దండెత్తిన క్యాన్సర్‌పై ధ్యానమే సైన్యంగా... | Treat cancer only Yoga and Meditation | Sakshi
Sakshi News home page

దండెత్తిన క్యాన్సర్‌పై ధ్యానమే సైన్యంగా...

Published Fri, Nov 29 2024 1:01 AM | Last Updated on Fri, Nov 29 2024 1:01 AM

Treat cancer only Yoga and Meditation

క్యాన్సర్‌పై పోరాటం

నేను మూడుసార్లు క్యాన్సర్‌ బారిన పడ్డాను. 2003లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌. 2022లో బ్రెయిన్‌ క్యాన్సర్‌. 2024లో మళ్లీ బ్రెయిన్‌ క్యాన్సర్‌. నా వయసు 70 ఏళ్లు. క్యాన్సర్‌పై గెలుస్తూనే ఉన్నాను. యోగా, ధ్యానం మనలోని శక్తులను బయటకు తీసి స్థిరంగా ఉంచుతాయి. ధ్యానం నాకు ఆయుధంగా పని చేసింది. క్యాన్సర్‌ అనగానే కంగారు పడతారు. చికిత్స తీసుకుంటూ పోరాడొచ్చు.. గెలవొచ్చు. క్యాన్సర్‌ వచ్చిన వారి వద్దకు వెళ్లి ఆ విషయమే చెప్పి కౌన్సెలింగ్‌ చేస్తుంటా’ అంటున్న హైదరాబాద్‌కు చెందిన నల్లూరి నిర్మల పరిచయం.

‘యోగా మన శరీరానికి ఉండే శక్తుల్ని వెలికి తీస్తే ధ్యానం మన మనసుని నిశ్చలం చేస్తుంది. క్యాన్సర్‌ వంటి జబ్బులను ఎదుర్కొనడానికి శరీర బలం ఎంత అవసరమో అంతకంటే ఎక్కువగా మానసిక బలం అవసరం. క్యాన్సర్‌ అనగానే చాలామంది ఆందోళన చెందిన మనసును తద్వారా శరీరాన్ని బలహీన పరుచుకుంటారు. అప్పుడు వైద్యం అనుకున్నంత సమర్థంగా పనిచేయదు. అందుకే నేను నా జీవితంలో క్యాన్సర్‌ను ఎదుర్కొనడానికి యోగా, ధ్యానాలను ఆశ్రయించాను. చికిత్స సమయంలో శరీరం బలహీనంగా ఉంటుంది కనుక అన్నిసార్లు యోగా చేయలేము. కాని ధ్యానం చేయవచ్చు. 

నేను ధ్యానం వల్ల చాలా మటుకు అలజడిని దూరం చేసుకున్నాను. అందుకే పల్లెల్లో స్త్రీలకు అప్పుడప్పుడు యోగా, ధ్యానం గురించి ప్రచారం చేశాను. ఇక ఇప్పుడు చేస్తున్నదేమిటంటే క్యాన్సర్‌ బారిన పడిన వాళ్లను కలిసి వారి ఆందోళన దూరం చేయడం. నన్ను వారికి చూపించి నేను ఎదుర్కొన్నానంటే మీరూ ఎదుర్కొనగలరని ధైర్యం చెప్పడం. యోగా, ధ్యానాలను ఎలా చికిత్సలో భాగం చేసుకోవాలో సూచించడం’ అన్నారు 70 ఏళ్ల నల్లూరి నిర్మల. ఆమెను చూసినా, ఆమెతో మాట్లాడినా తీవ్ర అనారోగ్యాలలో ఉన్న వారు కచ్చితంగా ధైర్యం తెచ్చుకోగలరని అనిపిస్తుంది. ఆమె అంత ప్రశాంతంగా, దిటవుగా కనిపిస్తారు.

చిన్నప్పటి నుంచి సవాళ్లే
నల్లూరి నిర్మలది ప్రకాశం జిల్లా. ఆమె తండ్రి నల్లూరి అంజయ్య ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. వీరిది కమ్యూనిస్టు కుటుంబం. ఆడపిల్లలకు చదువు ముఖ్యమని తమ గ్రామంలోనే ఒక ప్రైవేటు పాఠశాల స్థాపించాడాయన. అలా నిర్మల చదువుకొని జీవిత బీమా సంస్థలో, తర్వాత కమర్షియల్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో, ఆ తర్వాత కోటీలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో స్టెనోగ్రాఫర్‌గా పని చేశారు. 

1977 నుంచి 2014 వరకు దాదాపు 37ఏళ్ళు అదే బ్యాంకులో పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. అయితే నిర్మల చిన్నప్పటి నుంచి ఆరోగ్యపరమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. వివాహమై ఇద్దరు పిల్లలు పుట్టాక గర్భసంచి తీసేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 2003లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బారిన పడ్డారు. ‘ఆ సమయంలో నా భర్త వ్యాపార పరమైన నష్టాలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు నా అనారోగ్యం. అయినా సరే ఆ ఒత్తిడిని, ఈ ఒత్తిడిని ఎదుర్కొని బ్రెస్ట్‌ క్యాన్సర్‌ని జయించాను’ అని చెప్పారు నిర్మల. 
   
మరో రెండుసార్లు దాడి
క్యాన్సర్‌ను జయించానని భావించిన నిర్మలను మరలా ఆ జబ్బు వెంటాడింది. 2022 లో బ్రెయిన్‌ క్యాన్సర్‌ నిర్మల శరీరంలోకి ప్రవేశించింది. మొదటిసారి తట్టుకున్నంతగా నిర్మల గారి శరీరం రెండవసారి తట్టుకోలేకపోయింది. అయినా తన మానసిక శక్తితో దాన్ని ఎలా అయినా ఓడించాలన్న సంకల్పంతో క్యాన్సర్‌ను తోక ముడుచుకునేలా చేశారామె. కాని మూడవసారి 2024లో మరలా బ్రెయిన్‌ క్యాన్సర్‌ తిరగబెట్టింది. ఇప్పుడు 70 ఏళ్ళ వయసులో కూడా నిర్మల దానితో పోరాటం చేస్తూనే ఉన్నారు.

 ఈ పోరాటానికి ఒక ఆయుధంగా ‘ప్రకృతి యోగా అండ్‌ నేచర్‌ క్యూర్‌’ని నిర్మల ఎంచుకున్నారు. డాక్టర్‌ సరస్వతి దగ్గర నిర్మల యోగాలో శిక్షణ తీసుకున్నారు. దానివల్ల నిర్మల జీర్ణవ్యవస్థ మెరుగైంది. కొన్ని ఆరోగ్య సమస్యలు నెమ్మదించాయి.  నిర్మల పూర్తిస్థాయి శిక్షణ తీసుకుని అందరికీ ఆరోగ్యం మీద అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో యోగా క్యాంపులు నిర్వహించారు. ఇంటి దగ్గర కూడా యోగా తరగతులు నడిపారు. అలా ‘క్యాన్సర్‌’పై పోరాడుతూ యోగా–ప్రకృతి–ధ్యానం సమన్వయంతో జీవితాన్ని మళ్ళీ ఆరోగ్య పథంలోకి మళ్లించారు. 
  
స్త్రీలకు ఇంటా బయటా సమస్యలే
‘స్త్రీలకు ఇంటా బయటా సమస్యలే. ఆ సమస్యలను చూస్తూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా చేయొద్దని నేను కోరుతున్నాను. కుటుంబానికి సంబం«ధించి ఎన్ని బాధ్యతలున్నా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. ఆత్మన్యూనతా భావం విడనాడి ధైర్యంగా మసలుకోవాలి, ధ్యానం మీకు దారి చూపిస్తుంది’ అంటారామె.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement