ఆర్ట్ అండ్ కల్చర్
స్త్రీలలోని విప్లవాత్మక స్వభావానికి పులి
పేరుకు రష్యన్ ఆర్టిస్ట్ అయినప్పటికీ జూలియా ఉస్మానోవాకు మన దేశంలోని ఎన్నో నగరాలు సుపరిచితం. తాజా విషయానికి వస్తే... దిల్లీలోని బికనీర్ హౌస్‌లో తన పెయింటింగ్‌లతో ప్రదర్శన ఏర్పాటు చేసింది.
ఇంతకీ ఆమె కళాకృతులలో ఉన్నదేమిటి? ఒక్క ముక్కలో చెప్పాలంటే... భారతీయ ఆత్మ! మహిళల అలంకరణ, ప్రకృతి, జీవన అనుభవాలు జూలియ చిత్ర ఇతివృత్తాలు. ఈ ఇతివృత్తాలను తన రష్యన్ మూలాలతో కలపడం ఆమె ప్రత్యేకత.

జూలియ తాజా సిరీస్ ‘బైలేటరల్ లేయరింగ్స్’ కు కళాభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. వివిధ సంస్కృతులు, సంప్రదాయాలు, యువ భారతీయ మహిళల వస్త్రధారణ... ఆమె గీసిన చిత్రాలలో కనువిందు చేస్తాయి. మల్లెపువ్వులు, పక్షులు, సంప్రదాయ ఆభరణాలు, నేత వస్త్రాలు... ఇలా ఎన్నో అంశాలు జూలియ ఉస్మానోవ చిత్రాలలో కనిపిస్తాయి. స్త్రీలలోని విప్లవాత్మక స్వభావానికి పులిని ప్రతీకగా వాడుకుంది జూలియా. ఇలాంటి ప్రతీకలెన్నో ఆమె చిత్రాలలో కనిపిస్తాయి.


