
గోరటి వెంకన్న(GoratiVenkanna) సుప్రసిద్ధ వాగ్గేయకారుడు. పరిచయం అక్కర లేని పేరు. ఆట పాటలతో తెలుగువాళ్లందరినీ తన్మయీభూతంగా అలరిస్తున్న ప్రజాకవి. ‘హంస’ అవార్డు గ్రహీత. ‘కాళోజీ పురస్కార’ సన్మానితులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు గౌరవం ఇనుమడింపజేసిన లిటరరీ లెజెండ్. తెలుగుజాతి గర్వంగా చెప్పుకోదగిన పాటలు రాశారు, రాస్తున్నారు. ‘అల సెంద్రవంక’, ‘వల్లంకి తాళం’, ‘ఏకునాదం మోత’, ‘రేల పూతలు’, ‘పూసిన పున్నమి’ వంటి పాటల సంపుటాల్లో దేన్ని చదువుకున్నా గోరటి వెంకన్న పాటకళ, పాటకథ కాంతులీనుతూ రసరంజకంగా మన కళ్లముందు సాక్షాత్కరించగలవు.
ముఖ్యంగా గ్లోబలైజేషన్‌ను తీవ్రస్వరంతో నిరసిస్తూ వెంకన్న రాసిన ‘పల్లె కన్నీరు పెడుతుందో’ పాట మాస్ పాపులారిటీ చెప్పనక్కర లేదు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఘోరంగా ఓడిపోయేలా తెలుగు ఓటర్లు తెలి విడిని ప్రదర్శించడానికి కారణభూతమైన ఒక హిస్టారికల్ సాంగ్ అది. ‘వాగు ఎండిపాయెరో’, ‘నల్లతుమ్మ’, ‘సంత’, ‘అద్దాల అంగడి’, ‘కంచెరేగి తీపివోలె’, ‘యలమంద’, ‘గల్లీ సిన్నది గరీబోల్ల కత పెద్దది’, ‘ఇద్దరం విడిపోతె’, ‘తరమెల్లిపోతున్నదో’... ఇత్యాది పాటలన్నీ ప్రతి శ్రోతకూ కంఠోపాఠం. ఆద్య కళలో పురుడు పోసు కుని తాత ముత్తాతల నుంచి వ్యాప్తమవుతూ తనదాకా వచ్చిన వాగ్గేయకార సంప్రదాయాన్ని సామాజికం చేసిన పాటల కథకుడు, పాటతల్లి పెద్దకొడుకు వెంకన్న! దళిత బహుజన స్పృహ, తెలంగాణ అస్తిత్వచైతన్యం, మార్క్స్ – అంబేడ్కర్ తాత్విక ధార, గ్రామీణ వాదం కలగలసిన శోభాయమాన గేయకవిత్వం వెంకన్నది.
అమెరికన్ సంగీతవేత్త, పాటల కూర్పరి డేనియల్ జి. బ్రౌన్ వ్యాఖ్యానించినట్టు ఆయన పాటలు లాక్షణికత పాదపాదాన ఉట్టిపడుతూ కథాప్రధానం, సహజత్వం, జాను తెనుగు, నిర్దిష్ట వస్తువుతో కూడుకున్న విశిష్ట వస్తుగీతాలు. ‘ఎంత సల్లనిదమ్మ కానుగ నీడ/ ఎండ సెగనే ఆపె పందిరి చూడ/ తలపైన తడికోలె అల్లుకున్నాకులు/ తడిలేని వడగండ్ల తలపించు పూతలు/ నిలువు నాపరాయి తనువుల తనమాను/ ఇరిసిన విరగని పెళుసులేని మేను’ అంటూ వెంకన్న వర్ణించిన ‘కానుగ నీడ’ మనకో వైద్యోపనిషత్తు. ‘నోట మోదుగు సుట్ట నొసట నామంబొట్టు/ తలకు తుండు గుడ్డ మెడకు తులసి మాల/ ఏకుతారొక చేత సిరుతలింకొక చేత/ వేదాల చదువకున్న ఎరుక కలిగుండు/ రాగి బెత్తం లేని రాజయోగిలా ఉండు / ఆది చెన్నుడి అంశ మా నాయిన/ అపర దనుర్దాసు మా నాయన అంటూ పితృభక్తిని చాటుకున్న వెంకన్న పాట యువతకో జీవన నైపుణ్య పాఠం.
తాను పుట్టి పెరిగిన పాలమూరు, దాపున్న దుందుభి, కాలు కొద్ది అలుపు సొలుపెరుగక తిరిగిన ప్రదేశాలు, ప్రాపంచికానుభవం నుండి ’క్వాట్రైన్స్ రూపుదిద్దుకుంటవి. ఇందుకు ‘ధరాంతమున ధ్వనించె నాదం/ దిగంతాలకే తాకిన వాదం/ తెలంగాణ జయశంఖారావం/ దాశరథి ఘన కవనపు యాగం/ ఎందరో వీరుల ఆశల స్వప్నం’ అంటూ ఎత్తుకున్న తెలంగాణ ‘వైభవ గీతిక’ ఒక ప్రబల సాక్ష్యం. కాళోజీ సాహిత్య వారసుడిగా వెంకన్న తెలుగువాళ్లకు తెలంగాణకు చాలినంత రాజకీయ ప్రబోధ చేశారు.
అమెరికన్ పాటల సంప్రదాయంలో కొత్త కవితా వ్యక్తీకరణను సృష్టించినందుకు బాబ్ డిలన్‌కు స్వీడిష్ అకాడమీ నోబెల్ బహు మతినిచ్చింది. మరి, ఇంటా బయటా ఇరవై ఇరవై ఐదు కోట్లమంది ఆస్వాదించే తెలుగుపాటకు నూతన అభివ్యక్తితో పాటు సరికొత్త వస్తువునూ జోడించి, ఎపిక్ హోదా కల్పించిన వెంకన్నకు ఎన్ని నోబెల్స్ బాకీపడ్డాయో!
– డా.బెల్లి యాదయ్య
(గోరటి వెంకన్న రేపు అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుండి ‘గౌరవ డాక్టరేట్’ అందుకుంటున్న సందర్భంగా)