మా అమ్మానాన్న వస్తే మటన్‌ కాకుండా చికెన్‌ తెస్తారా? | Wife Seeks Divorce Over Mutton And Chicken Issue | Sakshi
Sakshi News home page

మా అమ్మానాన్న వస్తే మటన్‌ కాకుండా చికెన్‌ తెస్తారా?

Jul 20 2026 9:50 AM | Updated on Jul 20 2026 10:37 AM

Wife Seeks Divorce Over Mutton And Chicken Issue

ప్ర‌తీకాత్మ‌క చిత్రం (ఏఐ ఫోటో)

  • నిజామాబాద్‌కు చెందిన ఓ యువతి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. యువతి తల్లిదండ్రులు ఈ మధ్య కూతురు, అల్లుడి వద్దకు వెళ్లారు. అయితే తన తల్లిదండ్రులకు మటన్‌ వండకుండా చికెన్‌ వండారని భర్తతో గొడవపడింది. వారి మధ్య తలెత్తిన మనస్పర్థలు పోలీస్‌ స్టేషన్‌కు చేరాయి. పెళ్లయిన నాలుగు నెలలకే తనకు విడాకులు కావాలని అంటోంది ఆ యువతి.

  • మోపాల్‌ మండలం న్యాల్‌కల్‌కు చెందిన సంధ్య తన భర్త ప్రశాంత్‌ను నిద్రమాతలను పొడిగా చేసి, టాయిలెట్‌ క్లీనర్‌ను ఇంజక్షన్‌ ద్వారా ఎక్కించి గత నెల 30వ తేదీన హత్య చేసింది. గల్ఫ్‌ నుంచి తిరిగి వచ్చిన భర్త ఇక తిరిగి వెళ్లేది లేదని చెప్పడంతో తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉంటాడని ఈ ఘాతుకానికి పాల్పడింది.

  • ఎడపల్లి మండలం అంబం(వై) గ్రామానికి చెందిన స్వరూప వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంలో భార్యాభర్తలకు తరచూ గొడవలు జరిగాయి. అయినప్పటికీ భార్య ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో మనస్థాపానికి గురైన భర్త మహిపాల్‌ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన భర్తది సహజ మరణమని నమ్మించేందుకు యతి్నంచిన స్వరూప చివరకు కటకటాలపాలైంది.

నిజామాబాద్‌అర్బన్‌: దంపతుల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు పెద్దవి అవుతున్నాయి. అనుమానాలు, ఇద్దరి మధ్య మూడో వ్యక్తి ప్రవేశం సంసారాలు ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. కారణమేదైనా జీవితాంతం కలిసి ఉంటామని ఏడడుగులు వేసిన దంపతులు తమ సంసార జీవితాలను మూడు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు అన్నట్లు మార్చుకుంటున్నారు. పెళ్లయిన మూడు నుంచి నాలుగు నెలల్లోనే కొన్ని జంటలు విడాకుల కోసం పోలీస్‌ స్టేషన్‌లు, కోర్టుల గడపలు తొక్కుతుండడం గమనార్హం.

 గత మూడేళ్లలో మహిళా పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులు పరిస్థితి తీవ్రతను తెలుపుతున్నాయి. 2024లో 463, 2025లో 537 ఫిర్యాదులు, ఈ ఏడాది ఈనెల 17 నాటికి 349 ఫిర్యాదులు నమోదయ్యాయి. దంపతులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న పోలీసులు తప్పనిసరి పరిస్థితి ఉంటే కేసులు నమోదు చేస్తున్నారు. మరోవైపు ఇటీవల జిల్లాలో వెలుగు చూసిన భర్తల హత్య, ఆత్మహత్యల కేసులు కలకలం రేపాయి. ఈ ఘటనలకు వివాహేతర సంబంధాలు కారణమయ్యాయి.  

సోషల్‌ మీడియా ప్రభావం.. 
జ్ఞానాన్ని పెంచడంతోపాటు ఆనందాన్ని పంచాల్సిన సోషల్‌ మీడియాను అడ్డగోలుగా ఉపయోగిస్తూ చాలా మంది పక్కదారి పడుతున్నారు. సెల్‌ఫోన్‌ చేతిలో ఉంటే తనను, పిల్లలను పట్టించుకోవడం లేదని భర్తపై భార్య.. భార్యపై భర్త ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు చాలా ఇళ్లలో మామూలు విషయం మారిపోయింది. రీల్స్‌ చేయడం, ఆన్‌లైన్‌లో పరిచయమైన వారితో చాటింగ్‌ వంటివి సంసారాల్లో చిచ్చురేపుతున్నాయి. కొన్ని పరిచయాలు ఒకరికొకరు ఆకర్షితులై వివాహేతర సంబంధాలకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలోనే హత్యలు చోటు చేసుకుంటున్నాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. తమ వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్న పిల్లలను చంపిన ఘటనలూ ఉన్నాయి.  

సమన్వయమే ముఖ్యం 
భార్యాభర్తల మధ్య సమన్వయం, ఓపిక ఎంతో ముఖ్యం. అనుమానాలు ఉంటే ఇద్దరూ మాట్లాడుకుని నివృత్తి  చేసుకోవాలి. ఇతరుల మాటలను పట్టించుకోవద్దు. ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకంతో ఉంటే సంసారం సుఖంగా సాగుతుంది. సమన్వయం లేకపోవడం వల్లే అనుమానం పెరిగి విడాకుల వరకు వెళ్తున్నారు. చాలా కేసుల్లో కౌన్సెలింగ్‌ ఇచ్చి నచ్చజెప్పుతున్నాం. లేనిపక్షంలో కేసుల వరకు వెళ్తోంది.  
– శ్రీలత, సీఐ, మహిళా పోలీసు స్టేషన్‌  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement