
హైదరాబాద్ నగరం మరోసారి నవ్వుల పండుగకు వేదిక కానుంది. డిజిటల్ హాస్య తార ‘అయ్యో శ్రద్ధా’గా గుర్తింపు పొందిన శ్రద్ధా జైన్ తన అద్భుత స్టాండప్ కామెడీ షో ‘సో మినీ థింగ్స్’ పేరుతో దేశంలో చివరి సారి ప్రదర్శించనుంది. ఈ హృద్యమైన వినోద యాత్ర ఈ నెల 27న హైటెక్ సిటీలోని శిల్పకళా వేదిక ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇస్తోంది. ఈ ప్రదర్శన కేవలం వినోదం మాత్రమే కాదు.. భారతీయ కుటుంబ జీవనాన్ని, మన ఊహల్ని, నిత్యజీవితంలో మినీ మినీ కహానీలను పరిపూర్ణంగా హాస్యంగా మలిచే ఓ అనుభూతిని ప్రదర్శించనుంది.
శ్రద్ధా కామెడీ మాయాజాలం మానసిక అంతర్భావాల పరంగా అద్భుతంగా ఉంటుందని అభిమానుల మాట. ఓ చిన్న పిల్లవాడిలా జిజ్ఞాసతో, అమాయకంగా ఆలోచించే తత్వం ఆమె పండించే ప్రతి కథనంలో కనిపిస్తుంది. ‘సో మినీ థింగ్స్’ అనే పేరు కూడా ఆమె ప్రదర్శనలోని మినీ కథలు, మినీ ఎమోషన్స్, మినీ వెర్షన్లకు అద్దం పట్టినట్లే ఉండనుంది. భారతీయ కుటుంబాల్లోని సరదా సంభాషణలు, అపరిచిత సందర్భాల్లో తలెత్తే హాస్యాన్ని తన ప్రత్యేక శైలిలో మలచి ప్రేక్షకులకు అందించడం ఆమె ప్రత్యేకత. ఈ ప్రదర్శనకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న లైవ్‌ట్రీ ఎంటర్‌టైన్మెంట్ సంస్థ సోను నిగమ్, హరిహరన్ వంటి సంగీత దిగ్గజాల లైవ్ షోల వేదికగా నిలిచింది. ప్రస్తుతం శ్రద్ధా షోను ప్రపంచవ్యాప్తంగా 45 నగరాల్లో ప్రదర్శించి, ఇప్పుడు చివరగా భారత్‌లో ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే పుణె, ఢిల్లీ వంటి నగరాల్లో భారీ ప్రేక్షకాభిమానంతో ప్రారంభమైన ఈ చివరి టూర్, ముంబై, చెన్నై, హైదరాబాద్ షోతో ముగుస్తుంది.
ఈ సందర్భంగా సీఈఓ శరత్ వత్సా మాట్లాడుతూ.‘దాదాపు 90 నిమిషాలు ప్రేక్షకులు నవ్వుల ప్రపంచంలో మునిగి తేలాక వారి మనసు తేలికపడి, హృదయాన్ని హత్తుకునే అనుభూతితో బయటికి రావడం.. ఇదే మాకు సంతృప్తి. 2024లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ‘మోస్ట్ క్రియేటివ్ క్రియేటర్ – ఫిమేల్’ అవార్డును అందుకున్న ఈ ఇంజినీర్, ఆర్జే, కంటెంట్ క్రియేటర్ ప్రస్తుతం కామెడీ ప్రపంచానికి ఒక మైలు రాయిలా మారిపోయింది’ అని తెలిపారు.