ఫీజు కోసం ఎద్దుని అమ్మి... | The Sweet Memories Spent With Father Sakshi Special Story | Sakshi
Sakshi News home page

ఫీజు కోసం ఎద్దుని అమ్మి...

Jun 19 2026 9:41 AM | Updated on Jun 19 2026 1:59 PM

The Sweet Memories Spent With Father Sakshi Special Story

hi నాన్న...

కాలం వక్రిస్తే ఓడలు బళ్లవుతాయి అంటారు. ఆ మాట మా కుటుంబానికి సరిగ్గా సరిపోతుంది. వారసత్వంగా వచ్చిన 300 ఎకరాల భూమి అకస్మాత్తుగా ఆవిరైపోతే..? బెదరకుండా పరిస్థితులకు బెదిరిపోకుండా మొండితనంతో వ్యవసాయాన్నే నమ్ముకున్నాడు మా నాన్న లక్షీనరసింహరావు. అది 1972 తీవ్రమైన కరువు..ఇంట్లో అమ్మతో పాటు నేను నా ఇధ్దరు తమ్ముళ్లు, ఒక చెల్లెలు. ఆకలి మంటలు మొదలయ్యాయి.

వరి గింజ లేక వణుకు పుట్టింది. తప్పనిసరి పరిస్థితుల్లో దేవదారు ఆకులు తినిపించి మా ప్రాణాలను కాపాడాడు మా నాన్న..పొద్దున్నే 4 గంటలకు నిద్రలేచి కూలి పనులకు వెళ్లడం, వ్యవసాయాన్ని చూసుకోవడం కాస్త సమయం ఉంటే మాతో గడపడం. రోజుకి 18 గంటలు పొలంలోనే గడిపేసిన రోజులు లెక్కలేనన్ని.. అయినా ఎప్పుడూ ఆయన ధైర్యాన్ని కోల్పోలేదు. మా చదువుల్ని మాన్పించలేదు. ఏది కావాలన్నా వెనకడుగు వేయలేదు.

కాని నేను డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నప్పుడు పరీక్ష ఫీజు కట్టాల్సి వచ్చింది. కరువు పరిస్థితులు ఇంకా కుదురుకోలేదు.. ఇంట్లో దమ్మిడీ లేని పరిస్థితి. చదువుకి ఇక స్వస్తి చెప్పినట్టేనని అనుకున్నా. కాని మా నాన్న చేసిన పనిని నేను జీవితంలో మరిచిపోలేను. అసలే కరువు పరిస్థితులు, అప్పు కూడా పుట్టని రోజులు, ఉన్నవే రెండు కాడెద్దులు..అందులో ఒక ఎద్దుని 370 రూపాయలకు అమ్మేశాడు మా నాన్న.. 170 పరీక్ష ఫీజు పోను మిగిలిన 200 రూపాయలతో మరొక బక్క ఎద్దుని కొన్నాడు.

దాన్ని కాస్త మేపి కాడి దున్ని వ్యవసాయం చేద్దామని అనుకున్నాడు. కాని వారం తిరక్కముందే అది కాస్తా చనిపోయింది. మా నాన్న ఆశ తిరగబడింది. అసహనం, అశక్తత ఆవహిస్తే ఏ మనిషైనా కుంగిపోక తప్పదు కాని మా నాన్న మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. మరింత కష్టపడ్డాడు. పరిస్థితులు అనుకూలించాయి. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఈరోజు నేను నా తమ్ముళ్లు, చెల్లెలు అందరూ ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో రాణించినా, మా వంశ పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొచ్చినా అదంతా కష్టాలకు వెన్నుచూపని మా నాన్న గుండె చలవే. 

- జగపతిరావు విశ్రాంత అధ్యాపకులు, మహబూబ్‌నగర్‌ జిల్లా

తండ్రి లక్షీనరసింహారావు

---
పచ్చ ఇంకు కలం సాకారమైంది!
మా స్కూల్‌ హెడ్మాస్టర్‌ జేబులో ఓసారి పచ్చ ఇంకు పెన్ను  చూసి మా నాన్న ఏదో ఒకరోజు నువ్వు కూడా అలాంటి పెన్ను జేబులో ఉంచుకునే స్థాయికి వెళ్లాలిరా అన్నాడు. ఆయన చదువుకోలేదు.. కాని ఆయన బిడ్డ మాత్రం అందరూ గౌరవించే స్థాయిలో ఉండాలన్నదే ఆయన ఆశ. అదే నాలో పట్టుదల రేకెత్తించింది. అహర్నిశలు శ్రమించేలా చేసింది.

ఈ లక్షణం కూడా మా నాన్న భవనం వెంకటేశ్వర్లు నుంచి వచ్చిందే. అర ఎకరం భూమి మాత్రమే వారసత్వంగా వచ్చినా చెమటోడ్చి వ్యవసాయం చేసి 30 ఎకరాల ఆసామిగా మారాడు మా నాన్న. ఆయనే నాకు తొలి గురువు. 21 ఏట ప్రభుత్వ ఉపాధ్యాయుడికి చేరినా, నాన్న చెప్పిన మాట మాత్రం మర్చిపోలేదు. ఎంఏ, బీఈడీ పూర్తి చేసి గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుడి హోదాను పొందాను. మా నాన్న కలను సాకారం చేశాను. ఆయన సేవా గుణాన్ని స్పూర్తిగా తీసుకుని 24 లక్షల వెచ్చించి పాఠశాలను అభివృద్ధి చేశాను.

- భవనం బద్రిరెడ్డి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, వేటపాలెం, బాపట్ల

తండ్రి భవనం వెంకటేశ్వర్లు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement