నివాళి
కె. భాగ్యరాజా
‘తిరైకథై మన్నన్‘... అంటే ‘స్కీన్ర్‌ప్లే చక్రవర్తి’గా ఖ్యాతి పొందిన ఆ మహా దర్శకుడి గుండె జూన్ 27, 2026న చెన్నైలో ఉదయం ఆరు గంటలకు ఆగిపోయింది. ఆ గుండె 49 ఏళ్లుగా తమిళ సినిమా గుండెచప్పుడైంది. కె.భాగ్యరాజా... మన భాగ్యరాజా గురువు భారతీరాజా వెళ్లిపోయిన 17 రోజులకే ప్రయాణం కట్టాడు. ఇది యాదృచ్ఛికం కాదు. విధి రాసిన స్కీన్ర్‌ప్లే. భాగ్యరాజా కథలో అయితే ఇదే అత్యంత బలమైన, అత్యంత బాధాకరమైన క్లైమాక్స్.
భారతీయ సినీ ప్రేక్షకులకు సిసలైన దేశీయ వినోదభాగ్యం అందించిన కె. భాగ్యరాజా ఒక మనిషి కాదు... యూనివర్సిటీ. దర్శకుడు, రచయిత, నటుడు, సంగీత దర్శకుడు, నిర్మాత, ఎడిటర్, పత్రికా సంపాదకుడు. అన్నిటి కంటే ముందు అతనొక కథకుడు. కాగితం అందుకుని రెండు లైన్లు రాస్తే చాలు థియేటర్ దద్దరిల్లాల్సిందే. కథ అల్లితే బుకింగ్స్ కిటకిటలాడాల్సిందే. అందుకే సౌత్ సినిమా కె. భాగ్యరాజాను ‘కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే’ అని, ‘తిరైకథై మన్నన్’ అని శిరస్సు వంచి అంగీకరించింది.
ఆ ఒక్క షాట్: శిష్యుడి జననం
1977... ‘16 వయదినిలే’ షూటింగ్. భారతీరాజా డైరెక్టర్. భాగ్యరాజా అసిస్టెంట్. పల్లెటూరికి వచ్చిన డాక్టర్ కుట్రతో శ్రీదేవిని లోబరుచుకునే కీలక సీన్ తీస్తున్నాడు భారతీరాజా. భాగ్యరాజా గురువు దగ్గరకు వెళ్లి గుసగుసగా అన్నాడు... ‘సార్, ఇక్కడ ఒక కొబ్బరికాయ విజువల్ పెడితే?’.... లోపల అమాయకురాలి జీవితం నాశనమవుతోందనడానికి సింబాలిక్‌గా బయట పచ్చటి కొబ్బరికాయను చెక్కుతున్న విజువల్. భారతీరాజా విన్నాడు. తీశాడు. రిజల్ట్? తమిళ సినిమా చరిత్రలో ఆ సింబాలిక్ షాట్‌ని నేటికీ చెప్పుకుంటారు. శిష్యుడి కలంలో ఉన్న మాంత్రిక శక్తిని ఆ రోజే గుర్తించిన గురువు ‘నా తర్వాత వెలుగులోకి వచ్చేది వీడే’ అని అక్కడికక్కడే ప్రకటించాడు. అలా మొదలైంది ‘తిరైకథై మన్నన్ ’ ప్రస్థానం.
గోబిచెట్టిపాళయం నుంచి మద్రాస్ దాకా
7 జనవరి 1953... కోయంబత్తూరుకు గంటన్నర దూరంలో ఉన్న గోబిచెట్టిపాళయం దగ్గర వెళ్లాంకోవిల్ అనే పల్లెలో కృష్ణస్వామి, అమరావతమ్మలకు పుట్టాడు భాగ్యరాజా. తరాలకు ముందు తమిళనాడుకు వలస వచ్చి స్థిరపడ్డ తెలుగువారు వీళ్లు. తల్లి కొడుక్కు ‘భాగ్యం’ అని పేరు పెట్టింది. కాని భాగ్యంకు చదువు కంటే సినిమాలు బాగా వంటపట్టాయి. ఉమ్మడి సంసారంలో ఆడవాళ్లకు కాలక్షేపం లేక సినిమాలకు వెళ్లేవారు. తోడుగా భాగ్యరాజాను తీసుకెళ్లేవారు. తెర మీద ఎం.జీ.ఆర్‌ను చూసి అలా అవ్వాలి అనుకున్నాడు. పి.యు.సి ఫెయిల్ అయ్యాక 1976లో మద్రాస్ వచ్చాడు. ఎ. జగన్నాథన్, ఆ తర్వాత భారతీరాజా దగ్గర అసిస్టెంట్‌గా చేరాడు. మొదట అందరూ ‘కోవై రాజా’ అని పిలిచేవారు. ‘16 వయదినిలే’ క్రెడిట్స్‌లో ‘భాగ్యం’ పోకూడదని కె. భాగ్యరాజ్ అయ్యాడు.
మనిషి మూలం భావోద్వేగం భాగ్యరాజా సిగ్నేచర్
భారతీరాజా తమిళ సినిమాను పల్లెకు తీసుకెళితే, భాగ్యరాజా మిడిల్ క్లాస్ ఇళ్లలోకి, ముఖ్యంగా మానవ మనస్తత్వాల లోతుల్లోకి తీసుకెళ్లాడు. భారతీయ జీవనం స్త్రీ, పురుషులు కలిసి నిర్మించుకునే జీవితం. ఈ జీవితంలో ఎదురయ్యే ఇరుపక్షాల భావోద్వేగాలను కథలు చేశాడు. ఆయన ఫార్ములా: మెలోడ్రామా తగ్గించి, చురకతో పాథోస్ పాయింట్ చెక్కడం. టెన్షన్ లో నవ్వు పుట్టించడం. ముఖ్యంగా 80వ దశకంలో హీరోలు పిచ్చి ఫైట్లు చేస్తున్నప్పుడు, హీరోయిన్ల పాత్రలకు లైఫ్, ఎనర్జీ, హీరోయిజం ఇచ్చిన తొలి రచయిత భాగ్యరాజా.
1. ‘ముందానై ముడిచ్చు’ (మూడుముళ్లు) – 1983
సవతి తల్లులు బిడ్డల్ని హింసిస్తారనే భయంతో భార్య చనిపోయినా పెళ్లి చేసుకోకుండా ఉన్న బడి
పంతులిపై నింద వేసి మరీ వివాహం చేసుకుంటుంది ఊర్వశి. ఆ నిందను నిరూపించమని బిడ్డను పడుకోబెట్టి దాటమంటే అభ్యంతరం లేకుండా దాటేస్తుంది. ప్రేక్షకులకు కలుక్కుమనే దృశ్యం. కాని కథ కొనసాగే కొద్దీ ఆ పిల్లాడి మీద ఆమెకు ఎంత ప్రేమ ఉందో, బడి పంతులు మీద ఎంత అనురాగం ఉందో తెలుస్తుంది. పెళ్లికాని అమ్మాయి మాతృత్వాన్ని చాటిన కథ ఇది. దర్శకుడిగా–నటుడిగా భాగ్యరాజా తెరవెనకా, తెరపైనా సూపర్.
2. ‘అంద 7 నాట్కల్’ (రాధాకల్యాణం) – 1981
తమిళనాడును ఊపేసిన సినిమా. కారణం సంప్రదాయానికి మద్దతు. ప్రేమించిన అమ్మాయి మరొకరి భార్య అయ్యాక కూడా ప్రియుణ్ణే తలుచుకుంటూ భర్తను దగ్గరకు రానీయదు. భర్త అది తెలుసుకుని ప్రియుణ్ణి వెతికి తీసుకొస్తాడు. క్లయిమాక్స్‌లో భాగ్యరాజా డైలాగ్: ‘నా ప్రియురాలు మీకు భార్య కావచ్చు కానీ, మీ భార్య నా ప్రియురాలు కాకూడదు’. ఈ ఒక్క డైలాగ్‌తో సినిమా కల్ట్ అయ్యింది.
3. ‘ఎంగ చిన్నరాజా’ (అబ్బాయిగారు) – 1987
బిడ్డలు తల్లిని కాకుండా ఎవరిని నమ్మాలనే పాయింట్. సవతి తల్లి భాగ్యరాజాను అవమానిస్తూనే ఉంటుంది. కానీ అతను ఆమె పట్ల విపరీతమైన ప్రేమ పెంచుకుంటాడు. చివరికి ఆమె విషం కలిపిన పాలు ఇస్తే ‘మా అమ్మ విషం కలపదు’ అని చెప్పి మరీ తాగుతాడు. విషం అని గ్రహించాక ‘అమ్మా... నన్ను చంపాలంటే విషం కలపాలా.. చచ్చిపో అంటే చచ్చిపోనా’ అంటాడు. ఈ ఒక్క మాటతో ఆ సవతి తల్లిలోని మాతృత్వం ప్రాణం పోసుకుంటుంది. తల్లిని ద్వేషించి పోగొట్టుకోలేదు. ప్రేమించి పొందాడు.
4. ‘చిన్న వీడు’ (చిన్న ఇల్లు) – 1985
మగాడికి ఎన్ని వ్యామోహాలు ఉన్నా అతనికి అంతిమ సౌఖ్యం, ఆనందం, గౌరవం కుటుంబ జీవితంలోనే ఉందని, భార్యను మించిన ప్రియురాలు లేదని చెప్పిన సినిమా. విడుదలైతే స్త్రీలు తండోపతండాలుగా వెళ్లి చూసి హిట్ చేశారు. ఇల్లాలికి గౌరవం ఇచ్చిన దర్శకుడిని ఎందుకు నెత్తిన పెట్టుకోరు?
5. ‘డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్’ – 1982
ఒకసారి పుట్టిన ప్రేమ ఎప్పటికీ చచ్చిపోదని చెప్పిన సినిమా.
6. ‘తూరల్ నిన్ను పోచ్చు’ (సుందర కాండ) – 1982
మధ్యతరగతి ఆడపిల్లలు తమ పెళ్లిళ్లకు కోరుకునేది రాజకుమారులను కాదని, ప్రేమగా చూసుకునే మంచి అబ్బాయిలనని చెప్పిన సినిమా. కామెడీ టచ్: ‘ఇండ్రు పోయి నాళై వా’ (కొక్కరొకో) లో ‘ఏక్ గావ్ మే ఏక్ కిసాన్ రఘు తాతా’ కామెడీ, ‘అంద 7 నాట్కల్’లో తలుపుకు గొళ్లెం లేని బాత్‌రూమ్ సీన్ నేటికీ నవ్వులు పూయిస్తూనే ఉన్నాయి.
భాగ్యరాజా సక్సెస్ ఏంటంటే ప్రేక్షకులు నవ్వుతున్నామనుకునేంతలోపే ఏడ్చే సినిమాలు తీయడం... అలాగే నటుడిగా నవ్విస్తూనే... ఏడిపించడం...
వ్యక్తిగత జీవితం
1981లో తెలుగు నటి ప్రవీణను పెళ్లాడాడు. కాని 1983లో ఆమె జాండిస్‌తో చనిపోయింది. 1984లో ‘డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్’ కో–స్టార్ పూర్ణిమ జయరామ్‌ని పెళ్లి చేసుకున్నాడు. కొడుకు శాంతను, కూతురు శరణ్య ఇద్దరూ నటులే. ‘భాగ్య’ అనే వారపత్రిక నడిపాడు. 1989లో ఎం.జి.ఆర్. మక్కళ్ మున్నేట్ర కళగం పెట్టాడు. సినిమా, పత్రిక, రాజకీయం మూడింట్లోనూ తన ముద్ర వేశాడు. ఎం.జి.ఆర్. ఆయన్ని ‘కలైయులగ వారిసు’... తన కళా ప్రపంచానికి వారసుడు అని ప్రకటించాడు.
ఒక గురుకులం
కె. భాగ్యరాజాను యూనివర్సిటీ అని ఎందుకు అనాలంటే భారతీరాజా శిష్యుడిగా తాను ఎదగడమే కాకుండా, మళ్లీ తనలాంటి శిష్యులను తయారు చేశాడు. పార్తిబన్, పాండ్యరాజన్, ఆర్. సుందర్రాజన్, వి. శేఖర్... వీళ్లు మాత్రమే కాదు, పరోక్ష శిష్యులు ఎందరో.
చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన ఈ పి.యు.సి ఫెయిల్ కుర్రాడు తన సృజనతో ఎదిగి ఎం.జి.ఆర్‌కు అత్యంత ఆప్తుడయ్యాడు. శివాజీ గణేశన్ కు వేషం ఇచ్చి డైరెక్ట్ చేశాడు. అమితాబ్‌కు హిందీ రాని తాను, ఇంగ్లిష్ రాని బచ్చన్ కి బ్రోకెన్ ఇంగ్లిష్‌లో కథ చెప్పి మెప్పించి ‘ఆఖరీ రాస్తా’ వంటి సూపర్‌హిట్ ఇచ్చాడు.
ఒక కథను రాసి అన్ని భాషలకు తిప్పగలిగిన, రీమేక్ రైట్స్‌తో కోట్లు సంపాదించిన ఏకైక స్టోరీటెల్లర్ భాగ్యరాజా ఒక్కడే.
కొందరు హీరోలుగా గెలుస్తారు. కొందరు దర్శకులుగా నిలుస్తారు. కానీ భాగ్యరాజా కథకుడిగా యుగాన్నే శాసించాడు. అందుకే ఆయన సినిమా కాదు, సిలబస్. భాగ్యరాజా అనే యూనివర్సిటీకి అడ్మిషన్ దొరకడం మన అదృష్టం. ఆయన కథలు ముగిసినా, మన గుండెల్లో స్క్రీన్ ప్లే ఆగదు.
తిరైకథై మన్నన్... స్క్రీన్ ప్లే సింహాసనానికి ఎప్పటికీ నువ్వే రాజువి... వెళ్లి రా.
తల్లి కోసం ఒక ప్రతిజ్ఞ
ఇది భాగ్యరాజా సెంటిమెంట్. భాగ్యరాజా మొదటి సినిమా రిలీజ్‌ను కూడా చూడకుండా కేవలం కొన్ని రోజుల ముందే చనిపోయింది తల్లి. భాగ్యరాజా చాలా బాధపడ్డాడు. అంతే కాదు... తన సినిమాల్లో తల్లిదండ్రుల మరణాన్ని చూపకూడదని నిర్ణయించుకున్నాడు. ‘తల్లిదండ్రులు మరణిస్తే పిల్లలకు ఎంత బాధో నాకు తెలుసు. ప్రేక్షకులకు ఆ బాధ కలిగించను’ అని అలాగే పాటించాడు. 49 ఏళ్లుగా, 75 సినిమాల్లో ఒక్కసారి కూడా తల్లిదండ్రుల మరణం చూపించలేదు. వరల్డ్ సినిమాలోనే రేర్. ఇది ఆయన మనిషితనానికి నిదర్శనం.
– కె


