Sundar Pichai: సిఈఓలు యవ్వనంగా ఉండాలంటే..! | Sundar Pichai met his IIT batchmate monk who looked younger | Sakshi
Sakshi News home page

సిఈఓలు యవ్వనంగా ఉండాలంటే..! సుందర్‌ పిచాయ్‌కి కలిగిన సందేహం

Jun 24 2025 5:18 PM | Updated on Jun 25 2025 10:03 AM

Sundar Pichai met his IIT batchmate monk who looked younger

ప్రముఖుల సంభాషణల్లో గొప్ప గొప్ప సందేశాలు అలవోకగా దొర్లుతాయి. బహుశా అందుకే కాబోలు యువతను గొప్ప గొప్ప వ్యక్తుల ఉపన్యాసాలను వినమని సూచిస్తుంటారు. ఇదంతా ఎందుకంటే..ఇండియా గ్లోబల్ ఫోరం 2025లో ఇస్కాన్ సన్యాసి గౌరంగ దాస్ స్పీచ్‌ ఒక గొప్ప సందేశాన్ని అందించడమే గాక యువతకు కనువిప్పు కలిగించింది. అంతేగాదు ఈ ఆధునిక సాంకేతికత, డిజిటల్‌ యుగం మనల్ని ఏవిధంగా ఏమార్చాతున్నాయో కళ్లకు కంటినట్లు చూపించాయి ఆ సన్యాసి మాటలు.

అసలేం జరిగిందంటే..లండన్‌లో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరం 2025లో ఇస్కాన్ సన్యాసి గౌరంగ దాస్  మాట్లాడుతూ..తన బ్యాచ్‌మేట్‌ గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్‌తో జరిగిన సంభాషణను షేర్‌ చేసుకున్నారు. ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడానికి  ఇంజనీరింగ్ వృత్తిని విడిచిపెట్టిన ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్ గౌరంగ దాస్‌, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ఇద్దరు క్లాస్‌మేట్‌లు. 

అదే ఐఐటీ బ్యాచ్‌లోవారి బ్రాంచ్లు వేరే అయినా..ఇద్దరూ స్నేహితులు. అయితే కళాశాలలో తామిద్దరం ఒకరికొకరు తారసపడటం అత్యంత అరుదుగా ఉండేదన్నారు. కానీ ఇటీవలే చాలా ఏళ్ల తర్వాత తామిద్దరం కలుసుకుని చాలాసేపు ముచ్చటించుకున్నట్లు తెలిపారు. అయితే తన స్నేహితుడు పిచాయ్‌ నువ్వు నాకంటే చిన్నవాడిలా యంగ్‌గా కనిపిస్తున్నావని ప్రశంసించినట్లు గుర్తుచేసుకున్నారు. 

దీనికి గౌరంగ దాస్‌ స్పందిస్తూ..సుందర్ పిచాయ్ "ఒత్తిడిని సృష్టించే" గూగుల్‌తో వ్యవహరిస్తాడని, తాను ఒత్తిడిన మాయం చేసే ఆధ్యాత్మికతతో మమేకం అవుతున్నానని సమాధానమిచ్చారు. ఆ సదస్సులో గౌరంగ దాస్‌ పంచుకున్న కథ ఒక్కసారిగా డిజిటల్‌ వ్యసనం మనుషులను ఎలా బానిసలుగా మారుస్తుందో తెరపైకి వచ్చింది. దాని ప్రభావం వల్ల మానసిక ఆరోగ్యం ఎలా క్షీణిస్తుందో అనే దానిపై అవగాహన కలిగించేలా చేసింది. 

ఇక సన్యాసి గౌరంగ దాస్ కూడా అధిక స్క్రీన్ సమయం,సోషల్ మీడియా వాడకంతో పెరుగుతున్న మానసిక సమస్యల గురించి కూడా వివరించారు. పంచవ్యాప్తంగా 230 మిలియన్ల మంది ప్రజలు సోషల్ మీడియాకు బానిసలయ్యారని నివేదికలు చెబుతున్నాయన్నారు. 

భారతదేశంలోనే, 70% మంది టీనేజర్లు ప్రతిరోజూ ఏడు గంటలు ఆన్‌లైన్‌లో గడుపుతున్నారని, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడుగురిలో ఒకరు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని చెప్పుకొచ్చారు. ఒత్తిడిని తగ్గించుకునేలా చక్కటి మార్గాల తోపాటు కాసేపు మనతో మనం గడిపేలా చక్కటి ధ్యానం వంటివి చేస్తే..మానసికంగానే కాకుండా శారీరకంగానూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు గౌరంగ దాస్‌.

 

(చదవండి: నటి సమంత ఆరోగ్య చిట్కాలు.. డయాబెటిస్‌ పేషెంట్లు ఇలా చేశారంటే..)

 

Advertisement
 
Advertisement
Advertisement