డ్యాన్స్‌ ఫ్లోర్‌ నుంచి మ్యూజిక్‌ మైక్‌ వరకు.. | Yashraj Mehra's Journey Is An Inspiring Marathon | Sakshi
Sakshi News home page

Yashraj Mehra: డ్యాన్స్‌ ఫ్లోర్‌ నుంచి మ్యూజిక్‌ మైక్‌ వరకు..

Jun 20 2026 7:56 AM | Updated on Jun 20 2026 2:08 PM

Yashraj Mehra's Journey Is An Inspiring Marathon

డ్యాన్స్‌ ఫ్లోర్‌ నుంచి మ్యూజిక్‌ మైక్‌ వరకు.. ఇన్‌స్టాగ్రామ్‌ రీమిక్స్‌ల నుంచి గ్లోబల్‌ గ్రామీ స్టేజ్‌ వరకు.. యశ్‌రాజ్‌ మెహ్రా ప్రస్థానం ఒక స్ఫూర్తిదాయక మారథాన్‌. హిప్‌–హాప్‌ అంటే కేవలం పాపులారిటీ మాత్రమే కాదు, గుండె లోతుల్లోంచి వచ్చే నిజాయితీ గల కథా కథనం అని నిరూపిస్తున్నాడు ముంబైకి చెందిన ఈ యంగ్‌ మ్యుజీషియన్‌. కష్టాన్నే నమ్ముకుని, కళనే శ్వాసగా మార్చుకున్న ఈ యువకుడు నేడు గ్లోబల్‌ మ్యూజిక్‌ వేదికపై భారతీయ జెండాను ఎగురవేసి దేశం గర్వించేలా చేశాడు.

భారతీయ హిప్‌–హాప్‌ రంగానికి గ్లోబల్‌ గుర్తింపు తెస్తూ, యువ ర్యాపర్‌ యశ్‌రాజ్‌ మెహ్రా (Yashraj Mehra) ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డు రేసులో నిలిచాడు. ‘సౌండ్స్‌ ఆఫ్‌ కుంభ’ ఆల్బమ్‌లో ఫీచర్‌ చేసిన ఆర్టిస్ట్‌గా ఆయన దక్కించుకున్న ఈ నామినేషన్, ప్రాంతీయ స్వరాలకు అంతర్జాతీయ వేదికపై దక్కిన అరుదైన గౌరవంగా నిలిచింది.

డ్యాన్స్‌ ఫ్లోర్‌ నుంచి మ్యూజిక్‌ మైక్‌ వరకు..
యశ్‌రాజ్‌ మెహ్రాకు తన బాల్యం నుంచే మ్యూజిక్‌పై ఆసక్తి ఉండేది. పాఠశాలలో తన స్నేహితులంతా క్రీడలలో పాల్గొంటూ, స్నేహితులతో గడుపుతుంటే, యశ్‌ మాత్రం తరగతి గదిలో ఓ మూలన కూర్చొని ర్యాప్‌ పాటలు, కవిత్వం రాసేవాడు. అలా బాల్యం నుంచే సంగీతం, పాటలపై సహజంగానే ఉన్న ఆసక్తి యశ్‌లో క్రమంగా కొనసాగుతూ వచ్చింది. ఇక తను స్థిరపడిన హిప్‌–హాప్‌ ప్రపంచం యశ్‌కు మొదట డ్యాన్స్‌ రూపంలో పరిచయమైంది. టీనేజర్‌గా ఉన్నప్పుడు మ్యూజిక్‌ బిట్స్‌కు డ్యాన్స్‌ చేయడం ్రపారంభించిన యశ్‌రాజ్, ఆ తర్వాత ఆ సంగీతం వెనుక ఉన్న పదాల లోతైన అర్థాన్ని, వాటిలోని కథా శైలిని గమనించాడు. అదే అతడిని ర్యాప్‌ వైపు నడిపించింది. మొదట్లో ఇన్‌స్టాగ్రామ్‌లో తన సొంత ర్యాప్‌ లైన్స్‌ను అప్‌లోడ్‌ చేస్తూ, పాపులర్‌ రీమిక్స్‌లతో ప్రయోగాలు చేస్తూ నెమ్మదిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తను ఎంచుకున్న రంగంపై కుటుంబం నుంచి కొంత ప్రతిఘటన ఎదురైనప్పటికీ, తల్లి ఇచ్చిన సంపూర్ణ మద్దతుతో తన సృజనాత్మక ప్రయాణాన్ని కొనసాగించాడు.

యువతని ఆకట్టుకున్న యష్‌
2020లో విడుదలైన ‘ఆజాద్‌ హూ మే’ అనే ఎక్స్‌టెండెడ్‌ ప్లేతో యశ్‌రాజ్‌ అధికారికంగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత విడుదలైన హౌస్లా, ధుంధాలా, గబ్బర్‌ వంటి పాటలు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ప్రస్థానంలో రిషి రిచ్, జేడెన్, అర్మాన్‌ మాలిక్, బాద్‌షా, రఫ్తార్‌ వంటి టాప్‌ ఆర్టిస్టులతో ఆయన స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నాడు. అలాగే బాలీవుడ్‌ చిత్రాలైన ఖో గయే హమ్‌ కహా, మర్డర్‌ ముబారక్‌ సినిమాల్లోనూ తన గాత్రాన్ని అందించాడు. డివైన్, నేజీ, నాస్, జె కోల్, డ్రేక్‌ వంటి అంతర్జాతీయ కళాకారులను ఆదర్శంగా తీసుకునే యశ్‌రాజ్‌.. భారతీయ హిప్‌–హాప్‌ భవిష్యత్తు ప్రాంతీయ భాషలలోనే దాగి ఉందని బలంగా నమ్ముతాడు.

గ్రామీ నామినేషన్‌తో రికార్డు
యశ్‌రాజ్‌ కెరీర్‌లోనే గతేడాది ఊహించని అతిపెద్ద మలుపు. ‘సౌండ్స్‌ ఆఫ్‌ కుంభ’ ఆల్బమ్‌లో ఫీచర్‌ చేసిన ఆర్టిస్ట్‌గా యశ్‌రాజ్‌ ప్రపంచంలోనే అత్యున్నత సంగీత పురస్కారమైన ‘గ్రామీ’ నామినేషన్‌ ను దక్కించుకుని సరికొత్త రికార్డు సృష్టించాడు.

జీవితం ఒక సుదీర్ఘ ప్రయాణం!
జీవితాన్ని ఒక ‘స్ప్రింట్‌’ లాగా కాకుండా, ‘మారథాన్‌’ లాగా భావించే యశ్‌రాజ్‌.. నిరంతరం నేర్చుకుంటూ, ఒదిగి ఉండటమే తన విజయ రహస్యమని చెబుతాడు. తల్లిదండ్రులకు ఆర్థిక భద్రత కల్పించి, వారిని గర్వపడేలా చేయడమే తన అంతిమ లక్ష్యమని, అన్ని సమయాల్లో తన వెన్నంటే ఉండే తన టీమ్‌కు ఒక స్థిరమైన మార్గాన్ని చూపించడం తన ధ్యేయమని ఈ యువ సంచలనం స్పష్టం చేశాడు.

పాఠశాల గదిలో ఒంటరిగా కూర్చుని రాసుకున్న ర్యాప్‌ అక్షరాలు.. నేడు ప్రపంచ అత్యున్నత సంగీత వేదిక ‘గ్రామీ’ నామినేషన్‌ వరకు చేరతాయని యశ్‌రాజ్‌ కూడా ఊహించి ఉండడు. ఆటంకాలు ఎన్ని ఎదురైనా పట్టువదలకుండా యశ్‌రాజ్‌ మెహ్రా సాధించిన ఈ అంతర్జాతీయ విజయం, భారతీయ సంగీత ప్రపంచంలో ఒక సరికొత్త సంచలనం.

'ప్రజలు నా సంగీతాన్ని ఇష్టపడటం, అభినందించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నేను ఎంచుకున్న మార్గం కేవలం నా భ్రమ కాదని, నిజమని ఆ క్షణంలో నమ్మాను. అపుడే సంగీతం కోసం నా పూర్తి సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకున్నాను. మనం నిజంగా నిజాయితీగా ఏదైనా రాస్తే, అది అత్యంత ప్రజాదరణ పొందిన సంగీత శైలి కాకపోయినా, అది ప్రతిధ్వనిస్తుందని నా సంగీత ప్రయాణంలో నేను గ్రహించాను.' – యశ్‌రాజ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement