breaking news
BR Ambedkar Open University
-
పాటతల్లికి పెద్దకొడుకు
గోరటి వెంకన్న(GoratiVenkanna) సుప్రసిద్ధ వాగ్గేయకారుడు. పరిచయం అక్కర లేని పేరు. ఆట పాటలతో తెలుగువాళ్లందరినీ తన్మయీభూతంగా అలరిస్తున్న ప్రజాకవి. ‘హంస’ అవార్డు గ్రహీత. ‘కాళోజీ పురస్కార’ సన్మానితులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు గౌరవం ఇనుమడింపజేసిన లిటరరీ లెజెండ్. తెలుగుజాతి గర్వంగా చెప్పుకోదగిన పాటలు రాశారు, రాస్తున్నారు. ‘అల సెంద్రవంక’, ‘వల్లంకి తాళం’, ‘ఏకునాదం మోత’, ‘రేల పూతలు’, ‘పూసిన పున్నమి’ వంటి పాటల సంపుటాల్లో దేన్ని చదువుకున్నా గోరటి వెంకన్న పాటకళ, పాటకథ కాంతులీనుతూ రసరంజకంగా మన కళ్లముందు సాక్షాత్కరించగలవు. ముఖ్యంగా గ్లోబలైజేషన్ను తీవ్రస్వరంతో నిరసిస్తూ వెంకన్న రాసిన ‘పల్లె కన్నీరు పెడుతుందో’ పాట మాస్ పాపులారిటీ చెప్పనక్కర లేదు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఘోరంగా ఓడిపోయేలా తెలుగు ఓటర్లు తెలి విడిని ప్రదర్శించడానికి కారణభూతమైన ఒక హిస్టారికల్ సాంగ్ అది. ‘వాగు ఎండిపాయెరో’, ‘నల్లతుమ్మ’, ‘సంత’, ‘అద్దాల అంగడి’, ‘కంచెరేగి తీపివోలె’, ‘యలమంద’, ‘గల్లీ సిన్నది గరీబోల్ల కత పెద్దది’, ‘ఇద్దరం విడిపోతె’, ‘తరమెల్లిపోతున్నదో’... ఇత్యాది పాటలన్నీ ప్రతి శ్రోతకూ కంఠోపాఠం. ఆద్య కళలో పురుడు పోసు కుని తాత ముత్తాతల నుంచి వ్యాప్తమవుతూ తనదాకా వచ్చిన వాగ్గేయకార సంప్రదాయాన్ని సామాజికం చేసిన పాటల కథకుడు, పాటతల్లి పెద్దకొడుకు వెంకన్న! దళిత బహుజన స్పృహ, తెలంగాణ అస్తిత్వచైతన్యం, మార్క్స్ – అంబేడ్కర్ తాత్విక ధార, గ్రామీణ వాదం కలగలసిన శోభాయమాన గేయకవిత్వం వెంకన్నది. అమెరికన్ సంగీతవేత్త, పాటల కూర్పరి డేనియల్ జి. బ్రౌన్ వ్యాఖ్యానించినట్టు ఆయన పాటలు లాక్షణికత పాదపాదాన ఉట్టిపడుతూ కథాప్రధానం, సహజత్వం, జాను తెనుగు, నిర్దిష్ట వస్తువుతో కూడుకున్న విశిష్ట వస్తుగీతాలు. ‘ఎంత సల్లనిదమ్మ కానుగ నీడ/ ఎండ సెగనే ఆపె పందిరి చూడ/ తలపైన తడికోలె అల్లుకున్నాకులు/ తడిలేని వడగండ్ల తలపించు పూతలు/ నిలువు నాపరాయి తనువుల తనమాను/ ఇరిసిన విరగని పెళుసులేని మేను’ అంటూ వెంకన్న వర్ణించిన ‘కానుగ నీడ’ మనకో వైద్యోపనిషత్తు. ‘నోట మోదుగు సుట్ట నొసట నామంబొట్టు/ తలకు తుండు గుడ్డ మెడకు తులసి మాల/ ఏకుతారొక చేత సిరుతలింకొక చేత/ వేదాల చదువకున్న ఎరుక కలిగుండు/ రాగి బెత్తం లేని రాజయోగిలా ఉండు / ఆది చెన్నుడి అంశ మా నాయిన/ అపర దనుర్దాసు మా నాయన అంటూ పితృభక్తిని చాటుకున్న వెంకన్న పాట యువతకో జీవన నైపుణ్య పాఠం.తాను పుట్టి పెరిగిన పాలమూరు, దాపున్న దుందుభి, కాలు కొద్ది అలుపు సొలుపెరుగక తిరిగిన ప్రదేశాలు, ప్రాపంచికానుభవం నుండి ’క్వాట్రైన్స్ రూపుదిద్దుకుంటవి. ఇందుకు ‘ధరాంతమున ధ్వనించె నాదం/ దిగంతాలకే తాకిన వాదం/ తెలంగాణ జయశంఖారావం/ దాశరథి ఘన కవనపు యాగం/ ఎందరో వీరుల ఆశల స్వప్నం’ అంటూ ఎత్తుకున్న తెలంగాణ ‘వైభవ గీతిక’ ఒక ప్రబల సాక్ష్యం. కాళోజీ సాహిత్య వారసుడిగా వెంకన్న తెలుగువాళ్లకు తెలంగాణకు చాలినంత రాజకీయ ప్రబోధ చేశారు.అమెరికన్ పాటల సంప్రదాయంలో కొత్త కవితా వ్యక్తీకరణను సృష్టించినందుకు బాబ్ డిలన్‌కు స్వీడిష్ అకాడమీ నోబెల్ బహు మతినిచ్చింది. మరి, ఇంటా బయటా ఇరవై ఇరవై ఐదు కోట్లమంది ఆస్వాదించే తెలుగుపాటకు నూతన అభివ్యక్తితో పాటు సరికొత్త వస్తువునూ జోడించి, ఎపిక్ హోదా కల్పించిన వెంకన్నకు ఎన్ని నోబెల్స్ బాకీపడ్డాయో!– డా.బెల్లి యాదయ్య(గోరటి వెంకన్న రేపు అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుండి ‘గౌరవ డాక్టరేట్’ అందుకుంటున్న సందర్భంగా) -
అక్టోబర్ 5 నుంచి అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: డా. బీ. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ డిగ్రీ పరీక్షల తేదీలను బుధవారం ప్రకటించింది. డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 7 నుంచి 13 వరకు, ఐదో సెమిస్టర్ పరీక్షలను అక్టోబర్ 11 నుంచి 16 వరకు, ఆరో సెమిస్టర్ పరీక్షలను అక్టోబర్ 5 నుంచి 10 తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా డిగ్రీ (ఓల్డ్ బ్యాచ్) మూడో సంవత్సరం పరీక్షలను అక్టోబర్ 18 నుంచి 23 వరకు, రెండో సంవత్సరం పరీక్షలు అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు, మొదటి సంవత్సరం పరీక్షలు నవంబర్ 4 నుంచి 7 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. డిగ్రీ పరీక్షలను మధ్యాహ్నం 2.00 నుంచి 5.00 వరకు నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరు అయ్యే విద్యార్థులు, పరీక్ష తేదీకి రెండు రోజుల ముందే విశ్వవిద్యాలయ వెబ్ పోర్టల్ www.braouonline.in లో హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు వారి సంబంధిత ఆధ్యయన కేంద్రం లేదా విశ్వవిద్యాలయ వెబ్ సైట్ www.braou.ac.in ను సందర్శించ వచ్చని, మరింత సమచారం కోసం విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ 7382929570/580/590/600 ఫోన్ నెంబర్లకు సంప్రదించ వచ్చని సూచించారు. -
‘అందరి’ కల.. ఉన్నత విద్య
బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంతో సొంతం వివిధ కారణాలతో ఉన్నత విద్యకు దూరమైన వారికి ఆ విశ్వవిద్యాలయం ఓ ఆశాకిరణం. వివిధ ప్రాంతాల్లో ఉండే వారు సైతం అక్కడే ఉంటూ ఉన్నత విద్యను అభ్యసించే బృహత్తరమైన అవకాశాన్ని ఆ వర్సిటీ కల్పించింది. అదే డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం. దేశంలోనే మొట్టమొదటి సారిగా దూరవిద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన అంబేద్కర్ విశ్వవిద్యాలయం మంగళవారం 33వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నది. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయ ప్రగతిపై ప్రత్యేక కథనం. బంజారాహిల్స్: ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీగా 1982వ సంవత్సరం ఆగస్టు 26న విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట లెజిస్లేచర్ చట్టం కింద యూజీసీ గుర్తింపు కూడా లభించింది. 1982 ఆగస్టు 26న నాగార్జున సాగర్ వద్ద అప్పటి రాష్ట్రపతి జ్ఞానిజైల్‌సింగ్ ఈ వర్సిటీని ప్రారంభించారు. 1991 అక్టోబర్ 26న ఈ వర్సిటీకి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయంగా నామకరణం చేశారు. జూబ్లీహిల్స్‌లో క్యాంపస్‌ను 1986 జూన్ 1న నాటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ప్రారంభించారు. 53.63 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశ్వవిద్యాలయం చుట్టూ రాళ్లు, చెట్లు, చెరువు ప్రకృతి సౌందర్యంతో అలరారుతోది. పది కోర్సులో ప్రారంభమైన ఈ వర్సిటీ ప్రస్తుతం పలు విభాగాల్లో 70 కోర్సులను అందిస్తోంది. ఏటా లక్ష మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా 23 ప్రాంతీయ కేంద్రాల ద్వారా 216 స్టడీ సెంటర్లు కొనసాగుతున్నాయి. కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న గృహిణులు, రైతులు, కార్మికులు, పోలీసులు, ఖైదీలు ఇలా అందరికీ ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత ఈ యూనివర్సిటీ కే దక్కింది. సెంట్రల్ జైళ్లలో కూడా ఈ విశ్వవిద్యాలయం ద్వారా స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసి ఖైదీలకు విద్యను అందిస్తున్నారు. చర్లపల్లి, వరంగల్, రాజమండ్రి, వైఎస్సార్ జిల్లా (కడప), నెల్లూరు కేంద్ర కారాగారాల్లో అధ్యాయన కేంద్రాలను ఏర్పాటు చేసి డిగ్రీ, పీజీ కోర్సులను ప్రవేశపెట్టింది. తెలుగు, ఇంగ్లిష్, ఊర్దూ భాషల్లో కోర్సులను అందిస్తోంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులు కూడా అందుబాటులోకి తెచ్చారు. వర్సిటీ ఈ ఏడాది సీఎస్ఆర్ టాప్ డిస్టెన్స్ లెర్నింగ్ అనేక పేరొందిన విద్యాసంస్థలతో వివిధ కోర్సుల్లో ఎంఓయూ కుదుర్చుకుంది. అతి తక్కువ ఫీజులు తక్కువ ఫీజులతో విద్యను అందిస్తున్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం ఫీజు రూ. 1300, రెండు, మూడవ సంవత్సర ఫీజులు రూ. 1500 వసూలు చేస్తూ ఇందులోనే స్టడీ మెటీరియల్ కూడా అందిస్తున్నారు. నేడు వ్యవస్థాప దినోత్సవం యూనివర్సిటీ 33వ వ్యవస్థాపక దినోత్సవం మంగళవారం విశ్వ విద్యాలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించనున్నారు. విశ్వవిద్యాలయ ఇంచార్జ్ వైస్ చాన్సలర్ వికాస్ రాజ్ అధ్యక్షతన వ్యవస్థాపక వేడుకలు జరగనున్నాయి. రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ ప్రాక్టీస్ ఇన్ ఇండియన్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ అనే అం శంపై వ్యవస్థాపక లెక్చర్‌ను కాకతీయ విశ్వవిద్యాలయ మాజీ సంచాలకులు మురళీమనోహర్ ఇవ్వనున్నారు.


