అభిప్రాయం
ఈ ఏడాది సెప్టెంబర్ మొదట్లో 27 ఏళ్ళ రిసెర్చ్ కుర్రాడొకరు కృత్రిమ మేధ (ఏఐ)ని అభివృద్ధి చేస్తున్న ‘ఆంత్రోపిక్’ నుంచి వైదొలగాడు. దానిపై అతను ఎక్స్ వేదికగా ఏడు భాగాల హెచ్చరికను పోస్ట్ చేశాడు. బడా ఏఐ ల్యాబులు ‘‘తనను తాను మెరుగుపరచుకునే సూపర్ ఇంటెలిజెన్స్‌ను సృష్టించే దిశగా పరుగులు పెడుతున్నాయి. మన జీవితాలతో గారడీ చేస్తున్నాయి’’ అని పేర్కొన్నాడు. ఆ త్రెడ్ 24 గంటల వ్యవధిలోనే 10 కోట్ల వ్యూస్‌ను నమోదు చేసుకుంది. అంతే. ఏఐ విషయంలో మందగమనంతో సాగవలసిందని ఆంత్రోపిక్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ వారం లోపలే ఆదేశించవలసి వచ్చింది. ఓపెన్ ఏఐ, ఎక్స్ ఏఐ సంస్థల అధిపతులు కూడా అదే దారిపడుతున్నట్లు ప్రకటించారు. ఇటువంటి చిప్ కంపెనీల షేర్ల ధరవరలకు చెందిన ప్రధాన సూచి సెప్టెంబర్ 14న ఒకే సెషన్‌లో 5.9% పతనాన్ని చవిచూసింది. ఆ పరిశోధకుడు పోస్ట్ చేసిన దాంతో నేను నూటికి నూరుపాళ్ళు ఏకీభవిస్తున్నాను. కానీ, ఆ వారంలో, వాస్తవికంగా ప్రభావం చూపించినదాన్ని గమనించారా? టెక్నాలజీ మారలేదు. మూడ్ మారింది. మూడ్‌ను కొనవచ్చు, అమ్మవచ్చు. భయం డబ్బును కక్కిస్తుంది, శాంతం ఆ పని చేయలేదు.
ప్రతికూలతకు ఆకర్షణెక్కువ
అప్‌వర్తీ అనే న్యూస్ సైట్‌లో 12,000లకు పైగా పతాక శీర్షికల ప్రయోగాలపై కొందరు పరిశోధకులు అధ్యయనం చేశారు. హెడ్ లైన్‌లోని ప్రతి ప్రతికూల పదం అదనంగా సుమారు 2.3% క్లిక్‌లను పెంచినట్లు వారి పరిశీలనలో తేలింది. విచిత్రంగా, ప్రతి అనుకూల పదం క్లిక్‌లను తగ్గించింది. ఆ ఒక్క సంఖ్యా విశేషం చాలా విషయాన్ని వెల్లడిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ జాతిని అంతమొందించవచ్చని చెప్పినవారు ఆకర్షించారు. దానివల్ల రేడియాలజీ చౌక అవుతుందనీ, కొన్ని ఉద్యోగాల నిర్వహణ కష్టమవుతుందనీ చెప్పిన వ్యక్తిని ఎవరూ పట్టించుకోలేదు. వాస్తవాలు పేర్కొంటున్న దానికన్నా మనం ఎక్కువ భయపడిపోతామని దీన్ని బట్టి తెలుస్తోంది. ‘ఇఫ్ ఎనీ వన్ బిల్డ్స్ ఇట్, ఎవ్రీ వన్ డైస్’ అనే పుస్తకం ఏడాది క్రితం, న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ఫలానా దానివల్ల ప్రమాదం ముంచుకొస్తుందని జోస్యం చెప్పేవారి ప్రసంగాల ఫీజులు, పాడ్ కాస్ట్ టూర్లు పెరగుతాయి. ఫాలోయర్ల సంఖ్య చెప్పనే అక్కరలేదు. ఇందులో ఇమిడివున్న చాలామంది వ్యక్తులు నిష్కపటమైనవాళ్ళే. వ్యవస్థను లొంగదీసుకునేందుకు వారు వేరే అడ్డదారులు తొక్కాల్సిన అవసరం లేదు. ఆందోళనకర విషయాలు కాసులు కురిపిస్తూ, జాగ్రత్తలు సూచించే మాటలు పెడచెవిన బారినపడుతున్నప్పుడు, సహజంగా ఆందోళనకర విషయాలే వెల్లువెత్తుతాయి.
సొమ్ము చేసుకుంటున్న సంస్థలు
సందర్భం లేకుండా చెప్పిన కథనాల నుంచి కూడా కొంత భయం పుట్టుకొస్తూంటుంది. చెడు ప్రవర్తనను రేకెత్తించేందుకు కల్పించిన పరీక్ష లోపల తన మోడల్ ఒకటి, ఒక కల్పిత ఇంజినీర్‌ను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించిందని ఒక ల్యాబ్ గతేడాది వెల్లడించింది. ఒక యంత్రం దాన్ని తయారు చేసినవారిపైనే ఎదురు తిరిగిందన్నట్లుగా దాన్ని గురించిన వార్తలు వచ్చాయి. బ్లాక్ మెయిల్ చేసేందుకు అవకాశం ఉందా అన్న సంగతిని నిగ్గు తేల్చుకునేందుకే ఆ పరీక్షను నిర్వహించారు. కనుక, అది చక్కదిద్దదగిన సమస్యే. విమర్శకుల సంఖ్యను పక్కనపెట్టండి. ఒక కంపెనీ తన ఉత్పత్తి ఏకంగా ఒక నాగరికతనే అంతమొందించవచ్చని చెబుతోందంటే, చరిత్రలోనే తాను అత్యంత ముఖ్యమైన దానిని తయారు చేస్తున్నానని ఇన్వెస్టర్లకు కూడా చాటుతోందన్నమాట. ఇతర సంస్థలు తాము అందుకున్న విజయాన్ని అందుకోకూడదనీ, వాటిని తమ సమస్థాయిని చేరుకోకుండా నిరోధించడానికి కొన్ని పెద్ద సంస్థలు అంతరించిపోవడం గురించిన మాటలను తెరపైకి తెస్తున్నాయనీ గూగుల్ బ్రైన్ సహ స్థాపకుడు ఆండ్రూ ఎన్జీ 2023 నుంచి వాదిస్తూ వస్తున్నారు. తాజా హెచ్చరికల్లో ‘సైన్స్ కన్నా సైన్స్ ఫిక్షన్ ఎక్కువగా ఉంది’ అని ఆండ్రూ ఇటీవల వ్యాఖ్యానించారు.
సందేశానికి తగ్గట్లుగా నిధులు ప్రవహిస్తాయి. ఆంత్రోపిక్ సంస్థ, ఓపెన్ ఏఐ సంస్థకన్నా ఎక్కువగా 2026 మొదటి త్రైమాసికంలో అమెరికాలో ఫెడెరల్ లాబీయింగ్‌పై 1.6 మిలియన్ల డాలర్లను వెచ్చించింది. అమెరికాలో రెండు పెద్ద పొలిటికల్ యాక్షన్ కమిటీ (పీఏసీ) నెట్‌వర్క్‌లున్నాయి. వాటిలో ఒకదానికి ఓపెన్ ఏఐ అధ్యక్షుడు, ఆండర్సన్ హోరోవిట్జ్ స్థాపకులు నిధులు అందిస్తున్నారు. రెండవ దానికి ఆంత్రోపిక్ అండగా ఉంది. మధ్యంతర ఎన్నికలకు ఆ రెండు నెట్‌వర్క్‌లు కలసి సుమారు 175 మిలియన్ల డాలర్లను సమీకరించగలిగాయి. రెగ్యులేషన్ నామమాత్రంగానే ఉండేటట్లు చేస్తామనీ లేదా మరీ ఎక్కువగా ఉండేటట్లు చేస్తామనీ భయపెట్టి ఆ రెండు నెట్ వర్క్‌లు పబ్బం గడుపుకున్నాయి.
నిజమైన సమస్యల సంగతి?
ఏఐ వల్ల హాని లేదని చెప్పడం దీనంతటి అర్థం కాదు. ఏఐ కారణంగా ఆగస్టు నెలలో 1,16,175 లేఆఫ్ లు ప్రకటించారని చాలెంజర్; గ్రే–క్రిస్మస్ సంస్థలు వెల్లడించాయి. ఈ ఏడాది ప్రకటించిన మొత్తం లేఆఫ్‌లలో సుమారు 22% ఆగస్టులోనే సంభవించాయి. అయినా, ప్రపంచ నిరుద్యోగితా రేటు 4.9% గానే ఉంది. అంటే ఏమిటి? కొంత అలజడి ఉందికానీ, ఉద్యోగాలు అసలు లేకపోలేదు. పైకి కనిపించకుండా, కొన్ని సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మెషీన్లే కోడ్ రాసేస్తూండటం వల్ల యువ ఇంజినీర్ల నైపుణ్యం వెలతెలబోతోంది. డీప్ ఫేక్‌లు వచ్చిపడ్డాయి. పవర్ గ్రిడ్‌పై ఒత్తిడి పెరిగింది. ఇవన్నీ సంచలనం కాని, పరిష్కరించదగిన సమస్యలు కావడం వల్ల అంతగా వార్తలకెక్కడం లేదు.
లేనిపోని భయోత్పాతం వల్ల పసలేని చట్టాలు కూడా రూపొందుతాయి. పదహారేళ్ళ లోపు బాలలకు ఆస్ట్రేలియా సోషల్ మీడియాను నిషేధించింది. నిషేధం తెచ్చిన మూడు నెలల తర్వాత కూడా, 10 నుంచి 15 ఏళ్ళ వయసు బాలల్లో 80% మందికి పైగా సోషల్ మీడియాను అంటిపెట్టుకునే ఉన్నారు. అమెరికన్లలో 52% మంది ఏఐ పట్ల కుతూహలంతోకన్నా ఆందోళనతో ఉన్నారనీ, 9% మంది మాత్రమే ఎక్కువ ఉత్సుకతతో ఉన్నారనీ ప్యూ సంస్థ ఇటీవల ఒక సర్వేలో కనుగొంది. అందులో కొంత ఆందోళన తెచ్చిపెట్టుకున్నది కాగా, కొంత వారికి అంటగట్టినది. అందరినీ మౌనంగా ఉండమని చెప్పడం దీని ఉద్దేశం కాదు. ఏఐపై గగ్గోలు పెడుతున్నవారినీ, దాని అవసరాన్ని కొనియాడుతున్నవారినీ ఒక చిన్న ప్రశ్న అడగవలసి ఉంది: మీరు చెబుతున్న మాటలను మేము నమ్మడం వల్ల మీకు కలుగుతున్న లాభం ఏమిటి? వాళ్లు చెబుతున్నదాన్ని ప్రచారంతోకాక, ఆధారాలను సరిచూసుకుని ఒక నిర్ణయానికి రండి.
డా‘‘ మేడా పరమేశ్వర రెడ్డి
వ్యాసకర్త రిటైర్డ్ ఇండియన్ అమెరికన్ శాస్త్రవేత్త;
రెడ్డి సెంటర్ ఫర్ క్రిటికల్ అండ్ ఇంటిగ్రేటెడ్ థింకింగ్ డైరెక్టర్


