'తెలంగాణ కాశ్మీర్‌' చూడదగ్గ అందమైన స్థలం.. | Kuntala Waterfall: The Niagara Of Telangana, Beautiful Place Highlights | Sakshi
Sakshi News home page

'తెలంగాణ కాశ్మీర్‌' చూడదగ్గ అందమైన స్థలం..

Jul 20 2026 10:32 AM | Updated on Jul 20 2026 10:38 AM

Kuntala Waterfall: The Niagara Of Telangana, Beautiful Place Highlights

ట్రావెల్‌

కుంటాల జలపాతం

చుట్టూ దట్టమైన అడవులు, కొండలు, వాటి మధ్య నుంచి జాలువారే జలపాతాలు.. ఆహ్లాదాన్ని పంచే పక్షులు.. ఇవన్నీ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా సొంతం. ఎటు చూసినా పచ్చని చెట్లతో దట్టమైన అడవులు, నదులు, జలపాతాలు కనువిందు చేసే ఈ జిల్లాను తెలంగాణ కాశ్మీర్‌ అని కూడా పిలుస్తారు. ఈ జిల్లా ప్రకృతి అందాలు ఊటీ, కొడైకెనాల్‌లను గుర్తుచేస్తాయని పర్యాటకులు అంటుంటారు.

ముఖ్యంగా తెలంగాణ నయాగారాగా ప్రసిద్ధి చెందిన కుంటాల జలపాతాన్ని చూడడానికి దేశం నలుమూలల నుంచి సందర్శకులు తరలివస్తారు. మరి ఇంత అందమైన కుంటాల జలపాతం హైదరాబాద్‌ నుంచి ఎంత దూరంలో ఉందో, ఈ ప్రాంతంలోని ఇతర ఆకర్షణలేంటో తెలుసుకుందాం.

జలపాతం ప్రత్యేకత
కుంటాల జలపాతం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా (ప్రస్తుతం నిర్మల్‌ జిల్లా) నేరడిగొండ మండలం కుంటాల(బి) గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఉంది. ఇది 50 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకుతూ, పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఈ జలపాతాన్ని దగ్గరగా చూడాలంటే సుమారు 430 మెట్లు కిందికి దిగాల్సి ఉంటుంది. సహ్యాద్రి పర్వతాల నడుమ వంపులు తిరిగే మహబూబ్‌ ఘాట్‌ అందాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తాయి. హైదరాబాద్‌ సిటీ నుంచి ఈ కుంటాల వాటర్‌ఫాల్‌ సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది.

విజయవాడ నుంచి ఎలా వెళ్లాలి?

  • విజయవాడ నుంచి కుంటాల జలపాతానికి సుమారు 450 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోడ్డు మార్గంలో 8–9 గంటల్లో చేరుకోవచ్చు.

  • విజయవాడ–హైదరాబాద్‌–కామారెడ్డి–నిర్మల్‌–నేరడిగొండ మీదుగా కుంటాలకు వెళ్లొచ్చు. అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్‌ లేదా నిర్మల్‌ వరకు రైలు, బస్సులో చేరుకుని, అక్కడి నుంచి టాక్సీ లేదా ఆర్టీసీ బస్సులో జలపాతానికి వెళ్లవచ్చు.

ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇతర టూరిజం స్పాట్స్‌
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కేవలం కుంటాల జలపాతం మాత్రమే కాదు, ఎన్నో సుందరమైన దృశ్యాలు, పురాతన ఆలయాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధ ఆలయంగా పేరుగాంచిన బాసర సరస్వతి ఆలయం ఇక్కడే ఉంది.

గోదావరి, ప్రాణహిత నదులు ఇక్కడ పరవళ్లు తొక్కుతుంటే, కడెం ప్రాజెక్టు ప్రకతి అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఉన్న కవ్వాల్‌ అభయారణ్యం పులుల సంరక్షణ కేంద్రంగా గుర్తింపు పొందింది. ఈ అభయారణ్యం పచ్చని చెట్లతో ప్రకతికి పచ్చని చీరకట్టినట్లు కనిపిస్తుంది. ఈ అభయారణ్యం ఎన్నో రకాల పక్షులు, వన్య్రపాణులకు ఆలవాలంగా మారింది. జైపూర్‌ మండలం శివారం మొసళ్ల సంరక్షణ కేంద్రం కూడా ఇక్కడే ఉంది.

ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని దట్టమైన అడవులు, కొండలు, సెలయేర్లు, నల్లటి రహదారులు ప్రకతి రమణీయతను పెంచుతాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇక్కడి అందాలు పీక్‌కు చేరుకుంటాయి. ఆ సీజన్‌ లో పర్యాటకులు పెద్దసంఖ్యలో తరలివచ్చి, ఇక్కడి ప్రశాంతమైన వాతావరణాన్ని, అందాలను ఆస్వాదించి వెళతారు. మీరు ప్రకృతి ప్రేమికులైతే, ఈ తెలంగాణ కాశ్మీర్‌ అందాలను ఒక్కసారి తప్పక దర్శించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement