
ఆమె 73 ఏళ్ల ముదుసలి. జాతీయ పతాకాన్ని ఎత్తిపట్టి ‘వందేమాతరం’, ‘ఆంగ్లేయులారా! ఇండియాను వదిలి వెళ్లండి’ అంటూ నినాదాలు చేస్తూ ఆరువేల మందితో ఒక పోలీస్ స్టేషన్‌ను ఆక్రమించేందుకు శాంతియుతంగా దండయాత్ర చేస్తోంది. పోలీసులు గాలిలోకి కాల్పులు జరి పారు. అయినా ఆమె ముందుకే కదిలింది. ఈసారి జెండా పట్టుకున్న చేతిని గురిచూసి కాల్చారు. వెంటనే రెండో చేతిలోకి జెండాను మార్చుకుని మునుముందుకు దూకింది. దీంతో పోలీసులు రెచ్చిపోయారు. ఆమె రెండో చేతి పైనా, నుదుటి పైనా కాల్పులు జరిపారు. తెల్లని ఖద్దరు చీర రక్తసిక్తమయ్యింది. ఆ బక్కచిక్కిన వృద్ధ యోధ కుప్పకూలింది – కానీ జెండాను మాత్రం కిందపడకుండా గుండెలకు హత్తుకునే!
1942 సెప్టెంబర్ నాలుగవ వారంలో చోటు చేసుకున్న ఈ బలిదానం గురించి నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉంది. ‘వృద్ధ మహిళా గాంధీ’ (గాంధీ బురి)గా పేరుగాంచిన ఆమె పేరు మాతంగినీ హజ్రా (Matangini Hazra). 1869లో బెంగాల్‌లోని హొగ్లా గ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించిన ఆమెకు పన్నెండేండ్లకే వివాహం చేశారు. కానీ 18 ఏండ్లకే వితంతువయ్యింది. పిల్లలు లేని ఆమె సమాజ సేవ, దేశ సేవకే తన జీవితాన్ని అంకితమిచ్చింది. ఆమెకు చదువు లేదు. అయినా గాంధీజీ బోధనలకు ఆకర్షితురాలయ్యింది. ఆయన చెప్పినట్లే జీవించింది. 1930లలో శాసనోల్లంఘన ఉద్యమంతో పాటు మిగతా ఉద్యమాల్లోనూ పాల్గొని జైలుకెళ్లింది.
భారత జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ పాలనకు ముగింపు పలకాలని 1942 ఆగస్ట్ 8న ‘క్విట్ ఇండియా’ (ఇండియా వదిలి వెళ్లండి) ఉద్య మాన్ని ప్రారంభించింది. గాంధీజీ ‘డూ ఆర్ డై’ (విజయమో, వీరస్వర్గమో) అంటూ ఉద్య మాన్ని ఉరకలెత్తించారు. ఈ ఉద్యమ సమయా నికి మాతంగినికి 73 ఏండ్లు. బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాలో ఉద్యమానికి సరైన నాయకత్వం అందించే గాంధీవాదులు లేకపోవడంతో ఈ ఉద్యమం ప్రజల తిరుగుబాటుగా మారింది. బ్రిటిష్ అధికారాన్ని నేరుగా సవాలు చేసే సమాంతర ప్రభుత్వాన్ని లేదా ‘జాతీయ సర్కా ర్’ను తామ్లుక్‌లో ‘సమర్ పరిషద్’ ఏర్పాటు చేసింది. మాతంగినీ పక్కా గాంధేయవాదే కానీ ఈ తిరుగుబాటుదారుల్లో ఒకరుగా మారారు.
పోలీస్‌స్టేషన్‌పైకి దండయాత్ర
1942 సెప్టెంబర్ 29న తామ్లుక్ పోలీస్ స్టేషన్ (అప్పట్లో సెయ్లన్ స్క్వేర్)పై నియంత్రణ సాధించడానికి తామ్లుక్ జాతీయ సర్కార్ ఒక నిరసన మార్చ్ నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఇది బ్రిటిష్ అధికారంపై ప్రత్యక్ష తిరుగుబాటే! పోలీస్ స్టేషన్‌పై భారత జాతీయజెండాను ఎగురవేయడానికి వేలాదిమందితో (వీరిలో ఎక్కువమంది స్త్రీలు) మాతంగినీ బయలుదేరింది. పోలీస్ స్టేషన్ ఉన్న ఊరు సమీపానికి ఆమె తన అనుయాయులతో చేరుకున్నప్పుడు, యూరోపియన్ అధికారుల ఆధ్వర్యంలోని బ్రిటిష్ ఇండియన్ పోలీసు దళాలు అడ్డంగించాయి. అయినా ముందుకే కదలడంతో పోలీసులు కాల్పులు జరిపారు.
ఆమె ‘వందేమాతరం’ నినాదం చేస్తూనే కుప్పకూలిపోయింది. ఆమె పక్కనే మార్చ్ చేస్తున్న ఇద్దరు యువకులు సఖావత్ అలీ, సతీష్ చంద్ర సామంతా పైనా పోలీసులు కాల్పులు జరపడంతో వారూ వీర మరణం పొందారు. మాతంగినీ హజ్రా భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అత్యంత ధైర్యవంతురాలిగా చరిత్ర లిఖించారు. తామ్లుక్‌లో ఆమె బలిదానం జరిగిన చోట ఆమె విగ్రహాన్ని ప్రతి ష్ఠించారు. ప్రస్తుతం ఉన్న తామ్లుక్ పోలీస్ స్టేషన్ పేరు ‘మాతంగినీ హజ్రా పోలీస్ స్టేషన్‘గా మార్చారు. భారత ప్రభుత్వం 2002లో ఆమె గౌరవార్థం ఒక తపాలా బిళ్లను జారీ చేసి తనను తాను గౌరవించుకుంది.