
బాలీవుడ్ సూపర్ గాయని శ్రేయ ఘోషల్ (Shreya Ghoshal) తన మధురమైన గాత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది అభిమానులను సంపాదించుకుంది. అనేక భాషల్లో తన స్వరంతో సంగీతాభిమానులు ఉర్రూతలూగించింది. తాజాగా తన గానంతో కడుపులో ఉన్న బిడ్డను కూడా కదిలించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్ వైరల్‌గా మారింది.
ఆమ్‌స్టర్‌డామ్ లోని ‘‘ఆల్ హార్ట్స్ టూర్’’ సందర్భంగా తన వీరాభిమానిని కలిసింది శ్రేయా ఘోషల్. గర్భిణి అయిన అభిమాని ముందు మోకాళ్లపై కూర్చుని, ఆమె గర్భంపై తన చేతిని సున్నితంగా ఉంచి, పుట్టబోయే బిడ్డ కోసం జోలపాట పాడటం విశేషం. పరిణీత చిత్రంలోని "పియు బోలే సాంగ్‌ను మంద్రంగా ఆలపించింది. అంతే గర్భస్థ శిశువు పరవశంతో కదిలిందిట. ఆ సమయంలో అభిమానితో పాటు శ్రేయ కూడా ఆనందంలో మునిగిపోయింది. ఈ వీడియో నెట్టింట అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.
లక్కీ బేబీ అంటూ ఫ్యాన్స్ కమెంట్ చేశారు. ‘డివైన్ వాయిస్ ఆ బిడ్డను ఆశీర్వదించింది’ అని ఒకరు, ‘ఓహ్..ఆ పుట్టబోయే బిడ్డకు ఎంత అదృష్టం’ అని మరో అభిమాని వ్యాఖ్యానించడం విశేషం."శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః" అని ఇదేనేమో!
ఇదీ చదవండి: ట్విన్స్‌కు జన్మనివ్వబోతున్నా.. నా బిడ్డలకు తండ్రి లేడు : నటి భావోద్వేగ పోస్ట్