
ఈ నెల 27వ తేదీ వరల్డ్ టూరిజమ్ డే. ఓ గొప్ప పర్యటన చేసి తీరాలి. అది... ప్రపంచం గర్వించే ప్రదేశమై ఉండాలి. అంతేనా... అది మనదేశంలోనే ఉండాలి. ఈ టూర్ జీవితమంతా గుర్తుండాలి. మంచు కొండలను చీలుస్తూ ΄పోదాం. ట్రెక్ దారులు వేసుకుంటూ నడుద్దాం. నింగిలో విరిసిన పూల తోటలో విహరిద్దాం.
ఐఆర్‌సీటీసీ... రైళ్లు, బస్సు, విమానాలు, క్రూయిజ్ టూర్‌లతోపాటు కొత్తగా ట్రెకింగ్ టూర్‌లను కూడా మొదలు పెట్టింది. వరల్డ్ టూరిజమ్ డే సందర్భంగా మనదేశంలో నెలకొన్ని ప్రకృతి గీసిన అద్భుత చిత్రం ‘వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెకింగ్’ అడ్వెంచరస్ టూర్ వివరాలు ఈ వారం ట్రావెల్‌లో..
ప్రకృతి సిగలో తురుముకున్న పూలను చూద్దాం.రిషికేశ్ నుంచి పీపల్‌కోటికి ప్రయాణం. రిషికేశ్ నుంచి 200 కిమీల దూరం రోడ్డు మార్గాన ప్రయాణించాలి. ప్రయాణ సమయం తొమ్మిది నుంచి పది గంటలు. పీపల్‌కోటి నాలుగు వేల అడుగులకు పైగా ఉంటుంది.
కూడలి గ్రామం
రిషికేశ్ నుంచి పీపల్‌కోటికి పర్వత సానువుల మధ్య సాగే ప్రయాణంలో ప్రకృతి విచిత్రాలను ఆస్వాదిస్తూ ముందుకు సాగాలి. అలకనంద నది తీరాన ఉన్న చిన్న గ్రామం పీపల్‌కోటి. ఇక్కడ ప్రత్యేకంగా చూడాల్సిన క్షేత్రాల వంటివేవీ లేవు. చార్‌ధామ్ యాత్రికులు, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, మాణా గ్రామ పర్యటనకు వెళ్లడానికి కూడలి ΄ాయింట్. పీపల్ కోటి నుంచి గోవిందఘాట్‌కు (52 కిమీలు) రోడ్డు మార్గాన ప్రయాణం. ప్రయాణ సమయం రెండు గంటలు. అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరాన ఉన్న పుల్నాలోని ట్రెకింగ్ ΄ాయింట్‌కు చేరడానికి 15 నిమిషాలు. పుల్నా నుంచి ఘంగారియాకు ట్రెకింగ్. ఈ రోజు ప్రయాణ లక్ష్యం 6,900 అడుగుల ఎత్తులో ఉన్న పుల్నా నుంచి 9.800 అడుగుల ఎత్తులో ఉన్న ఘంగారియా చేరడం. దూరం తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది. నాలుగు గంటల్లో చేరవచ్చు.
లక్ష్మణ గంగ తీరం
గోవింద్ ఘాట్ అనే ప్రదేశం చిన్న పట్టణం. అలకనంద నది, లక్ష్మణ గంగ సంగమిస్తాయిక్కడ. ఇది కూడా పై పర్యటన దారిలో తారసపడే ఒక జనావాసం. పర్యాటకం ఆధారంగా పట్టణంగా అభివృద్ధి చెందింది. పుల్నా గ్రామం కూడా ఇలాంటిదే. స్థానికులు పర్యాటకం మీదనే ఆధారపడి జీవిస్తుంటారు. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, హేమకుండ్ సాహిబ్ పర్యాటకులకు తమ ఇళ్లలో హోమ్‌స్టే సౌకర్యం కల్పిస్తారు. ఇక ఘంగారియా విషయానికి వస్తే ఇది పుష్పవతి నది తీరాన విలసిల్లిన నివాసప్రదేశం. దీనిని చివరి నివాస ప్రదేశం అని చెప్పవచ్చు. ఇక్కడి నుంచి పైకి వెళ్లే కొద్దీ పర్యాటకులు తప్ప నివాస ప్రదేశాలు ఉండవు. ఘంగారియా గ్రామం కూడా ఏడాదిలో మూడు నెలలు (జూన్– అక్టోబర్) మాత్రమే మనుష్య సంచారంతో ఉంటుంది. మిగిలిన కాలమంతా మంచు కప్పేసి ఉంటుంది.ఘంగారియా నుంచి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు ట్రెకింగ్. తిరిగి ఘంగారియాకు చేరడం. ఈ రోజు పర్యటనలో చేరే లక్ష్యం 11,500 అడుగుల ఎత్తు. దూరం నాలుగు కిలోమీటర్లు. వెనక్కి రావడానికి మరో నాలుగు కిలోమీటర్లు.
ప్రకృతి చీరకు రంగుల పూలు
ఘంగారియా నుంచి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు వెళ్లే దారి ఆద్యంతం రంగులమయమే. తలెత్తి చూస్తే నీలాకాశంలో తేలాడుతున్న వెండి మబ్బులు, ఆ మబ్బుల కంటే ఎత్తులో ఉన్న పచ్చటి శిఖరాలు, దూరంగా మంచుదుప్పటి కప్పుకున్న వెండి కొండలు, కిందకు చూస్తే పచ్చటి చీర మీద రంగు రంగుల పూలను ఎంబ్రాయిడరీ చేసినట్లు ఉంటుంది నేల. బ్లూ పాపీ, స్నేక్ ఫాయిల్, వైట్ లీఫ్ హోగ్ ఫుట్, హిమాలయన్ రేంజ్, మిడోస్ జెరానియమ్, డాగ్ ఫ్లవర్, హూక్‌డ్ స్టిక్ సీడ్, రివర్ అనేమోన్... వంటి ఇంగ్లీష్ పేర్లు చెబుతారు. అంతే తప్ప వాటికి స్వదేశీ నామాలను స్థానిక గైడ్‌లు కూడా చెప్పలేరు. మన దగ్గర ‘సీతమ్మ వారి జడకుచ్చులు’ అని పిలిచే ముఖమల్ వస్త్రం వంటి పూలు అక్కడక్కడా కనిపిస్తాయి. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ గురించి ఒక్క మాటలో చె΄్పాలంటే నేల మీద విరిసిన ఇంద్రధనస్సు అనాలి. అన్నట్లు ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు పొందిన ప్రదేశం. పూల చెట్ల మధ్య రకరకాల జంతువులు కూడా విహరిస్తుంటాయి. అవి మంచును తట్టుకోగలిగిన దేహదారుఢ్యంతో పుష్టిగా ఉంటాయి. మనం వాటిని ఆశ్చర్యంగా చూస్తాం, కానీ అవి మాత్రం పర్యాటకులను చిరపరిచితులన్నట్లు ఒకసారి అలా చూసి వెళ్లిపోతుంటాయి.
ఘంగారియా నుంచి హేమ్‌కుండ్ సాహిబ్‌కు ట్రెకింగ్. తిరిగి ఘంటారియాకు చేరడం. ఈ రోజు లక్ష్యం 14,100 అడుగుల ఎత్తుకు చేరడం. ఘంగారియా నుంచి హేమ్‌కుండ్ సాహిబ్‌కు దూరం ఆరు కిలోమీటర్లు. రెండు వైపులా ట్రెకింగ్‌కు తొమ్మిది గంటల సమయం పడుతుంది.
బ్రహ్మకమలం విరిసింది!
హేమకుండ్ సాహిబ్ కూడా ఓ మోస్తరు పట్టణం మాత్రమే. సిక్కుల పవిత్ర తీర్థం. ఇక్కడి హేమకుండ్ సరస్సు మంచులా గట్టిపడి ఉంటుంది. గురుద్వారాకు నడిచి వెళ్లే దారి మొత్తం రెండు అడుగుల మందాన మంచు పేరుకు΄ోయి ఉంటుంది. పర్యాటకుల కోసం మంచును తవ్వి దారి చేస్తారు. ఇక్కడ జూలై నుంచి సెప్టెంబర్ మధ్య బ్రహ్మ కమలాలు విరుస్తాయి. గురుద్వారా ముందున్న నీటి ఉపరితలం మంచు పలకలుగా మారిపోయి ఉంటుంది.
ఘంగారియా నుంచి పుల్నా కు తొమ్మిది కిలోమీటర్ల దూరం ట్రెకింగ్. ఐదు గంటల సమయం. పుల్నా నుంచి వాహనంలో గోవిందఘాట్‌కు 15 నిమిషాల ప్రయాణం. గోవిందఘాట్ నుంచి బదరీనాథ్ (25కిమీలు)కు గంట ప్రయాణం. అక్కడి నుంచి పీపల్‌కోటికి (75 కిమీలు) నాలుగు గంటల ప్రయాణం. సమయం, వాతావరణం అనుకూలించక΄ోతే బదరీనాథ్‌ను మినహాయిస్తారు. గోవింద్‌ఘాట్ నుంచి బదరీనాథ్ మధ్య రోడ్డుకు అడ్డంగా కొండచరియలు విరిగి పడడం వంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏ రోజుకారోజు పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారు.
తిరిగి వచ్చే దారి
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెకింగ్‌లో రెండవ రోజు పుల్నా నుంచి ఘంగారియాకు ప్రయాణించిన దారిలోనే మరోసారి ప్రయాణం సాగుతుంది. వెళ్లేటప్పుడు చూసిన వాటిని మరోసారి మనసారా ఆస్వాదించడానికి అనువైన సమయం ఇది. ట్రెకింగ్ మొదలు పెట్టినప్పుడు ట్రెకింగ్ తామున్న చోటు నుంచి పైకి చూస్తూ సాగుతుంటుంది. ఆకాశాన్నంటే పర్వత శిఖరాలకు చేరాలనే ఉత్సాహం ఉంటుంది. తిరిగి వచ్చేటప్పుడు ఆకాశం నుంచి నేల మీదకు దిగుతున్న భావన చాలా గొప్పగా ఉంటుంది. కిందకు చూస్తుంటే కంటికి కనిపించినంత మేర అందమైన ప్రకృతి చిత్రం అలరిస్తుంది.
పీపల్‌కోటి నుంచి రిషికేశ్‌కు ప్రయాణం. ప్రయాణం పదిగంటలు పడుతుంది. రిషికేశ్‌కు చేరిన తర్వాత టూర్ ఆపరేటర్‌లు వీడ్కోలు చెబుతారు. పర్యాటకులు రిషికేశ్ నుంచి తమ సొంత స్థానాలకు రావడానికి రైలు లేదా విమాన ప్రయాణానికి మధ్య ఒకరోజు విరామం తీసుకోవడం మంచిది. ఆ రోజు రిషికేశ్ పర్యటన, విశ్రాంతికి కేటాయించుకోవచ్చు.
గంగాతీరాన ఒకరోజు
రిషికేశ్‌లో ఒక రోజు చూడగలిగిన ప్రదేశాల్లో త్రివేణీఘాట్, త్రివేణీ ఘాట్‌లో సాయంకాలం గంగా హారతి, లక్ష్మణ్ ఝూలా, రామ్‌ఝూలా, పరమార్థ నికేతన్ ఆశ్రమ్, స్వర్గ ఆశ్రమ్‌లోని ప్రాచీన రాతి వలయాకారపు ఆశ్రమాలు, వశిష్ఠ గుహ, రిషికుండ్, భారత్‌మందిర్, తారా మంజిల్ టెంపుల్. రిషికేశ్‌లో పర్యాటక ప్రదేశాలను పర్యాటకులు సొంతంగా చూడాలి. ప్యాకేజ్‌లో లేవు. పీపల్‌కోటి నుంచి ట్రెకింగ్ టూర్ మొదలు కావడానికి ఒక రోజు ముందుగా రిషికేశ్ చేరిన వాళ్లు సాయంత్రం గంగాహారతిని మిస్ చేసుకోవద్దు.
పీపల్‌కోటి నుంచి రిషికేశ్‌కు ప్రయాణం. ప్రయాణం పదిగంటలు పడుతుంది. రిషికేశ్‌కు చేరిన తర్వాత టూర్ ఆపరేటర్‌లు వీడ్కోలు చెబుతారు. పర్యాటకులు రిషికేశ్ నుంచి తమ సొంత స్థానాలకు రావడానికి రైలు లేదా విమాన ప్రయాణానికి మధ్య ఒకరోజు విరామం తీసుకోవడం మంచిది. ఆ రోజు రిషికేశ్ పర్యటన, విశ్రాంతికి కేటాయించుకోవచ్చు.గంగాతీరాన ఒకరోజు రిషికేశ్‌లో ఒక రోజు చూడగలిగిన ప్రదేశాల్లో త్రివేణీఘాట్, త్రివేణీ ఘాట్‌లో సాయంకాలం గంగా హారతి, లక్ష్మణ్ ఝూలా, రామ్‌ఝూలా, పరమార్థ నికేతన్ ఆశ్రమ్, స్వర్గ ఆశ్రమ్‌లోని ప్రాచీన రాతి వలయాకారపు ఆశ్రమాలు, వశిష్ఠ గుహ, రిషికుండ్, భారత్‌మందిర్, తారా మంజిల్ టెంపుల్. రిషికేశ్‌లో పర్యాటక ప్రదేశాలను పర్యాటకులు సొంతంగా చూడాలి. ప్యాకేజ్‌లో లేవు. పీపల్‌కోటి నుంచి ట్రెకింగ్ టూర్ మొదలు కావడానికి ఒక రోజు ముందుగా రిషికేశ్ చేరిన వాళ్లు సాయంత్రం గంగాహారతిని మిస్ చేసుకోవద్దు.
ఫిట్‌నెస్ ఇలా ఉండాలి!
ట్రెకింగ్‌కు బయలుదేరడానికి కనీసం నెల ముందు దేహాన్ని సంసిద్ధం చేసుకోవాలి. ఫిట్‌నెస్ మెయింటెయిన్ చేయడానికి రోజూ ఐదు కిలోమీటర్ల దూరం జాగింగ్35 నిమిషాల్లో పూర్తి చేయాలి. జాగింగ్ పూర్తయ్యేటప్పటికి విపరీతంగా అలసిపోయిన ఫీలింగ్ లేకుండా నార్మల్‌గా ఉండగలగాలి. సైక్లింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్లయితే అరగంట సమయంలో 10 కిలోమీటర్లు వెళ్లగలగాలి.
అవసరమైన వస్తువులతో నిండిన బ్యాక్‌ప్యాక్ పది నుంచి పన్నెండు కిలోలుంటుంది. ట్రెకింగ్ సమయమంతా దానిని మోయగలిగిన శక్తి ఉండాలి. బాడీ మాస్ ఇండెక్స్ 18–29 మధ్యలో ఉంటేనే దేహం ట్రెకింగ్ తగినట్లు శక్తిమంతంగా ఉంటుంది.పల్స్ రేట్ నిమిషానికి 60– 100 మధ్య ఉండాలి. బ్లడ్ ప్రెషర్ డయస్టోలిక్ 75–85 మధ్య, సిస్టోలిక్ 100– 130 మధ్య ఉండాలి.ఉచ్వాశనిశ్వాసలు నిమిషానికి 12 నుంచి 20 మధ్య ఉండాలి.
లివర్, కిడ్నీ సమస్యలు, డయాబెటిస్, బ్రాంకైల్ ఆస్త్మా, హార్డ్ ప్రాబ్లమ్స్, హైబీపీ,సైనసైటిస్, ఎపిలెప్సీ వంటివి ఉండకూడదు. పేస్‌మేకర్ ఇంప్లాంట్ చేసుకున్న వారు ట్రెకింగ్‌కు వెళ్లరాదు. పై కొలతలు కొంచెం అటూ ఇటూగా ఉన్నప్పటికీ ఫిట్‌నెస్ పరంగా దృఢంగా ఉంటే ట్రెక్ కో ఆర్డినేటర్‌ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. ఈ ట్రెకింగ్‌లో 14,100 అడుగుల ఎత్తుకు చేరతారు కాబట్టి ఆల్టిట్యూడ్ సిక్‌నెస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కార్డియో వర్కవుట్స్, రన్నింగ్, బ్రిస్క్ వాకింగ్, మెట్లు ఎక్కడం వల్ల ఊపిరితిత్తులు ఆక్సిజెన్‌ను ఎక్కువ మోతాదులో తీసుకుంటాయి. ట్రెకింగ్‌కు ముందు కనీసం నెల రోజులు వీటిని సాధన చేస్తే లంగ్ కెపాసిటీ మెరుగవుతుంది. ట్రెకింగ్ టూర్‌ని ఆద్యంతం ఆస్వాదించవచ్చు.
ఏ వయసు వాళ్లు ట్రెకింగ్ చేయవచ్చు!
తొమ్మిది సంవత్సరాలు నిండిన పిల్లలను కూడా ట్రెకింగ్‌కి అనుమతిస్తారు. కానీ వారితోపాటు తల్లిదండ్రులు కూడా ట్రెకింగ్ టీమ్‌లో ఉండాలి. 15 సంవత్సరాల నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలను ఒంటరిగా (తల్లిదండ్రులు వెంట లేకపోయినా)
ట్రెకింగ్‌కి అనుమతిస్తారు. కానీ తల్లిదండ్రులు అనుమతి పత్రం మీద సంతకం చేయాల్సి ఉంటుంది.
18 ఏళ్లు దాటిన వారికి తల్లిదండ్రుల అనుమతి అవసరం లేదు.
గరిష్ట వయసు విషయానికి వస్తే ప్రత్యేకంగా నిబంధనల కంటే ఆరోగ్య నిర్ధారణ చేస్తూ
డిస్‌క్లెయిమర్ ఫార్మ్ సంతకం చేసి ఇవ్వాలి.
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెకింగ్ టూర్ కోడ్: https://www.irctctourism.com/
adventure/trekDetails?id=48
ఏమేమి తీసుకెళ్లాలి? బ్యాక్ ప్యాక్, రెయిన్ కవర్, వాకింగ్ స్టిక్, వాటర్ బాటిల్, లంచ్ బాక్స్, స్నాక్స్, పర్సనల్ మెడికల్ కిట్, సింథటిక్ టీ షర్ట్, ఫ్లీస్ టీ షర్ట్, ఫ్లీస్ జాకెట్, విండ్ ప్రూఫ్ జాకెట్, హాలో జాకెట్, థర్మల్ ఇన్నర్, ట్రెక్ పాంట్, ఫ్లీస్ , వాటర్ ప్రూఫ్ గ్లవ్స్, ఉలెన్ గ్లవ్స్, హెడ్ టార్చ్, సన్ క్యాప్, ఉలెన్ క్యాప్, నెక్ గెయిటర్స్, సన్ గ్లాసెస్, సన్ స్క్రీన్ లోషన్, మాయిశ్చరైజర్, లిప్ బామ్, టూత్ బ్రష్– పేస్ట్, టాయిలెట్ పేపర్– వైప్స్, సబ్బు, హ్యాండ్ శానిటైజర్, ట్రెకింగ్ షూస్, ఫ్లిప్ ఫ్లాప్స్ లేదా ఫ్లోటర్స్, కాటన్ సాక్స్, ఉలెన్ సాక్స్, వాటర్ ప్రూఫ్ జాకెట్–పాంట్స్, మైక్రో స్పైక్స్, యాంటీ బ్యాక్టీరియల్ పౌడర్, క్విక్ డ్రై టవల్.
ప్యాకేజ్ వివరాలివి
ట్రెక్ పేరు ‘వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెక్, ఇది ఆరు రోజుల పర్యటన.
ఉత్తరాఖండ్ రాష్ట్రం, పీపల్‌కోటి నుంచి మొదలవుతుంది. రిషికేశ్ నుంచి టూర్ మొదలవుతుంది. ట్రెకర్‌లు రిషికేశ్ వరకు తమకు తాముగా చేరుకోవాలి. రిషికేశ్‌లో టూర్ నిర్వహకులు రిసీవ్ చేసుకుంటారు. రిషికేశ్ వరకు ట్రైన్‌లో వెళ్లవచ్చు. రిషికేశ్‌కు సమీప విమానశ్రయం జాలీ గ్రాంట్ ఎయిర్΄ోర్ట్, డెహ్రాడూన్‌లో ఉంది. 21 కిమీల దూరం.
ఈ ఆరు రోజుల యాత్రకు ఒక్కొక్కరికి 11,800 రూపాయలవుతుంది.
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెకింగ్‌కి అనువైన ప్రదేశం. నిజానికి దీనిని లెర్నర్స్ ట్రెక్ అనాలి. పెద్ద పెద్ద ట్రెకింగ్‌కి ఇది ప్రాక్టీస్‌గా పనికి వస్తుంది.
– వాకా మంజులారెడ్డి,
సాక్షి ఫీచర్స్ ప్రతినిధి