
నూతన సంవత్సరం వచ్చిందంటే ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం సర్వసాధారణం. కాని, థాయిలాండ్‌లో మాత్రం న్యూ ఇయర్ వచ్చిందంటే నీటి యుద్ధమే జరుగుతుంది. అయితే ఇది కొట్లాట కాదు, నీటి కోలాటం. ప్రత్యేకమైన థాయ్ సంప్రదాయ నృత్యాలతో, రంగురంగుల నీళ్లతో ఈ పండుగ సాగుతుంది.
జనాలంతా రోడ్ల మీదకు వచ్చి, ఒకరికొకరు తెలిసినా తెలియకపోయినా ఒకరిపై ఒకరు నీళ్లు పోసుకుంటూ న్యూ ఇయర్ వేడుకను జరుపుకుంటారు. ఈ వాటర్ ఫైట్ ఫెస్టివల్‌ని స్థానికంగా ‘సాంగ్‌క్రాన్’ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 13 నుంచి 15 వరకు వరుసగా మూడు రోజులు
ఈ సంబరాలు జరుగుతుంటాయి. ఈ ఉత్సవాల్లో ఏనుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మావటుల సమక్షంలో వాటి తొండాలతో నీళ్లను జల్లుతూ ఆశీర్వదిస్తాయి.ఈ వేడుక సనాతన ఆచారం నుంచి ఉద్భవించిందని చెబుతారు. ఆ మూడు రోజులను, పాపాలను కడుక్కోవడానికి నదీస్నానం చేసే మతపరమైన రోజులుగా భావిస్తారు.
వృద్ధులు, వైకల్యంతో ఉన్నవారి కోసం తమ కుటుంబ సభ్యులు నది నుంచి నీటిని తెచ్చి వారిపై పోస్తారు. అయితే ప్రతిఒక్కరూ మొదటిగా బుద్ధుడిపై నీళ్లు పోసి, నమస్కరించి, ఈ వేడుకలో పాల్గొంటారు. నీళ్లతో అరిష్టాలు కొట్టుకుపోతాయని, నూతన వైభవం తిరిగి వస్తుందని విశ్వసిస్తారు.
ప్రతిసంవత్సరం సాంగ్‌క్రాన్ వేడుకకు కొన్ని రోజుల ముందు, దేవుడు భూమిపైకి వస్తాడని అక్కడివారు నమ్ముతారు. వచ్చేముందు దేవుడు తన చేత్తో ఆయుధాన్ని తెస్తే యుద్ధం వస్తుందని, కాగడాను తెస్తే కరువు వస్తుందని ఇలా కొన్ని లెక్కలు కట్టి, మత పూజారులు జోస్యం చెబుతారు.
దాని బట్టే జరగబోయే ప్రమాదాలను ఆపాలని ప్రజలంతా దేవుణ్ణి పూజిస్తారు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్, చియాంగ్ మై, ఫుకెట్ వంటి ప్రముఖ పట్టణాల్లో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వాటర్ గన్‌లతో, బకెట్స్‌తో నీళ్లను జిమ్ముతూ అక్కడి ప్రజలంతా ఈ మూడురోజులు చాలా ఆనందంగా గడుపుతారు.
(చదవండి: మునకానందం..మహదారోగ్యం..!)