ఇంగ్లీషు మీడియం కొనసాగేనా? | Sakshi Guest Column On English Medium Education To Poor Students In AP | Sakshi
Sakshi News home page

ఇంగ్లీషు మీడియం కొనసాగేనా?

Published Fri, Jun 21 2024 4:25 AM | Last Updated on Fri, Jun 21 2024 1:38 PM

Sakshi Guest Column On English Medium Education To Poor Students In AP

అభిప్రాయం

మొత్తం దేశ చరిత్రనే మార్చే పథకం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీషు విద్య. ఆ విద్యా విధానాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందా, ఆపేస్తుందా అనేది ప్రశ్న. గత ఐదేండ్లుగా ప్రభుత్వ పాఠశాల విద్యారంగంలో వచ్చిన మార్పులు గణనీయమైనవి. ఆ మార్పులను అనిష్టంగానైనా కొత్త ప్రభుత్వం కొనసాగిస్తే రానున్న ఐదేండ్లలో విద్యారంగంలోని మార్పులు పాతుకు పోతాయి. అలాకాకుండా మళ్ళీ పాత పద్ధతిలోకి విద్యావ్యవస్థను నెడితే ప్రజలు ఏం చెయ్యాలనేది చాలా కీలకమైంది. అందుకే స్కూళ్ళలో పిల్లల భవిష్యత్తును కొత్త ప్రభుత్వం వెనక్కి నెట్టకుండా చూడాల్సిన బాధ్యత వైసీపీ రాజకీయ శక్తులతో పాటు, పిల్లల తలిదండ్రుల మీద కూడా ఉంది.

ఎన్నికల సమయంలో చండీగఢ్‌లో జరిగిన రాజ్యాంగ రక్షణ సదస్సుకు నేను వక్తగా వెళ్ళాను. అది ఆఖరి ఘట్టం ఎన్నికల ముందు. చివరి ఘట్టంలో పంజాబు రాష్ట్ర ఎన్నికలు జరిగాయి. ఆ సదస్సు మే 22న జరిగింది. మరుసటి రోజు అక్కడి మేధావులు పంజాబు గ్రామాల్లో నాకోసం సమావేశాలు ఏర్పాటు చేశారు. నేను మూడు గ్రామాల్లో జరిగిన మూడు మీటింగుల్లో పాల్గొని మాట్లాడాను. మీటింగులో ఆడా, మగా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. 

పంజాబులో ప్రభుత్వ పాఠశాల విద్య పంజాబీ భాషలోనే బోధిస్తారు. అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టు ఒక్క సబ్జెక్టు మాత్రం ఇంగ్లీషులో ఉంటుంది. అయితే అక్కడ కూడా ప్రైవేట్‌ స్కూళ్లు ఇంగ్లీషు మీడియంలో నడుస్తాయి. పంజాబీలు ఇతర దేశాలకు ఎక్కువ వలసపోతారు కనుక వారు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఉండాలని డిమాండ్‌ చేస్తున్నారా అని నేను అడిగాను. వాళ్ళు లేదు అన్నారు. 

అప్పుడు నేను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీషు మీడియం గురించీ, అది గ్రామాల్లోని పిల్లల్లో తెస్తున్న మార్పుల గురించీ వివరించాను. ‘మా పిల్లలకు కచ్చితంగా అటువంటి ఇంగ్లీషు మీడియం విద్య కావాలి; వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల ముందు ఈ డిమాండ్‌ పెడతా’మని వాళ్లు తీర్మానించుకున్నారు. 

మొత్తం దేశ చరిత్రనే మార్చే పథకం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీషు విద్య. ఆ విద్యా విధానాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందా, ఆపేస్తుందా అనేది కీలకమైన ప్రశ్న. చంద్రబాబు నాయుడు క్యాబినేట్‌ ప్రమాణ స్వీకారం రోజు వేదిక మీద ఉన్నవారంతా గ్రామీణ పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీషు మీడియం చదువు నేర్చుకోవడాన్ని వ్యతిరేకించినవారే. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి శాసించే అమిత్‌ షా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం చదువుకు బద్ద వ్యతిరేకి. అంతేకాదు, తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు స్కూళ్ళను స్థాపించి ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేసిన నారాయణ మళ్ళీ మంత్రి అయ్యారు. కార్పొరేట్‌ ప్రైవేట్‌ స్కూళ్ళు చంద్రబాబు ప్రైవేటీకరణలో భాగంగా ఎదిగాయి.

ప్రభుత్వ రంగంలో ఇంగ్లీషు మీడియం విద్య ఒక సంక్షేమ పథకం కాదు. ప్రపంచంలోని అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో పాఠశాల విద్య ప్రభుత్వ రంగంలోనే ఉన్నది. కానీ, భారతదేశంలో ప్రైవేట్‌ పాఠశాల విద్య ప్రభుత్వ రంగ విద్యను సర్వనాశనం చేసింది. అటువంటి విద్యావిధానం నుండి గ్రామీణ విద్యార్థులను కాపాడే విద్యావిధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వం దీన్ని రద్దు చేసి మళ్ళీ పాత పద్ధతిలోకి విద్యావ్యవస్థను నెడితే ప్రజలు ఏం చెయ్యాలనేది చాలా కీలకమైంది. కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం, 2024–25 ఎకడమిక్‌ సంవత్సర స్కూళ్ల ప్రారంభం ఏకకాలంలో జరిగాయి. అయితే ఈ సంవత్సరానికి కావలసిన బైలింగ్వల్‌ బుక్స్‌(ఉభయ భాషా పుస్తకాలు), పిల్లలకిచ్చే డ్రెస్సులు, బూట్లు ఈ ప్రభుత్వం సకాలంలో ఇస్తుందా అనేది ప్రశ్న. గత ఐదేండ్లుగా ప్రభుత్వ పాఠశాల విద్యారంగంలో వచ్చిన మార్పులు గణనీయమైనవి. 

ఆ మార్పులను అనిష్టంగానైనా కొత్త ప్రభుత్వం కొనసాగిస్తే రానున్న ఐదేండ్లలో విద్యారంగంలోని మార్పులు పాతుకుపోతాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలలో బీదవారు, అగ్రకులాలలో బీదవారి పిల్లలకు 2029 ఎన్నికల నాటికి ఈ విద్యావ్యవస్థ తమకు ఎటువంటి భవిష్యత్తును ఇవ్వనుందో అర్థమయ్యే దశ వస్తుంది. కానీ ఇప్పుడు స్కూళ్ళలో పిల్లల భవిష్యత్తును కొత్త ప్రభుత్వం వెనక్కి నెట్టకుండా చూడాల్సిన బాధ్యత అటు వైసీపీ రాజకీయ శక్తులతో పాటు, ఇటు పిల్లల తలిదండ్రుల మీద ఉంది. 

ఇప్పటి నుండి గ్రామాల్లో పిల్లల తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియం విద్యా పరిరక్షణ కమిటీలు వేసుకోవలసిన అవసరం ఉంది. గ్రామాల్లో ప్రజలు తమ రాజకీయ అభిప్రాయాలను అధిగమించి విద్యారంగ పరిరక్షణ కోసం కమిటీలు వేసుకుని గ్రామంలోని పిల్లలందరి భవిష్యత్‌ కాపాడవలసిన బాధ్యత ఉంది. గ్రామాల్లో కూడా ధనవంతులున్నారు. వారి పిల్లలను ప్రైవేట్‌ స్కూళ్ళలో విపరీతంగా డబ్బులు ఖర్చుపెట్టి చదివించగలిగేవారూ ఉన్నారు. ఇటువంటివారు, ఉద్యోగులు, పట్టణాల్లోని ధనవంతులు... బీద బక్క పిల్లలందరికి ఇంగ్లీషు వస్తే తమ పిల్లలు వారితో పోటీ పడాల్సి వస్తుందని భావించి ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీషు మీడియంను వ్యతిరేకించే అవకాశం ఉంది.

జగన్‌ ప్రభుత్వాన్ని ఉద్యోగస్థులు, కొంత మంది ఉపాధ్యాయులతో పాటు ఇతర ధనవంతులు వ్యతిరేకించడంలో తమ పిల్లల భవిష్యత్‌ స్వార్థం పనిచేసింది. ఈ స్వార్థం కులాలకు అతీతంగా ఉంటుంది. ప్రతి రిజర్వేషన్‌ కేటగిరిలో డబ్బున్నవారు తమ పిల్లలను ప్రైవేటు ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో చదివించి, ప్రభుత్వ తెలుగు మీడియం పిల్లలు తమ పిల్లలతో పోటీ పడకుండా ఉండాలనే స్వార్థం ఓటు వేసే దగ్గర కూడా పనిచేస్తుంది. ఈ స్వార్థపు వేళ్లను తెంపడం చాలా కష్టం. మార్పు తెచ్చే ప్రభుత్వాలను దింపెయ్యాలనే ఈ ధనిక వర్గం ఓటు వ్యవస్థను తమకు అనుకూలంగా తిప్పుకుంటుంది. 

ప్రపంచీకరణ యుగంలో వర్గం, హోదా, ఆధిక్యత... నాణ్యమైన ఇంగ్లీష్‌ విద్యతో ముడిపడి ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ నిర్మాణాల్లో కూడా ఈ విధంగా ఆలోచించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మార్పు తమ వర్గ శత్రువు అనుకునే శక్తులు వీరు. వీరు గ్రామాల్లో ఉన్నారు, పట్టణాల్లో ఉన్నారు. 

భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా స్కూలు విద్య ఎన్నికల్లో చర్చనీయాంశం కాలేదు. ఈసారి ఆంధ్ర ఎన్నికల్లో అది చర్చనీయాంశం అయింది. బహిరంగ సభల్లో సైతం స్కూలు పిల్లలు ఇంగ్లీషు, తెలుగులో వాగ్దాటితో మాట్లాడటం, అదీ బీద కుటుంబం నుంచి వచ్చిన వారు మాట్లాడటం ఆ యా గ్రామాల్లో, పట్టణాల్లో ధనవంతులు జీర్ణించుకోలేని విషయం. మార్పును అంగీకరించదల్చుకోని విషయం. ఇది వైసీపీ ఓటమికి కొంత దోహదపడి ఉండవచ్చు. ఈ ధోరణిని తిప్పి కొట్టాలంటే ప్రభుత్వ స్కూళ్ళలో చదివే పిల్లల తల్లిదండ్రుల తిరుగుబాటు మాత్రమే పనిచేస్తుంది. 

భారతదేశంలో విద్య మీద గ్రామీణ స్థాయిలో చర్యలు, పోరాటాలు జరగలేదు. కమ్యూనిస్టులు కూడా ఇటువంటి పోరాటాన్ని జరపలేదు. ఈసారి ఆంధ్ర ఎన్నికల్లో కొత్త విద్యావిధానాన్ని ఓడించడానికి కమ్యూనిస్టులు కూడా సహకరించారు. ఆ విధంగా వీరు బీజేపీ భావజాలానికి మద్దతిచ్చారు. అందుకే రానున్న ఐదేండ్లలో సమాన భాష, పురోగామి భావజాల పాఠశాల  విద్య కోసం బలమైన పోరాటం జరగాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ఈ పోరాటానికి నేతృత్వం వహించాల్సి ఉంది.


ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌ 
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement