యంగ్‌ ఇండియా! ఒక్క బీట్‌ మిస్‌ అయినా.. బీ(ట్‌) కేర్‌ఫుల్‌ | World Heart Day 2025 Heart disease in youth and causes | Sakshi
Sakshi News home page

యంగ్‌ ఇండియా! ఒక్క బీట్‌ మిస్‌ అయినా.. బీ(ట్‌) కేర్‌ఫుల్‌

Sep 28 2025 2:24 PM | Updated on Sep 28 2025 2:30 PM

World Heart Day 2025 Heart disease in youth and causes

ప్రపంచవ్యాప్తంగా గుండెజబ్బులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. అందునా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ తన విశృంఖల ప్రతాపం చూపాక గుండెజబ్బుల కేసులు మరింత ఎక్కువయ్యాయి.  అందుకే ప్రతి ఏడాదీ సెప్టెంబరు 29న నిర్వహించే వరల్డ్‌ హార్ట్‌ డే తాలూకు థీమ్‌ ఏమిటంటే... ‘‘ఒక్క స్పందననూ మిస్‌ కావద్దు’’ (డోంట్‌ మిస్‌ ఏ బీట్‌). దీని అర్థం ఏమిటంటే... ఒక్క గుండె కూడా తన స్పందనలను కోల్పోయే పరిస్థితి రాకూడదనే. గతంలో కనీసం 50, 40లలో కనిపించే ఈ గుండెజబ్బులు ఇప్పుడు ఎందుకిలా యుక్త వయసు లోనే వచ్చేస్తున్నాయో చెప్పే కారణాలూ, వాటిని నివారిస్తూ మన యువతను గుండెజబ్బుల నుంచి రక్షించుకునేందుకు తగిన అవగాహనను కల్పించేందుకే ఈ కథనం

.గుండెజబ్బుల తీవ్రతనూ, విస్తృతినీ తెలిపే కొన్ని గణాంకాలను చూద్దాం. ఢీల్లీ, ముంబై, హైదరాబాద్‌లలోని  కొన్ని పెద్ద హాస్పిటల్స్‌ తాలూకు ఎమర్జెన్సీ కేసులను పరిశీలిస్తే సగానికిపైగా కేసులు... అంటే 50% కేసుల్లో బాధితులు కేవలం 40 ఏళ్లలోపు వాళ్లే. మానసిక ఒత్తిడి, ఎటూ కదలకుండా (శారీరక శ్రమ లేకుండా) ఉండే వృత్తులూ పెరగడంతో గుండె జబ్బులతో బాధపడే యువత కూడా పెరుగుతోంది. 

అందుకే ఇటీవల కార్డియాలజికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా సంస్థ 45 ఏళ్ల లోపే అక్యూట్‌ కరోనరీ సిండ్రోమ్‌తో బాధపడేవారిపై పరిశోధనల కోసం ఓ అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇటీవలి పరిశీలనల ప్రకారం ప్రతి ఐదు గుండె΄ోటు కేసులను పరిశీలిస్తే అందులో ఒకరు తప్పనిసరిగా 40 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. గుండెజబ్బుల పరంగా ప్రపంచవ్యాప్తంగా 20 – 30 ఏళ్ల యువతలో ఏడాదికి 2% పెరుగుదల ఉండగా... మన దేశంలో సైతం గుండెజబ్బులకు లోనైన వాళ్లలో 40 ఏళ్ల లోపు వారు కనీసం 25% వరకు ఉండటం మరింతగా బెంబేలెత్తిస్తున్న అంశం. హైబీపీ, హైకొలెస్ట్రాల్‌ వంటివి యువతలో పెరుగుతుండటమే దీనికి కారణం. దాంతో క్రమంగా, నిశ్శబ్దంగా  చాపకింద నీరులా గుండెజబ్బుల కేసులు భారత్‌లోనూ పెరుగుతున్నాయి.

లక్షణాలు... సాధారణంగా చాలామందిలో ఛాతీనొప్పితో గుండె పోటు కనిపిస్తుంది. ఈ లక్షణం కనిపించే వారు 97.3 శాతం మంది, చెమటలు పట్టడం 11 శాతం మందిలో, వాంతులు లేదా వికారం 8.2 శాతం కేసుల్లో, శ్వాస ఆడకపోవడం 6.8 శాతం మందిలో కనిపిస్తాయి. ఈ వయసులో చాలా మందిలో వచ్చే గుండెపోటుకు కారణమైన నొప్పిని గ్యాస్, అజీర్ణం, అసిడిటీ కారణంగా భావిస్తుంటారు. ఈ అంశం కూడా చికిత్స ప్రారంభించడాన్ని ఆలస్యం చేస్తోంది.

గుండె జబ్బుల పెరుగుదలకు కారణాలు...

వయసు పెరుగుతుండటం: ఇది నివారించలేని అంశం. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ మృదువుగా ఉండాల్సిన రక్తనాళాలు గట్టిబారుతుంటాయి. దీన్నే అధెరో స్కి›్లరోసిస్‌ అంటారు. గతంలో సాధారణంగా 40 ఏళ్లకు పైబడ్డాక ఈ పరిణామం సంభవిస్తుండేది. ఇప్పుడు ఈ వయసు కంటే ముందే.. అంటే 20 నుంచి 30 ఏళ్లలోపే ఇలా రక్తనాళాలు గట్టిబారడం కనిపిస్తోంది.

కొందరిలో కొలెస్ట్రాల్‌ నిల్వలు చాలా నెమ్మదిగా రక్తనాళాల్లోకి చేరుతుంటాయి. కానీ కొందరిలో చాలా వేగంగా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇలా పేరుకునే కొవ్వును ‘ప్లాక్‌’గా వ్యవహరి స్తుంటారు. ఈ ప్లాక్‌ రక్తనాళాల్లోకి ఎక్కువగా చేరడం వల్ల ధమనులు/రక్తనాళాలు సన్నబడి, గుండె కండరాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. ఈ ప్లాక్‌ ఎక్కువగా చీలిపోయి క్లాట్స్‌ (అడ్డంకులు) గా మారి ఆకస్మికంగా గుండెకు రక్తసరఫరా తగ్గవచ్చు. ఫలితంగా గుండెపోటు రావచ్చు.

ఆహారపు అలవాట్లు: హైలీ ప్రాసెస్‌డ్‌ ఫుడ్‌ తీసుకోవడం వంటి మారుతున్న ఆహారపు అలవాట్లు, ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు చిన్న వయసులోనే గుండెజబ్బులు / గుండెపోటుకు దారితీసే ముప్పును పెంచుతున్నాయి. మన దేశంలో దిగువ, మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా ఉండే దేశాల్లో పెరుగుతున్న పట్టణీకరణ / నగరీకరణ కారణంగా అన్ని పోషకాలు ఉండే మంచి ఆహారంతో  పోలిస్తే అధిక క్యాలరీలు ఉండే ఆహారం చవగ్గా దొరుకుతుండటంతో గుండెజబ్బుల ముప్పు పెరుగుతోంది.

తగినంత వ్యాయామం లేకపోవడం : కుదురుగా కూర్చుని చేసే వృత్తులు పెరగడం ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న అంశమే అయినప్పటికీ... మన దేశ యువతలో కూడా వ్యాయామం లేక΄ోవడమూ, పైగా మన దేశ సాంస్కృతిక, సామాజిక నేపథ్యం కారణంగా మహిళలు, అమ్మాయిల్లో వ్యాయామ సంస్కృతి తక్కువగా ఉండటం కూడా గుండెజబ్బులు / గుండెపోటు ముప్పునకు కారణమవుతోంది.

పొగతాగడం : ఇటీవల భారత్, రష్యా, కొన్ని మధ్య ఆసియా దేశాల్లో  పొగాకు వినియోగం బాగా పెరుగుతుండటం అథెరోస్కిర్లోసిస్‌కూ, గుండెపోటుకు మరో ప్రధాన కారణం. 60 ఏళ్ల వ్యక్తులతో పోలిస్తే 40 ఏళ్లలోపు వారికి  పొగ దుష్ప్రభావం మరింత ఎక్కువ. అయితే ఏ వయసులోనైనా  పొగతాగడం అంతే ప్రమాదకరం అని గుర్తించాలి. 

స్థూలకాయం కారణంగా : మన దేశవాసుల్లో ఊబకాయం ఎక్కువగా పొట్ట దగ్గర వస్తుంది. దీన్నే అబ్డామినల్‌ ఒబేసిటీ అంటారు. మన జీవనశైలి (లైఫ్‌ స్టైల్‌) కారణంగా ఇలా స్థూలకాయం రావడం, పొట్ట దగ్గర కొవ్వు పెరగడం కూడా గుండెజబ్బుల ముప్పును మరింత పెరిగేలా చేస్తోంది. 

హైబీపీ, డయాబెటిస్‌ : లైఫ్‌స్టైల్‌ జబ్బులైన హైబీపీ, డయాబెటిస్‌ వంటి అనారోగ్యాల విషయంలో అవగాహన అంతగా లేని మనలాంటి దేశాలలో నియంత్రణలో లేని హైబీపీ, మధుమేహం వంటివి గుండెపోటుకు కారణమవు తున్నాయి.

జెండర్‌ అంశం : ఒక వయసు వరకు మహిళలతో  పోలిస్తే గుండెప్లాక్‌టు వచ్చే అవకాశాలు పురుషుల్లో ఎక్కువ. రుతుస్రావం ఆగి΄ోయే వరకు మహిళల్లోని ఈస్ట్రోజెన్‌ వారికి ఒక రక్షణ కవచంగా ఉంటుంది. అయితే రుతుక్రమం ఆగాక మహిళలతో పాటు... ఏ జెండర్‌ వారికైనా గుండెపోటు అవకాశాలు సమానం. 

సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలు: పై అంశాలకు తోడుగా ఒక సమాజం లోని విద్య, ఆదాయ వనరులు, ఆరోగ్య సంరక్షణకు గల అవకాశాలు, సాంస్కృతిక నేపథ్యాల వంటి అంశాలు కూడా గుండెజబ్బుల కేసులను ప్రభావితం చేస్తుంటాయి. 

ఫ్యామిలీ హిస్టరీ : మిగతావారితో  పోలిస్తే గుండెజబ్బులు / గుండెపోటు లాంటివి వచ్చిన వారి కుటుంబాల తాలూకు కుటుంబ ఆరోగ్య చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ) కూడా గుండెజబ్బుల ముప్పునకు ఒక ప్రధాన కారణం. మిగతావాళ్లతో పోలిస్తే దాదాపు 25 శాతం మంది రోగుల్లో గుంపోటుకు ఈ ఫ్యామిలీ హిస్టరీనే కీలకాంశ మవుతుంది.  

చదవండి: దుర్గాపూజలో భక్తిపారవశ్యం, నటీమణులు ఎమోషనల్‌, వీడియో వైరల్‌

లబ్‌... డబ్‌...లయ తప్పొద్దు!
నివారణ ఇలా... కార్డియో వాస్క్యులార్‌ హెల్త్‌ స్కోరుకు దగ్గరగా ఉండే జీవనశైలి: సాధారణంగా పాశ్చాత్యదేశాల్లో... మరీ ముఖ్యంగా అమెరికా వంటి చోట్ల అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ నిర్దేశించిన కొన్ని జీవనశైలి మార్గదర్శకాలు ఉన్నాయి. వాటినే ‘లైఫ్‌ ఎసెన్షియల్స్‌ 8 (ఎల్‌ఈ 8); లైఫ్‌ ఎసెన్షియల్స్‌ 7 (ఎల్‌ఈ 7) గా వ్యవహరిస్తుంటారు. 

అంటే... ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా అనుసరించే మార్గదర్శకాలైన... రక్త΄ోటును (హైబీపీని) అదుపులో ఉంచుకోవడం; రక్తంలో చక్కెరమోతాదులనూ, కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడం; ఆరోగ్యకరమైన ఆహారాన్ని,పోషకాహారాన్ని తీసుకోవడం; తగినంత వ్యాయామం చేయడం; ఎత్తుకు తగినంత బరువు ఉండేలా బాడీ మాస్‌ ఇండెక్స్‌– (బీఎమ్‌ఐ)ను మెయింటెయిన్‌ చేయడం

స్మోకింగ్‌ / నికోటిన్‌కు దూరంగా ఉండటం; కంటినిండా నిద్రపోవడం... అలాంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడం ద్వారా ఈ లైఫ్‌ ఎసెన్షియల్‌ స్కోరును ఎంతగా పెంచుకుంటే గుండెజబ్బులను అంతగా నివారించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. 

అర్లీ వార్నింగ్‌ సిగ్నల్స్‌ ద్వారా : చాలామందిలో గుండెజబ్బులుగానీ లేదా గుండెపోటుగానీ ఆకస్మికంగా రాకముందే కొన్ని వార్నింగ్‌ సిగ్నల్స్‌ పంపుతాయి. 

ఉదాహరణకు ఛాతీలో ఇబ్బందిగా ఉండటం, తీవ్రమైన నీరసం, నిస్సత్తువ, అలసట, గుండెదడ (పాల్పిటేషన్‌) వంటివి. వాటిని నిర్లక్ష్యం చేయకుండా తగిన సమయంలో గుర్తించి డాక్టర్లను సంప్రదించడం వల్ల. 

స్క్రీనింగ్‌ పరీక్షలతో :  హైబీపీ, అధిక కొలెస్ట్రాల్, మధుమేహంతో బాదపడేవారు తగిన పరీక్షలు చేయించు కోవడం, ఏవైనా లక్షణాలు కనిపిస్తే కరోనరీ సీటీ యాంజియోగ్రామ్‌ వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండెజబ్బులు నివారించవచ్చు.   

ఇదీ చదవండి:Karur stampede tragedy మొన్ననే ఎంగేజ్‌మెంట్‌..త్వరలో పెళ్లి

-డాక్టర్‌ అంజని,ద్వారంపూడి, సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement