
రామాయణంలో కుంభకర్ణుడి సంగతి అందరికీ తెలిసిందే! కుంభాలకు కుంభాలు భోంచేశాక శుభ్రంగా ఆరునెలల పాటు ఏకధాటిగా గుర్రుపెట్టి నిద్రపోయేవాడు. సుదీర్ఘకాలం నిర్విరామంగా నిద్రపోవాలంటే, ఎంతటి బద్ధకస్తులకైనా సాధ్యమయ్యే పనికాదు. అయితే, నాగపూర్‌లో పుర్ఖారామ్ అనే వ్యక్తిని మాత్రం అక్కడి జనాలు కలియుగ కుంభకర్ణుడని అంటున్నారు. అతగాడు ఒకేసారి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల పాటు నిర్విరామంగా నిద్రపోగలడట! ఆయనకు ‘యాక్సిస్ హైపర్‌సోమ్నియా’ అనే అరుదైన నిద్ర వ్యాధి ఉంది. ఈ వ్యాధి కారణంగా శరీరం క్రమంగా అలసిపోతుంది, మెదడు వేకప్ బటన్‌నే మరచిపోతుంది.
ఈ వ్యాధి ఫలితంగానే పుర్ఖారామ్‌కు నిద్రే జీవితం అయ్యింది. ఇలా ఇతను ఒక సంవత్సరం మొత్తంలో 300 రోజులు నిద్రలోనే గడిపేస్తాడు. ఇతడి కథ విన్నవారు ‘ఒకవైపు ప్రపంచం రోజుకు 8 గంటల నిద్ర తప్పనిసరి అని పోరాడుతుంటే, ఇతనికి మాత్రం నిద్రలోనే జీవితం గడిచిపోతోంది’ అంటూ ఆశ్చర్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇతడి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, నిద్ర సంబంధ వ్యాధులపై అనేక చర్చలు మొదలయ్యాయి.