ఒక అధ్యయనంలో తేలింది. సుమారుగా 1,000 నుంచి 2,900 కార్లు ఒక ఏడాదిపాటు రోడ్డుపైకి రాకుండా ఉంటే ఎంత సత్ఫలితం ఒనగూడుతుందో దానివల్ల కూడా అంతే సమానమైన ప్రయోజనం చేకూరినట్లు వెల్లడైంది. మూడు జోన్లుఫుట్పాత్ల గురించి చర్చ వచ్చినప్పుడల్లా, వాటిని ఆక్రమించు కుని ఉండే చిన్న తరహా విక్రేతల సమస్య కూడా అనివార్యంగా తొంగిచూస్తుంది. ప్రభుత్వంతోపాటు, సుప్రీంకోర్టు కూడా గతంలో ఈ సమస్యపై దృష్టి సారించకపోలేదు. సక్రమంగా నియంత్రిస్తే, పాదచారులతోపాటు చిన్న వ్యాపారులు కూడా పుట్‌పాత్‌లను వాడు కునే వీలుందని కోర్టు గతంలో వ్యాఖ్యానించింది. ఈ విక్రేతలు కూరగాయలు, పండ్లు, దైనందిన జీవితానికి అవసరమైన చిన్నచితక వస్తువులను అందుబాటులో ఉంచుతారు. పాదచారులు పనిమీద బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు వాటిని కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. పట్టణ వీధి వ్యాపారుల జాతీయ విధానం– 2004, 2009 మూడు జోన్ల సృష్టిని ప్రతిపాదించింది. ఆంక్షలు లేకుండా విక్రయాలు జరుపుకునే ప్రదేశాలు, కొన్ని ఆంక్షలకు పరిమితమైన విక్రయ ప్రదేశాలు, విక్రయాలకు అవకాశం లేని ప్రదేశాలు. వాహనాల రద్దీ, డిమాండ్ తీరుతెన్నులు వంటి అంశాలను ఆయా జోన్ల సృష్టిలో పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. చిన్నచితక విక్రేతలే కాకుండా, కొందరు దుకాణదారులు కూడా తమ దుకాణాలను పుట్‌పాత్ పైదాకా విస్తరించడం సాధార ణంగా కనిపించే దృశ్యం. రెసిడెన్షియల్ కాలనీలలో అయితే, గృహ యజమానులు తమ వాహనాలను పార్క్ చేసుకునేందుకు ఫుట్ పాత్లను యథేచ్ఛగా వాడుకోవడం కనిపిస్తుంది. కాలిబాటలకు సంబంధించి ఇంతవరకు ఎటువంటి విధానాలు, కార్యక్రమాలున్నా వాటినన్నింటిని సమీక్షించుకునేందుకూ, ఉన్న లోటుపాట్లను చక్కదిద్దుకునేందుకూ, రోడ్లను సముచితమైన రీతిలో వాడుకునేందుకు భరోసా కల్పించేందుకూ సుప్రీంకోర్టు తాజా రూలింగ్ ఒక అవకాశం కల్పిస్తోంది. భారతీయ పట్టణాలు, నగరాలు, జాతీయ హైవేల పొడవునా ఉన్న గ్రామాల్లో కూడా నడకకు, సైక్లింగ్‌కు వసతులు కల్పించి, నిర్వహించడానికి అగ్ర ప్రాధాన్యం ఇచ్చి తీరాలి. ఇది ప్రజారక్షణ, ఆరోగ్యం, వాతావరణం, సమానతకు సంబంధించిన అంశమని మరచిపోకూడదు. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
అనుచితాలు కాదు: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఉచితమంటే ఏమిటి? దేన్ని ఉచితంగా పరిగణించాలి’’ అనే కీలకమైన మౌలిక ప్రశ్నలను సర్వోన్నత న్యాయస్థానం లేవనెత్తింది. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, తాగునీటి సదుపాయం తదితరాలను ఉచితాలుగా భావించాలా, లేక పౌరుల ప్రాథమిక హక్కుగానా అన్నది లోతుగా ఆలోచించాల్సిన అంశమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ వంటి పథకాల ద్వారా దేశ పౌరులకు అందుతున్న ఎనలేని ప్రయోజనాలను ప్రస్తావించారు. తద్వారా గ్రామీణ భారతంలో అపారంగా ఆస్తుల సృష్టి కూడా జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో పార్టీల ఉచిత హామీల అంశాన్ని సమగ్రంగా తేల్చడానికి ఓ నిపుణుల కమిటీ వేసే యోచన ఉందని మరోసారి చెప్పారు. రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలను నియత్రించేలా కేంద్రాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ బీజేపీ నేత, న్యాయవాది అశ్వనీకుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటర్లకు వాగ్దానాలు చేయకుండా రాజకీయ పార్టీలను నిరోధించలేమని సూచనప్రాయంగా పేర్కొన్నారు. ‘‘వాగ్దానాలు చేయకుండా దేశంలోని రాజకీయ పార్టీలను నిరోధించలేమని సూచిస్తున్నాం. ఎందుకంటే సమాజంలోని భిన్న వర్గాల్లో ఆదాయం, హోదా, సదుపాయాలు, అవకాశాలపరంగా అసమానతలను రూపుమాపాలని రాజ్యాంగమే ప్రభుత్వాలకు నిర్దేశిస్తోంది. కాబట్టి గెలిచి అధికారంలోకి వస్తే ఈ నిర్దేశాన్ని సాకారం చేసేందుకు ఉచిత హామీలివ్వకుండా పార్టీలను గానీ, వ్యక్తులను గానీ నిరోధించలేం. కాకపోతే ఏది నిజమైన హామీ నిర్వచనంలోకి వస్తుందన్నదే అసలు ప్రశ్న. అలాగే అసలు ఉచితమంటే ఏమిటో స్పష్టంగా నిర్వచించాల్సిన అవసరముంది. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, తాగునీటి సదుపాయం, ఎలక్ట్రానిక్ పరికరాలు వంటివాటిని ఉచితంగా పొందవచ్చా?’’ అంటూ ఆయన కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ‘‘ప్రజలు గౌరవంగా జీవించడానికి అవసరమైన పథకాలు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో గెలుపును కేవలం ఉచిత వాగ్దానాలే నిర్దేశించడం లేదు. కొన్ని పార్టీలు ఎన్ని వాగ్దానాలు చేసినా ఎన్నికల్లో గెలవడం లేదుగా!’’ అని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అందరి అభిప్రాయాలూ తెలుసుకున్న తర్వాతే ఉచితాల మీద ఓ స్పష్టమైన నిర్ణయానికి రాగలమని సీజేఐ స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఆగస్టు 22కు వాయిదా వేశారు. అన్నింటిపైనా చర్చ: విపక్షాలు పిటిషన్‌పై కాంగ్రెస్, ఆప్, డీఎంకే తదితర విపక్ష పార్టీలు భిన్నమైన వ్యాఖ్యలు చేశాయి. ఉచితాలు, దేశ ఆర్థిక పరిస్థితుల మధ్య సంబంధంపై చర్చ జరగాలంటే రాజకీయ నేతలు, చట్టసభ సభ్యులు ఏమేం ప్రయోజనం పొందుతున్నారో కూడా చర్చ జరగాలని ఆప్ తన ఇంటర్వీన్ అప్లికేషన్లో పేర్కొంది. ప్రజలకు రాయితీలివ్వడాన్ని ఉచితంగా పరిగణించరాదని కాంగ్రెస్ నేత జయ ఠాకూర్ తన అప్లికేషన్లో పేర్కొన్నారు. భారత్‌ను ప్రజాస్వామ్య దేశం నుంచి పెట్టబడీదారీ దేశంగా మార్చాలని పిటిషనర్ ప్రయత్నిస్తున్నారని డీఎంకే తరఫు సీనియర్ న్యాయవాది పి.విల్సన్ వాదించారు. సంక్షేమ పథకాలకు తాము వ్యతిరేకం కాదని కేంద్రం పేర్కొంది. అయితే పార్టీల ఉచిత వాగ్దానాలను నియంత్రించాల్సిన అవసరముందని కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మరోసారి సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. ఈ విషయమై చట్టసభల్లో చట్టాలు రూపొందేదాకా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవచ్చని కూడా మరోసారి సూచించింది. పదవీ విరమణ రోజున ప్రస్తావిస్తా రిజిస్ట్రీ సమస్యలు తదితరాలపై సీజేఐ సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అవలంబిస్తున్న కొన్ని పద్ధతులను నియంత్రించాల్సి ఉందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. బుధవారం విచారణ సందర్భంగా రిజిస్ట్రీతో ఓ కేసు విషయంలో ఎదురైన ఇబ్బందిని న్యాయవాది దుష్యంత్ దవే ప్రస్తావించగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రాత్రి ఎనిమిదింటికి దాకా కేసులకు సంబంధించిన అంశాలు విన్నాం. సమావేశాలు కూడా ఎక్కువయ్యాయి. ఆ తర్వాత ఒక కేసును విచారణ జాబితా నుంచి తొలగిస్తేనే ఈ కేసు జాబితాలో చేరింది. ఇది సరికాదు. రిజిస్ట్రీలో ఇలాంటి పద్ధతులను నియంత్రించాల్సించే’’ అన్నారు. ‘‘నా దృష్టికి చాలా సమస్యలు వచ్చాయి. వాటన్నింటినీ నా పదవీ విరమణ సందర్భంగా వీడ్కోలు ప్రసంగంలో చెబుతా’ అని పేర్కొన్నారు. జస్టిస్ రమణ 26న పదవీ విరమణ చేయనుండటం తెలిసిందే. -
గ్రామస్తులను వేధించొద్దు!
- వేములఘాట్, పల్లెపహాడ్ గ్రామాల్లో 144 సెక్షన్‌పై హైకోర్టు - ఆ సెక్షన్ పరిధిని విస్తరించడం ప్రజల హక్కుల్లో జోక్యం చేసుకోవడమే - పరిధి దాటి నిషేధాజ్ఞలు విధించారనేందుకు ఆధారాలున్నాయి - ప్రజలు స్వేచ్ఛగా తిరగొచ్చు.. శాంతియుతంగా సమావేశం కావొచ్చు - రెవెన్యూ, పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లాలోని వేములఘాట్, పల్లెపహాడ్ గ్రామాల్లో 144 సెక్షన్ విధించి.. అక్కడి ప్రజల స్వేచ్ఛాయుత కదలికలను అడ్డుకోవడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఇది వారికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్లో జోక్యం చేసుకోవడమేనని స్పష్టం చేసింది. భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశాల్లో భయానక వాతావరణం కల్పించడం, బెదిరించడం, బలవంతం చేయడం వంటి వాటిని అనుమతించడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. శాంతి భద్రతలు, పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణ మధ్య సమతౌల్యం ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంది. అంతేగానీ 144 సెక్షన్ పరిధిని విస్తరింప చేయడానికి వీల్లేదని... అలా చేస్తే గ్రామస్తులనే గాక, ఆ గ్రామాల్లోకి రావాలనుకునే బయటి వ్యక్తులను కూడా వేధించడమే అవుతుందని స్పష్టం చేసింది. ఈ రెండు గ్రామాల ప్రజలను స్వేచ్ఛగా తిరగనివ్వాలని.. గుర్తింపుకార్డుల కోసం ఒత్తిడి చేయవద్దని ఆదేశించింది. స్వేచ్ఛగా తిరగనివ్వాలి.. వేములఘాట్, పల్లెపహాడ్ గ్రామాల్లో 144 సెక్షన్ విధించడాన్ని సవాలు చేస్తూ వై.సంతోష్‌రెడ్డి, మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దానిపై వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు సోమవారం మధ్యాహ్నం తీర్పు వెలువరించారు. ‘‘144 సెక్షన్‌ను ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో ఆ ఉద్దేశం కోసమే అధికారులు అమలు చేయాలి. ఈ రెండు గ్రామాల ప్రజలు, గ్రామాల్లోకి రావాలనుకునే బయటి వ్యక్తుల హక్కుల్లో జోక్యం చేసుకోరాదు. ఈ గ్రామాల ప్రజలు స్వేచ్ఛాయుతంగా తిరగవచ్చు. వ్యాపారం, ఇతర అవసరాల నిమిత్తం స్వేచ్ఛగా సరుకులను తరలించుకోవచ్చు. వ్యవసాయ కార్యకలాపాల నిమిత్తం పొలాల్లోకి వెళ్లొచ్చు. స్వేచ్ఛాయుతంగా తిరిగేందుకు గుర్తింపు కార్డులు చూపాలని, వారి కదలికలను తెలియచేయాలని ఒత్తిడి చేయరాదు. శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టే ఉద్దేశం లేనివారిని.. మారణాయుధాలు ధరించని వారిని గ్రామాల్లోకి రాకుండా నిషేధం విధించొద్దు. కర్రలు, కత్తులు, ఇతర ప్రమాదకర ఆయుధాలు, లాఠీలు చేపట్టి ముగ్గురు, నలుగురు వ్యక్తులు గుమిగూడటం వంటి వాటిపై నిషేధం విధించడంపై ఎవరికీ అభ్యంతరాలు ఉండవు. ఆ మేరకు 144 సెక్షన్ ఉత్తర్వును సమర్థిస్తున్నా. కానీ గ్రామస్తులు ఆరోపిస్తున్న విధంగా ఈ సెక్షన్‌ను అడ్డం పెట్టుకుని హక్కులను హరించడానికి ఏమాత్రం వీల్లేదు..’’ అని రెవెన్యూ, పోలీసు అధికారులకు న్యాయమూర్తి స్పష్టం చేశారు. అధికారులు పరిధి దాటారు 144 సెక్షన్ పరిధిని మించి నిషేధాజ్ఞలు విధించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని న్యాయమూర్తి స్పష్టం చేశారు. నిషేధాజ్ఞలు సహేతుకంగా ఉండేలా చూసే అధికారం న్యాయస్థానాలకు ఉందన్నారు. ‘‘144 సెక్షన్ విధింపు ఉత్తర్వులో పేర్కొన్న విషయాల్లో వాస్తవం లేదని, శాంతియుతంగా ఊరేగింపు జరుగుతుండగా పోలీసులు లాఠీచార్జి చేశారని గ్రామస్తులు చెబుతున్నారు.. అయితే ఈ వివాదాస్పద అంశం జోలికి వెళ్లి ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అన్నదానిపై కోర్టు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడంలేదు. శాంతియుత వాతావరణం దెబ్బతినే ప్రమాదముందన్న తహసీల్దార్ వాదనలు సరైనవే అనుకున్నా కూడా.. సెక్షన్ 144 విధించే పరిస్థితి తలెత్తలేదు..’’ అని తీర్పులో పేర్కొన్నారు. ఆ గ్రామాలకు అలాంటి చరిత్రేమీ లేదు 144 సెక్షన్ విధించిన వేములఘాట్, పల్లెపహాడ్ గ్రామాలకు తీవ్రవాదుల కార్యకలాపాలు, హింస, మత ఘర్షణలు వంటివి చోటుచేసుకున్న చరిత్ర లేదని న్యాయమూర్తి గుర్తు చేశారు. ఈ గ్రామాలు రక్షణపరంగా, పరిశోధనపరంగా నిషేధం ఉండి.. గ్రామస్తులు, బయట వ్యక్తులు గుర్తింపు కార్డులు చూపే పరిస్థితుల్లో ఉన్నవి కూడా కాదని స్పష్టంచేశారు. అందువల్ల గ్రామస్తుల కదలికల వివరాల కోసం ఒత్తిడి చేయడం, గుర్తింపు కార్డులు చూపాలనడం తన దృష్టిలో వారికి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఏకాంత హక్కు (రైట్ టు ప్రైవసీ)లో జోక్యం చేసుకోవడమేనని న్యాయమూర్తి పేర్కొన్నారు. గ్రామస్తుల కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, వ్యవసాయ, వ్యాపార సంబంధాలున్న వారిని సాధారణ పరిస్థితుల్లో లాగానే ఈ గ్రామాల్లోకి అనుమతించాలని ఆదేశించారు.


