
కొడుకైన కుమారస్వామిని శంకరుడు ముద్దాడడాన్ని చూసిన బాణాసురుడు, కుమారస్వామి అదృష్టానికి ఈర్ష్యపడ్డాడు. తండ్రి లేని కారణం చేత తనకు ఆ అదృష్టం కలగకపోవడాన్ని గురించి బాధపడి, శంకరుడు తనకు తండ్రి వంటివాడు కాబట్టి, శంకరుడి నుండి ఆ ప్రేమను పొందాలని నిర్ణయించుకున్నాడు. తలచినదే తడవుగా కఠోరమైన తపస్సు చేసి శివుని నుండి, తాను శివపార్వ తులకు పుత్రుడు కావాలనే వరం కోరాడు. శంకరుడు సరే అన్నాడు. అగ్నిదేవుడు పాలించే శోణిత నగరానికి పక్కనే ఒక నగరాన్నీ, నెమలి టెక్కెమునూ బాణుడికి ఇచ్చాడు. ముల్లోకాలను, అష్టదిక్కులలోని రాజులను అవలీలగా జయించి, గణాధిపత్యాన్ని కూడా సాధించి ప్రమథులకు నాయకుడయ్యాడు బాణుడు. కొంతకాలం యుద్ధాలు లేక పోవడంతో ఏమీ తోచక యుద్ధానికి అవకాశాన్ని కల్పించమని శంకరుడినే కోరాడు.
మనసులో నవ్వుకున్న శంక రుడు, ‘నీ రథానికి ఉన్న నెమలి టెక్కెము విరిగి నేలపై పడడాన్ని నీవు నీ కన్నులతో ఎప్పుడు చూస్తావో అప్పుడు యుద్ధం జరుగుతుంది’ అన్నాడు. ఆనందంతో మంత్రి కుంభాండునికి జరిగినదంతా చెప్పాడు బాణుడు. అలా చెబుతూండగానే బాణుడి రథపు నెమలి టెక్కెము సగానికి విరిగి పడింది. ఆనందంలో తేలిపోతున్న బాణుడి విపరీతపు మనఃస్థితిని నాచన సోమన ‘ఉత్తర హరివంశము’, పంచమాశ్వాసంలో, ఇలా వర్ణించాడు:
విఱిగిన బొంగె నద్దనుజ వీరవరుండు మనంబు లోపలన్/వెఱపును ఖేదము న్వెఱగు విస్మయముం బొడ
మంగ మంత్రియి/ట్లెఱిగి యెఱింగి మారి దనయింటికి రమ్మను వాని కేమియుం/గఱపిన నొప్పునే, విధి వికారము దప్పునె, యిట్లు ద్రిప్పునే.
తెలిసి తెలిసి మృత్యువును తన ఇంటికి రమ్మని పిలిచేవాడికి ఏం చెప్పి మనసు మళ్ళించ గలం? దైవవశంగా జరగవలసిన కీడు జరగకుండా ఆగదు కదా! పరిస్థితులు ఒక్కసారిగా ఇలా మారిపోయాయి కదా! – అని బాణుడి మూర్ఖత్వాన్ని తలుచుకుని మంత్రి కుంభాండుడు బాధపడడం ఈ పద్యం భావం.
చదవండి: తల్లి కాబోతున్న సింగర్, మెటర్నిటీ ఫోటో షూట్ పిక్స్ వైరల్
– భట్టు వెంకటరావు